మరీ వీక్ అయిన వీకెండ్ కామెంట్

పచ్చ ఛానెల్స్ పత్రికల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి మొదటి స్థానం. అందులో వుండే చంద్రబాబు భజన కు టిడిపి వారికే ఒక్కోసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. పరిధులు [more]

Update: 2020-10-11 13:30 GMT

పచ్చ ఛానెల్స్ పత్రికల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి మొదటి స్థానం. అందులో వుండే చంద్రబాబు భజన కు టిడిపి వారికే ఒక్కోసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. పరిధులు మించి మరీ వేమూరి రాధాకృష్ణ చేసే వ్యాఖ్యలు పెట్టే చర్చలు పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పుడు హాట్ టాపిక్ గానే సాగుతాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ నేత చంద్రబాబే అని కీర్తించే ఆర్కే, ఆయన అధికారం కోల్పోతే మాత్రం అస్సలు తట్టుకోలేని నైజాన్ని నిస్సిగ్గుగా బయటపడిపోతూ ఉంటారు. ఇక రోజూ తన మీడియా లో అధికారపార్టీ పై నిప్పులు చెరుగుతూనే ఉంటారు. తాజాగా జగన్ సర్కార్ న్యాయవ్యవస్థపై దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొదలు పెట్టిన యుద్ధంపై వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో రాధాకృష్ణ విచిత్ర వాదన చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. అదే ఇప్పుడు చర్చనీయంగా కూడా మారింది.

యూపీఏ పెద్దల వల్లే బెయిల్ వచ్చిందిట …?

తన వీకెండ్ కామెంట్ లో ఆర్కే చిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. సుప్రీం చీఫ్ జస్టిస్ కాకుండా ఎన్ వి రమణ ను అడ్డుకోవడమే జగన్ లక్ష్యమని పేర్కొంటూ క్రిమినల్స్ న్యాయవ్యవస్థ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో వైసిపి అధినేత జగన్ కు సుప్రీం లో బెయిల్ రావడం వెనుక యుపిఎ పెద్దల సహకారం అందినట్లు నిర్ధారించారు. అంటే న్యాయవ్యవస్థ రాజకీయ ప్రభావితం తోనే స్టే లు, తీర్పులు, ఆదేశాలు ఇస్తుందని స్వతంత్ర వ్యవస్థ గా నడవడం లేదని ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు పెట్టిన ఆరోపణలు మరో రకంగా నిజమనే వాదన ఆర్కే చేసినట్లు అయ్యింది. యుపిఎ ప్రభుత్వ పెద్దలు సహకరించడం అంటే కోర్టు లను కేంద్రం లో అధికారంలో ఉండేవారు ప్రభావితం చేస్తారనే ప్రజల్లో అనుమానాలను నిర్ధారించినట్లే అయ్యిందని ఈ వాదన ఆర్కే చేయకుండా ఉంటే మంచిదని టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

వైసిపి కి అస్త్రం దొరికినట్లేనా … ?

ఆర్కే వితండ వాదనలు వింత వింతగా ఉంటాయి. నాడు యుపిఎ సర్కార్ ను తన బెయిల్ విషయంలో ఉపయోగించుకున్న జగన్ నేడు తెలుగు వాడు చీఫ్ జస్టిస్ గా రావడం ఇష్టం లేక ప్రధానిని అడ్డుపెట్టుకుంటున్నట్లు ప్రచారం మొదలు పెట్టి పాయింట్ లేని వాదన తెరపైకి తెచ్చారు రాధాకృష్ణ. ఏటికి ఎదురీదే మనస్తత్వం ఉన్న జగన్ గతంలో సోనియా తో విభేదించడం వల్లే కేసులు, జైలు జీవితం ఎదుర్కొవాలిసి వచ్చిందని జనం నమ్మే ఓట్లేసి వైసిపి కి అధికారం ఇచ్చారు. అయితే సోనియా తో కుమ్మక్కు కావడం వల్లే నాడు బెయిల్ వచ్చిందని అలాగే నేడు ప్రధాని తో జగన్ కుమ్మక్కు అయ్యి న్యాయవ్యవస్థపైనే యుద్ధం ప్రకటించి రేపు తాను జైలుకు వెళ్లినా నెపం ఆ వ్యవస్థపై నెట్టే కుట్రగా ఆర్కే తేల్చినా ఈ రెండిటికి పొంతన కుదరడం లేదు. ఒక పక్క న్యాయవ్యవస్థ పరమ పవిత్రం అని పేర్కొన్న వ్యక్తే యుపిఎ ప్రభుత్వ పెద్దలు ఆ వ్యవస్థను మేనేజ్ చేసి కేసులు పెట్టించి తిరిగి జగన్ తో డీల్ కుదుర్చుకుని బెయిల్ ఇప్పించారనడం చూస్తే జనంలో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన స్తంభంపై నమ్మకాలు మరింత సన్నగిల్లే ప్రమాదం పొంచి ఉంది.

జస్టిస్ చలమేశ్వర్ రోడ్డెక్కినప్పుడు కూడా …

న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలపై సుప్రీం కోర్ట్ జడ్జీలు కొందరు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దేశంలో పరిరక్షించుకోవాలిసిన ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు, వ్యక్తులు పార్టీలు, కార్పొరేట్ సంస్థలు నియంత్రించే స్థాయి ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే ప్రయత్నాలు ఎప్పటినుంచో సాగుతూనే ఉన్నాయి. మరో పక్క న్యాయవ్యవస్థ మరింత బలహీన పడే విధంగానే ఏ ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నా తమ చర్యలు కనిపిస్తున్నాయి. న్యాయస్థానాల్లో నమోదవుతున్న కేసులకు సరిపడా మౌళిక వసతులు కానీ, న్యాయమూర్తులు కానీ, సిబ్బంది కానీ లేనే లేరు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి తప్ప ఈ సమస్యకు పరిష్కారం మాత్రం కించిత్తు ప్రభుత్వాలు చేయడం లేదు. ఫలితంగా దశాబ్దాలుగా పెండింగ్ లో కేసుల సంఖ్య లక్షలకు చేరుతుంది. ఇలాంటి స్థితినుంచి దేశాన్ని కాపాడాలని ఒకప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ ప్రధాని ముందే కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం గుర్తు చేసుకోవాలి.

సమూల ప్రక్షాళన తక్షణ కర్తవ్యం …

రాజకీయ వ్యవస్థలు, అందులోని వ్యక్తులతో సంబంధం లేని న్యాయవ్యవస్థను ప్రజలు కాంక్షిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కు ఒక కేసులో 15 ఏళ్లపాటు కోర్ట్ స్టే కొనసాగించడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యింది. వ్యవస్థలను బాబు ప్రభావితం చేస్తారనే ప్రచారానికి ఆ స్టే బలపరుస్తుంది. ఇప్పుడు ఆ కేసుకు కదలిక వచ్చినా అనేక కోర్ట్ లు దాటి ఫైనల్ తీర్పు రానుండటంతో డబ్బు పలుకుబడి ఉన్నవారు న్యాయస్థానాలతో ఆడుకోవచ్చన్న ఆరోపణలకు, విమర్శలకు అద్దం పట్టే అవకాశం ఉంది. దీనికి అవసరమైన చర్చ దేశంలో మేధావుల్లో జరగాలి. రేప్ జరిగిన కేసుల్లో రెండు నెలల్లో శిక్ష పడాలని కేంద్ర హోమ్ శాఖ తాజాగా పేర్కొంది. అలాగే అన్ని కేసుల్లో విచారణ పరిధిని నిర్ధారిస్తే నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం తో బాటు న్యాయవ్యవస్థపై గౌరవం మరింతగా పెరుగుతుంది. అందుకు అవసరమైన సౌకర్యాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.

Tags:    

Similar News