తేనెతుట్టెను కదిలించారా?

రాజధాని అంటే ఒక చోట కూర్చుని పాలించడానికి. చరిత్రలో దీనికి అంతవరకే ప్రాధాన్యతను ఇచ్చారు అప్పటి రాజులు. ఇక ఆధునిక కాలంలో ప్రజాస్యామ్యంలో కొందరు ముఖ్యమంత్రులు ముందు [more]

Update: 2019-12-21 15:30 GMT

రాజధాని అంటే ఒక చోట కూర్చుని పాలించడానికి. చరిత్రలో దీనికి అంతవరకే ప్రాధాన్యతను ఇచ్చారు అప్పటి రాజులు. ఇక ఆధునిక కాలంలో ప్రజాస్యామ్యంలో కొందరు ముఖ్యమంత్రులు ముందు చూపులేని కారణంగా రాజధానులు అభివ్రుధ్ధికి మారుపేరుగా మారిపోయాయి. ఒక్కచోటే కుప్పపోసినట్లుగా అభివ్రుధ్ధిని అక్కడే పరచేయడంతో మిగిలిన ప్రాంతాలు నోరూ వాయీ లేకుండా మూగరోదన అనుభవిస్తూ వచ్చాయి. రాజధాని దెబ్బ అంటే ఏంటో హైదరాబాద్ ని వదిలేసి వచ్చాకే సీమాంధ్రులకు అర్ధమైంది. దాంతో ఇపుడు రాజధాని మాకు కావాలంటే మాకు కావాలని ప్రతీ చోటా అంటున్నారు. నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు రాయలసీమ వాసి అయినప్పటికి కోస్తాలో రాజధాని పెట్టడంతో కొత్త గొడవలు నాడే మొదలయ్యాయి.

జగన్ మార్క్ పాలన…..

బాబు అయిదేళ్ళ పాలనలో అమరావతితో పాటు ఏపీవ్యాప్తంగా కూడా జనం అసంతృప్తి వెళ్ళగక్కారు. రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించిన పాపానికి అక్కడే ఓడిస్తే మాకేంటి చేశారంటూ మిగిలిన ప్రాంతాల ప్రజలూ శఠగొపం పెట్టారు. ఈ తీర్పు నుంచి బాబు కంటే కూడా గుణపాఠం నేర్చుకున్నది జగన్ మాత్రమే. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పాలనను వికేంద్రీకరించాలని జగన్ తపన పడుతున్నారు. దానికి తగినట్లుగానే ఆయన దూకుడు నిర్ణయాలు కూడా ఉంటున్నాయి.

మూడుతో ఆగుతుందా..?

జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలో చివరి రోజు వేడి పుట్టించారు. ఏపీకి ఒకటి కాదు, మూడు రాజధానులు రాబోతున్నాయంటూ వేళ్ళు లెక్కబెట్టి మరీ చూపించారు. దీంతో గింగిరాలు కొట్టడం ప్రతిపక్ష టీడీపీ వంతు అయితే కర్నూలు, విశాఖ జనం ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంతటితో అధికార వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు హాయిగా ఉంటాయనుకుంటే పొరపాటే అంటున్నారు నవీన్ కుమార్ రెడ్డి. ఆయన ఎవరో కాదు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ గా ఉన్న నవీన్ తిరుపతిని ఎందుకు రాజధానిగా చేయరంటున్నారు.

ఆధ్యాత్మిక రాజధాని అట …..

తిరుపతి కంటే ప్రాముఖ్యత కలిగిన నగరం ఉంటుందా అని నవీన్ నిలదీస్తున్నారు. ప్రధాని మొదలు ముఖ్యమంత్రి వరకూ తిరుమలేశుని దర్శనం కోసం ప్రతీసారీ వస్తూంటారని ఆయన అంటున్నారు. అటువంటి తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తించాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఊరుకోమని కూడా తెగేసి చెబుతున్నారు. అంటే అచ్చంగా నాలుగవ రాజధాని నగరం అన్న మాట.

అసెంబ్లీ పెట్టాలట…..

ఇక కర్నూలు లో హైకోర్టు పెడతామని జగన్ నిండు సభ సాక్షిగా ప్రతిపాదించారు. దానికి స్వాగతం పలుకుతూనే సీమవాసులు మరిన్ని కొత్త డిమాండ్లు తెరమీదకు తెస్తున్నారు. సీనియర్ నేత, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అయితే హైకోర్టుతో పాటు మినీ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయాలని అంటున్నారు. సీమ హక్కుల సాధన నేతలు అయితే మరో అడుగు ముందుకేసి హైకోర్టుతో ఏమొస్తుంది. జిరాక్స్ ఆఫీసు, టీ కొట్లు తప్ప, అందువల్ల ఏకంగా రాజధానిగానే కర్నూలుని చేయమంటున్నారు. మరి ఈ డిమాండ్లు అన్నీ విని జగన్ ఏమంటారో. చూడబోతే ఇది కదిలి కదిలి తేనెతుట్టెలా మారుతున్నట్లుగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News