ఢిల్లీ పిలవడంలేదా… ?

దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సొంత రాజకీయం ఉన్నా ఢిల్లీతో ఎవరికి వారికి బాగానే కనెక్షన్లు ఉంటాయి. తమ సొంత రాజకీయంతో [more]

Update: 2021-05-31 08:00 GMT

దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సొంత రాజకీయం ఉన్నా ఢిల్లీతో ఎవరికి వారికి బాగానే కనెక్షన్లు ఉంటాయి. తమ సొంత రాజకీయంతో పాటు జాతీయ రాజకీయాన్ని కూడా గమనిస్తూ రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మిగిలిన రాష్ట్రాల నాయకులు. నిన్ననే సీఎం గద్దెనెక్కిన స్టాలిన్ అపుడే మోడీ మీద జాతీయ విపక్ష పార్టీలు లేఖస్త్రం సంధిస్తే అందులో సంతకం పెట్టి తానూ ఉన్నాను అనిపించుకున్నాడు. ఇక బెంగాల్ దీదీ అయితే మొత్తం నేషనల్ పాలిటిక్స్ కి తానే కరదీపిక అంటారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల వారు ఢిల్లీని తలవకుండా ఉండలేరు.

ఖాళీ ఉన్నా …?

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సీనియర్ నేతగా టీడీపీ అధినేత చంద్రబాబుని చెప్పుకోవాలి. ఆయన జాతీయ స్థాయిలో అనేక ఫ్రంట్లు కట్టిన అనుభవశాలి. అంతదాకా ఎందుకు 2019 ఎన్నికలకు ముందు కూడా కాలికి బలపం కట్టుకుని ఆయన అన్ని రాష్ట్రాలు తిరిగారు. అటువంటి చంద్రబాబు ఇపుడు ఢిల్లీ వైపు కన్నెత్తి చూడడంలేదు. నిజానికి ఇపుడు సరైన అవకాశం ఉంది. మోడీ పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది కానీ పిల్లి మెడలో గంట కట్టే వారు లేకుండా పోయారు. చంద్రబాబు ఈ టైమ్ లో అన్ని చోట్లకూ తిరిగి అందరికీ కలిపితే మోడీకి యాంటీగా బ్రహ్మాండమైన ఫ్రంట్ వంటకం తయారవుతుంది. కానీ చంద్రబాబు నో ఢిల్లీ పాలిటిక్స్ అంటున్నారు. ముందు ఏపీలో జగన్ని దించితే అదే పదివేలు అని భావిస్తున్నారు.

రెండో వైపు చూడరంతే …?

ఇక ఏపీలో సీఎం గా ఉన్న జగన్ తనదైన పాలనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. పైగా అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం గా కూడా పేరు పొందారు. కానీ జగన్ కి జాతీయ రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదు. అదే సమయంలో ఆయన విపక్ష శిబిరం వైపు తొంగి చూడడంలేదు. అలాగని బీజేపీ తోనే ఉండిపోతారా అంటే అదీ పెద్ద డౌటే. అప్పటి సంగతి అపుడే తేల్చుకుందామన్నది జగన్ నైజం. ఇక ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఢిల్లీ వెళ్లే పనులు పెద్దగా పెట్టుకోవడంలేదు. ఆ మధ్యన వరసపెట్టి హస్తిన టూర్లు కొట్టిన జగన్ ఇపుడు తాడేపల్లి ఇల్లు దాటడంలేదు.

అవసరం లేదుగా…?

ఇక బీజేపీ వంటి బలమైన జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కి ఇపుడు ఢిల్లీతో పని లేదని అంటున్నారు. బీజేపీతో పవన్ దోస్తీని కలిపిన ఆరెస్సెస్ లీడర్ రామ్ మాధవ్ ఇపుడు ఎక్కడ ఉన్నారో పెద్దగా తెలియదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏడాది పై దాటినా అమిత్ షా, మోడీ దర్శన భాగ్యం కలగలేదు. తిరుపతి సీటు కోసం బీజేపీ పెద్దలను కలసిన అనుభవాలు ఇప్పటికి చాలు అన్నదే జనసేనాని మనోగతంగా ఉందిట . దాంతో పవన్ ఢిల్లీ టూర్లు ఇప్పట్లో ఉండవని అంటున్నారు. విపక్ష శిబిరం వైపు కూడా ఆయన తొంగి చూసే చాన్స్ లేనే లేదు. 2019 ఎన్నికల వేళ బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఏపీకి తెచ్చారు. అది అంతటితో సరి. జాతీయ విపక్ష నేతలతో అంతకు మించి బంధం వద్దు అనేసుకున్నారులా ఉంది. మొత్తానికి చూస్తే ఏపీ నేతలకు ఢిల్లీ పలకడంలేదు, పిలుపులూ వలపులూ కూడా లేవు అంటున్నారు.

Tags:    

Similar News