ఎందుకంత స్పెషల్.. అవినాష్ ఒక్కడికే?

సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి ప‌లువురు కీల‌క నేత‌ల వ‌ర‌కు అధికార వైసీపీలోకి జంప్ చేసేశారు. అధికారికంగా [more]

Update: 2021-01-13 02:00 GMT

సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి ప‌లువురు కీల‌క నేత‌ల వ‌ర‌కు అధికార వైసీపీలోకి జంప్ చేసేశారు. అధికారికంగా వైసీపీలో చేర‌డానికి ఇబ్బంది ప‌డిని టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ వార‌సుల‌ను, కుటుంబ స‌భ్యుల‌కు జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పించేశారు. ఈ లిస్టులో చాలా మంది నేత‌లే ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి, విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్‌, గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీతో పాటు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన తోట త్రిమూర్తులు, అడారి ఆనంద్ లాంటి నేత‌లు కూడా ఉన్నారు.

పార్టీలో చేరిన వెంటనే….

ఈ లిస్టులోనే గుడివాడ‌లో టీడీపీ త‌ర‌పున ఓడిన దేవినేని అవినాష్ సైతం ఉన్నాడు. దేవినేని అవినాష్ పార్టీలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ ఆల‌స్యం చేయ‌కుండా విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కూడా ఇచ్చేశారు. పార్టీ మారిన నేత‌ల్లో ప్రతి ఒక‌రు ఇబ్బందులు ప‌డుతున్నారు. టీడీపీలో ఉండ‌గా రాష్ట్ర స్థాయిలో కీల‌క నేత‌గా ఎదిగిన వంశీ ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో రేగుతోన్న సెగ‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఆయ‌న పార్టీ మార‌డాన్ని వైసీపీ నేత‌లు స్వాగ‌తించ‌డం లేదు. ఆయ‌న‌కు స్థానికంగా ఏ మాత్రం స‌హ‌కారం లేదు.

ఎవరికి ఎవరూ సహకరించక…..

ఇక చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారినా ఆయ‌న‌కు ఒరిగింది లేదు. ఇక బ‌ల‌రాంపై ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహ‌న్‌తో పాటు టీడీపీ నుంచే వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ ( ఇటీవ‌ల రాజీనామా చేశారు) వ‌ర్గాలు బ‌ల‌రాంకు ప్రశాంత‌త లేకుండా చేశాయి. బ‌ల‌రాం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కంటే ప్రతి రోజు వీళ్లతో పొలిటిక‌ల్ వార్‌కు దిగ‌డంతోనే స‌రిపెట్టేస్తున్నారు. ఇక విశాఖ ద‌క్షిణంలో కోలా గురువులు, మ‌రో వ‌ర్గం వాళ్లు గ‌ణేష్‌కు స‌హ‌క‌రించ‌డం లేదు. ఇక గుంటూరు ప‌శ్చిమంలో మ‌ద్దాలి గిరి నామ్ కే వాస్తేగా ఉన్నారు. అక్కడ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసుర‌త్నంతో పాటు అనేక వ‌ర్గాల‌దే రాజ్యం. ఇక ఈ పార్టీ మారిన తోట త్రిమూర్తులు, అడారి ఆనంద్ లాంటి వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియ‌డం లేదు. పైగా వీళ్లంద‌రికి జ‌గ‌న్ కండువాలు క‌ప్పిన రోజు మిన‌హా ఆ త‌ర్వాత ఎప్పుడూ అపాయింట్ ఇవ్వని ప‌రిస్థితి.

అవినాష్ కు అంత స్పెష‌ల్ ఎందుకో.. ?

పార్టీ మారిన నేత‌లు ఎంత మంది ఉన్నా జ‌గ‌న్ ద‌గ్గర దేవినేని అవినాష్ మాత్రం చాలా స్పెష‌ల్‌గా ఉన్నాడు. పార్టీకి సానుభూతిప‌రులుగా ఉన్న ఎమ్మెల్యేల‌కే జ‌గ‌న్ ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని ప‌రిస్థితి ఉంటే అవినాష్‌కు ఇప్పటికే నాలుగైదు సార్లు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ల‌భించింది. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర వైసీపీ నేత‌ల నుంచి ఇబ్బంది కూడా లేదు. దేవినేని అవినాష్ కు ఏ చిన్న ఇబ్బంది వ‌చ్చినా అధిష్టానం కూడా చూస్తూ ఊరుకోవ‌డం లేదు.

అందుకేనా అంత ప్రాధాన్యత….

మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి పూర్తిగా సైలెంట్ అయిపోగా.. దేవినేని అవినాష్ కు ముందు వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న బొప్పన భ‌వ‌కుమార్ ప్రస్తుతం న‌గ‌ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయ‌న కూడా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత అసంతృప్తి ఉన్నా వేలు పెట్టేందుకు ఛాన్స్ లేకుండా చేసింది అధిష్టానం. ఇక జ‌గ‌న్ ఇప్పటికే ప‌లుమార్లు దేవినేని అవినాష్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో పాటు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కావాల్సిన‌న్ని నిధులు ఇస్తున్నారు. విచిత్రం ఏంటంటే న‌గ‌రంలో మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో వెల్లంప‌ల్లి మంత్రి కాగా, సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్‌గా ఉన్నారు. వీరితో స‌మానంగా తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి అవినాష్ నిధులు రాబ‌డుతున్నాడు. తూర్పులో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేదు. అందుకే అవినాష్‌ను జ‌గ‌న్ బాగా ఎంక‌రేజ్ చేస్తోన్న ప‌రిస్థితి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ పార్టీ మారిన నేత‌లంద‌రిలోకి అవినాష్‌ను చాలా స్పెష‌ల్‌గా చూస్తోన్న ప‌రిస్థితే ఉంది.

Tags:    

Similar News