దానం గుంపులో గోవిందయ్యేనా?

కొందరు నేతలు అంతే. పార్టీని బట్టి వారి వ్యవహారశైలి ఉంటుంది. జెండాను బట్టి వారి దూకుడు ఉంటుంది. సమయం కలసి రాకపోతే ఎంతటి నేత అయినా ఏమైపోయాడన్న [more]

Update: 2021-06-27 09:30 GMT

కొందరు నేతలు అంతే. పార్టీని బట్టి వారి వ్యవహారశైలి ఉంటుంది. జెండాను బట్టి వారి దూకుడు ఉంటుంది. సమయం కలసి రాకపోతే ఎంతటి నేత అయినా ఏమైపోయాడన్న ప్రశ్న తలెత్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి అలాగే ఉంది. ఒకప్పుడు దానం నాగేందర్ హైదరాబాద్ సిటీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహపడేవాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అయితే దానం నాగేందర్ లేకుంటే సిటీ లో కాంగ్రెస్ హడావిడి కన్పించేది కాదు.

కాంగ్రెస్ లో కీలక నేతగా…?

దానం నాగేందర్ కాంగ్రెస్ లో కీలక నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మందీ మార్బలంతో దానం నాగేందర్ తన హవాను కొనసాగించేవారు. కార్మిక శాఖమంత్రిగా పనిచేసిన దానం నాగేందర్ టీడీపీకి కూడా వెళ్లివచ్చారు. అయితే అది తక్కువ కాలమే. దానం నాగేందర్ కు కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్ష పదవి కూడా అప్పగించింది. 2014లో ఓటమి పాలయిన తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ క్రమంగా దూరమవుతూ వచ్చారు.

ఎన్నికలకు ముందు పార్టీలో చేరి….

2018 ఎన్నికలకు ముందు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ లో అసలు దానం ఉన్నారా? లేదా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. తన నియోజకవర్గాన్ని మినహాయించి నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన జోక్యం చేసుకోవడం లేదు.

నియోజకవర్గానికే….

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ దానం నాగేందర్ తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ లో చేరినందుకు ఎమ్మెల్యే అయ్యానని సంతోషిించాలో.. గతంలో సిటీపై ఉండే పట్టు పోతుందని బాధపడాలో తెలియని పరిస్థితి దానం నాగేందర్ ది. ఆయన మంత్రి అయ్యే అవకాశాలు కూడా తక్కువేనంటున్నారు. టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే అయినా ఆయన సంతోషంగా లేరన్నది వాస్తవం. తాను ఆశించిన అవకాశాలు రావడం కూడా కష్టమే. బీసీ నేతగా ఆయనకు గుర్తింపు కూడా దక్కడం కష్టమే.

Tags:    

Similar News