అవినాష్ అలా చేరగానే?

ఎట్టకేల‌కు దేవినేని అవినాష్ కోరిక తీరింది. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు చేయాల‌న్నది దేవినేని అవినాష్ కోరిక‌. దేవినేని అవినాష్ తండ్రి, దివంగ‌త దేవినేని నెహ్రూ రాజ‌కీయాలు [more]

Update: 2019-11-21 11:00 GMT

ఎట్టకేల‌కు దేవినేని అవినాష్ కోరిక తీరింది. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు చేయాల‌న్నది దేవినేని అవినాష్ కోరిక‌. దేవినేని అవినాష్ తండ్రి, దివంగ‌త దేవినేని నెహ్రూ రాజ‌కీయాలు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే కొన‌సాగాయి. 2009, 2014 ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ నుంచి ఆయ‌న ఇక్కడే పోటీ చేశారు. ఇక ఈ ఎన్నిక‌ల‌కు ముందు తండ్రితో క‌లిసి దేవినేని అవినాష్ టీడీపీలో చేరారు. వాస్తవంగా నెహ్రూ ఉండి ఉంటే ఆయ‌న‌కే టీడీపీ సీటు ఇచ్చేవారేమో. నెహ్రూ మృతి త‌ర్వాత దేవినేని అవినాష్ కు పార్టీలో ప్రయార్టీ త‌గ్గింది. చివ‌ర‌కు తెలుగు యువ‌త ప‌ద‌వి ఇచ్చేందుకు కూడా వెయిట్ చేయించి ఎన్నిక‌ల‌కు ముందే ఇచ్చారు.

టీడీపీలో కొనసాగితే….

త‌న‌కు పోటీ చేయ‌డం ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతంగా గుడివాడ‌కు పంపగా అక్కడ దేవినేని అవినాష్ కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత కూడా గుడివాడ‌లో రాజ‌కీయం చేసేందుకు దేవినేని అవినాష్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక దేవినేని అవినాష్ పార్టీ మారిపోతార‌న్న లీకులు రావ‌డంతో అలెర్ట్ అయిన టీడీపీ అధిష్టానం తూర్పు ప‌గ్గాలు ఇచ్చే విష‌యంలో ఎంత‌కు క్లారిటీ ఇవ్వలేదు. దేవినేని ఉమ కొంతకాలం సర్దిచెప్పగలిగారు. చివ‌ర‌కు దేవినేని అవినాష్ తాను టీడీపీలో ఉంటే తూర్పు ప‌గ్గాలు రావ‌ని.. గుడివాడ‌కే ప‌రిమితం చేస్తార‌ని డిసైడ్ అయ్యారు.

వైసీపీలో చేరిన వారంలోపే….

విజ‌య‌వాడ న‌గ‌ర రాజ‌కీయాల్లోనే కీల‌కంగా ఉండాల‌ని డిసైడ్ అయిన దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసిన గంట‌లోనే వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఇక అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఆయ‌న‌కు పార్టీలో చేరిన వారం రోజుల్లోపే తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చేశారు. ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న బొప్పన భ‌వ‌కుమార్‌కు విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీ ప‌గ్గాలు అప్పగించారు. దీంతో ఎట్టకేల‌కు దేవినేని అవినాష్ కోరిక తీరిన‌ట్లయ్యింది.

సీనియర్లు ఉన్నా…..

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల బ‌దిలీలు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమ‌లు, అధికారుల‌తో ఇత‌ర‌త్రా సంప్రదింపులు అన్ని కూడా ఇక‌నుంచి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలోనే న‌డుస్తాయి. ఇక్కడ నుంచి ప్రస్తుతం టీడీపీకి చెందిన గ‌ద్దె రామ్మోహ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట ఇక్కడ మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. ఆ త‌ర్వాత ఈ ఎన్నిక‌ల్లో పీవీపీ ఒత్తిడి మేర‌కు కార్పొరేట‌ర్‌గా ఉన్న బొప్పన భ‌వ‌కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు దేవినేని అవినాష్ ఇన్‌చాఛార్జ్ అయ్యారు.

Tags:    

Similar News