దగ్గుబాటి మళ్లీ బాబుకు దగ్గరవుతున్నారా?

చంద్రబాబు తో పాటు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా మాత్రం లాభం పొందలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి ఇస్తానని ఊరించి మొత్తానికి దగ్గుబాటిని [more]

Update: 2021-05-13 15:30 GMT

చంద్రబాబు తో పాటు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా మాత్రం లాభం పొందలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి ఇస్తానని ఊరించి మొత్తానికి దగ్గుబాటిని తన క్యాంప్ లోకి లాగేసిన చంద్రబాబు ఎన్టీయార్ కి టోటల్ ఫ్యామిలీ యాంటీ అని చూపించి జనాల్లో సానుభూతి లేకుండా చేయగలిగారు. ఆ తరువాత అవసరం తీరింది, దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేశారు. అది లగాయితూ తోడల్లుడిది రాజకీయమంతా గత వైభవమే తప్ప పాతికేళ్ళుగా ఏనాడూ వెలుగు వెలిగింది లేదు. ఈ క్రమంలో ఆయన మెట్టని పార్టీ మెట్లు లేవు, కప్పని కండువా లేదు అన్న విమర్శలూ ఉన్నాయి.

మళ్ళీ ఆ పార్టీలోకే….?

బీజేపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండు దశాబ్దాల క్రితం చేరారు. ఆయన నాడు వాజ్ పేయ్ వేవ్ ఉన్న వేళ కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో కొన్నాళ్ళు ఉన్నారు. అయితే కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, ఏపీ వరకూ చూసుకుంటే టీడీపీదే పెత్తనం కావడంతో 2004 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. అలా తాను ఎమ్మెల్యేగా, తన సతీమణి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కుటుంబంలో భార్య పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయిందన్న ఆనందం తప్ప దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను స్వయంగా ఏ అధికార పదవినీ సాధించలేకపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన సొంత సీటు పరుచూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఫ్యాన్ నీడన ఉక్క బోతగా ఉందంటూ తప్పుకున్నారు. ఇపుడు లేటెస్ట్ గా ఆయన చూపు మళ్లీ బీజేపీ మీద పడింది అంటున్నారు.

అదీ లెక్క …?

దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరిని కలిశారు అని ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు నేతలూ చాలా సేపు వర్తమాన రాజకీయల గురించి చర్చించుకున్నారు అంటున్నారు. దాంతో దగ్గుబాటి బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారన్న టాక్ మొదలైంది. ఇదిలా ఉంటే ఆయన సతీమణి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాంతో తాను కూడా బీజేపీలో ఉంటేనే ఫ్యామిలీ పాలిటిక్స్ సేఫ్ గా సాగుతాయన్న ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇక 2024 నాటికి ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నమ్ముతున్నారుట. అలాగైతే తాను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారుట. ఇక కేవలం జనసేనతో మాత్రమే పొత్తు ఉంటే తన సొంత సీటు పరుచూరి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని కూడా ఆప్షన్ రెడీ చేసి పెట్టుకున్నారుట.

ఫ్యామిలీ ఒక్కటేనా…?

ఇవన్నీ చూస్తూంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు మళ్లీ ఒక్కటిగా ఉండబోతున్నారు అన్నది అర్ధమవుతోంది. అయితే నేరుగా చంద్రబాబు పార్టీలో చేరి ఆయన కింద పనిచేయడం దగ్గుబాటికి ఇష్టం లేదు. దాంతో మిత్ర పక్షం తరఫున తాను నేతగా ఉంటూ టీడీపీ సాయాన్ని అందుకోవాలని, టీడీపీకి కూడా ఏపీలో సాయపడాలని ఆలోచిస్తున్నారుట. ఇక పురంధేశ్వరి కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా విజయవాడ నుంచైనా విశాఖ నుంచైన పోటీ చేస్తారు అంటున్నారు. మొత్తానికి చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంతో మళ్ళీ పాతికేళ్ల తరువాత ఎన్టీయార్ ఫ్యామిలీ ఒక్కటిగా ముందుకు రాబోతోంది అంటున్నారు. దీని వెనక బాబు మాస్టర్ ప్లాన్ కూడా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News