ఇక తోక పార్టీలుగానే మిగిలిపోక తప్పదా?

వామపక్షాలు… ఒకప్పుడు పీడిత, తాడిత ప్రజల పార్టీలుగా వారి గుండెల్లో నిలిచిపోయాయి. వారి సంక్షేమం, అభ్యున్నతి కోసం అహర్నిశలు అలుపెరగకుండా పోరాడాయి. తద్వారా వారిని బలమైన ఓటు [more]

Update: 2020-12-27 16:30 GMT

వామపక్షాలు… ఒకప్పుడు పీడిత, తాడిత ప్రజల పార్టీలుగా వారి గుండెల్లో నిలిచిపోయాయి. వారి సంక్షేమం, అభ్యున్నతి కోసం అహర్నిశలు అలుపెరగకుండా పోరాడాయి. తద్వారా వారిని బలమైన ఓటు బ్యాంకులుగా మలచుకున్నాయి. భూమి కోసం, భుక్తి కోసం అంటూ వారి తరఫున పోరాడాయి. ఈ క్రమంలో స్వాతంత్ర్యం అనంతరం జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు గట్టిపోటీని ఇచ్చాయి. కొన్ని రాష్రాలలోనూ సత్తా చాటాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని కూడా ఆ పార్టీల నాయకులు భావించారు. ఈ క్రమంలోనే దక్షిణాదిన కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో 50వ దశకంలో తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్బవించింది. తదనంతరం తూర్పు రాష్రమైన పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతంలోని త్రిపురలో సర్కార్లను ఏర్పాటు చేసింది.

కొన్ని రాష్ట్రాల్లో……

సుదీర్ఘ కాలం ఈ రెండు చోట్ల ప్రభుత్వాలను నడిపింది. పంజాబ్, బీహార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టల్లోనూ గట్టి రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇదంతా గతం. వర్తమానం విచారకరంగా ఉంది. బలోపేతం కావడం పక్కనపెడితే వామపక్షాలు ప్రస్తుతం మనుగడకే కిందామీదా పడుతున్నాయి. నానా హైరానా పడుతున్నాయి. ప్రతి చోటా ఏదో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఉనికి కనపడని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఎక్కడా సొంతబలంలో ఒక్క పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందలేని దుస్థితిలో ఉందనడం అతిశయోక్తి కాదు.

రెండూ విడిపోయి….

సీపీఐ పార్టీ నుంచి 1964లో సీపీఎం విడిపోవడం తదనంతరం రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ ఎస్ పీ), ఫార్వర్డ్ బ్లాక్ , సీపీ ఐ (ఎంఎల్) తదితర పార్టీలుగా చీలిపోవడంతో కమ్యూనిస్టు పార్టీ కుదేలైంది. ప్రాంతీయ పార్టీల రాకతో వీటి ఓటు బ్యాంకు అటు వైపు మళ్లింది. జాతీయ భావనలు, మతాలకు సంబంధించిన ప్రజల ఆలోచనల్లో మార్పులు సైతం వామపక్షాలను దారుణంగా దెబ్బతీశాయి. ఇప్పుడు సీపీఐ, సీపీఎం పేరుకే జాతీయ పార్టీలు. ప్రకటనలు, పిలుపులు, ఖండనలు, ఆందోళనలు, ఆవేదనలు వ్యక్తం చేయడానికే పార్టీలు పరిమితమయ్యాయి.

పార్లమెంటు స్థానాలు….

దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లకు సీపీఎం బలం మూడు, సీపీఐ బలం రెండింటికే పరిమితం. దక్షిణాదిన పొత్తుల వల్లే ఈ మాత్రమైనా సీట్లు వచ్చాయి. ఉత్తరాదిన పార్టీ ల ఊసే లేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకేతో పొత్తు కారణంగా సీపీ ఐ అభ్యర్థి టీకే సుబ్బరాయన్ తిర్పూర్ లో, నాగపట్నంలో ఎం. నెల్వరసు గెలుపొందారు. మధరై, కోయంబత్తూర్ లో సీపీఎం అభ్యర్థులు ఎస్. వెంకటేశన్, పీఆర్ నటరాజన్ గెలుపొందారు. సీపీఎంకు కంచుకోటగా పేరుగాంచిన కేరళలో ఒకే ఒక సీటులో విజయం సాధించింది. అలప్పుజ స్థానం నుంచి సీపీఎం నాయకుడు ఏఎం. ఆరిఫ్ గెలుపొందారు. కంచుకోటల్లాంటి పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు.

ఊపిరి పోశాయి……

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలకు ఊపిరిపోశాయి. సీపీఐ, సీపీఎం చెకో రెండు సీట్లు సాధించాయి. మరో వామపక్ష పార్టీ సీపీఐ (ఎంఎల్) ఏకంగా 12 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. 2010, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం లకు ఒక్క సీటూ రాని నేపథ్యంలో ఈ విజయం ఎంతో ఊరట ఇచ్చింది. సీపీఐ (ఎంఎల్) కూడా తన బలాన్ని 9 నుంచి 12కు పెంచుకుంది. సీపీఎం 2,74, 155 ఓట్లు, (0.71 శాతం), సీపీఐ 3,49, 489 ఓట్లు (0.8 శాతం) సాధించాయి. సీపీఐ (ఎంఎల్) 13,33,569 ఓట్లు (3.21 శాతం) సాధించింది. తన ఓట్ల శాతాన్ని గతంలో కన్నా 1.66 శాతం పెంచుకోవడం గమనార్హం. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలకు ఊపిరి పోశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News