డ్యామేజీ ఖాయమటగా

చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత…కుటుంబ పార్టీగా ముద్రపడి అప్పనంగా వచ్చిందని పదవులన్నీ తనోళ్లకే కట్టబెడితే ఊరుకుంటారా? ఎవరికి మాత్రం ఆత్మాభిమానం ఉండదు. అందరూ రాజకీయంగా ఎదగాలనుకునేవాళ్లే. ఒక చెట్టు [more]

Update: 2019-09-14 18:29 GMT

చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత…కుటుంబ పార్టీగా ముద్రపడి అప్పనంగా వచ్చిందని పదవులన్నీ తనోళ్లకే కట్టబెడితే ఊరుకుంటారా? ఎవరికి మాత్రం ఆత్మాభిమానం ఉండదు. అందరూ రాజకీయంగా ఎదగాలనుకునేవాళ్లే. ఒక చెట్టు నీడనే నమ్ముకునే రోజులు పోయాయి. ఇప్పుడు జనతాదళ్ ఎస్ లో ఇదే పరిస్థితి కన్పిస్తుంది. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారుడు కుమారస్వామి వ్యవహారశైలికి జేడీఎస్ నేతలు విసిగిపోయారంటున్నారు. సంకీర్ణ సర్కార్ లో సజావుగా సాగుతున్న దానిని చేజేతులా తండ్రీకొడుకులిద్దరే కూలదోశారని ఆ పార్టీలో ఎమ్మెల్యేలు బలంగా నమ్ముతున్నారు.

కుటుంబ పార్టీగా…..

కర్ణాటకలో సంకీర్ణ సర్కారు ఏర్పడిన తర్వాత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సోదరుడు రేవణ్ణను మంత్రిని చేశారు. భార్యను ఎమ్మెల్యే చేశారు. ఎంపీ ఎన్నికల్లో దేవెగౌడతో పాటు ఆయన మనవలు ప్రజ్వల్, నిఖిల్ గౌడలు బరిలోకి దిగారు. ఇలా కుటుంబ పార్టీగా గతంలో ఎన్నడూ లేని విధంగా జేడీఎస్ కు చెడ్డ పేరు వచ్చింది. దేవెగౌడకు వయసు మీద పడుతున్న కొద్దీ కుటుంబ సభ్యుల వత్తిడికి తలొగ్గుతున్నారన్నది పార్టీలోనే విన్పిస్తున్న మాట. అంతేకాదు కుమారస్వామి కూడా తక్కువేమీ కాదంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న 14 నెలల్లో పార్టీ నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారంటున్నారు.

ప్రభుత్వం పడిపోవడానికి…..

ఇక సంకీర్ణ సర్కార్ కుప్పకూలిపోవడానికి తండ్రీ కొడుకులు కూడా కారణమన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న అంశం. దేవెగౌడ నేరుగా హస్తిన వెళ్లి అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కు ఇక్కడి నేతలపై ఫిర్యాదు చేస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి సంఖ్యాబలం తన కంటే ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ ను, ఆ పార్టీ సభ్యులను చిన్నచూపు చూశారు. అందుకే కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తితో రాజీనామా చేశారన్నది కొందరి వాదన. జేడీఎస్ నుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోవడానికి కారణం తండ్రీ కొడుకుల వ్యవహార శైలి అన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

మరో ఆరుగురు ఎమ్మెల్యేలు…..

తాజాగా జనతాదళ్ ఎస్ కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ 37 మంది సీట్లను గెలుచుకుంది. వీరిలో ముగ్గురు వెళ్లిపోయారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీ నేతలతో టచ్ లో ఉండగా మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తుండటం విశేషం. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అతి త్వరలోనే పార్టీని వీడతారని సమాచారం. మరి ఇప్పటికైనా దళపతి దేవెగౌడ మేలుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News