దేవినేనికి అస‌లు సిస‌లు ప‌రీక్ష పెట్టిన వ‌సంత‌

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు పోరు ప్రారంభ‌మైంది. ఈ నెల ఆఖ‌రులోగా ఈ ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా [more]

Update: 2020-03-12 06:30 GMT

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు పోరు ప్రారంభ‌మైంది. ఈ నెల ఆఖ‌రులోగా ఈ ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరులో త‌ల‌ప‌డేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స‌మాయ‌త్తమ‌య్యాయి. అయితే ప్రధాన పోరు అధికార వైసీపీ వ‌ర్సెస్ ప్రతిప‌క్షం టీడీపీ మ‌ధ్యే ఉండ‌నుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పార్టీల నాయ‌కులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే, చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌ల‌హీనంగా ఉండ‌గా అదే స‌మ‌యంలో ప‌లు నియోజ‌క‌వర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న వ్యతిరేక‌త పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌కంగా క‌నిపిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం.

సొంత సామాజికవర్గంలోనూ…

కృష్ణాజిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్రత్యేక‌త ఉంది. ఇక్క‌డ నుంచి గ‌తంలో వ‌రుస‌గా విజ‌యం సాధించిన దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు చంద్రబాబు హ‌యాంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి ప్రధాన కార‌ణం ఆయ‌న కార్యక‌ర్తల‌ను, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను ప‌క్కన పెట్టడ‌మే. అయితే, ఈ ఓట‌మి త‌ర్వాత అయినా దేవినేని ఉమ పుంజుకున్నారా ? అనేది ప్రశ్నగానే ఉంది. ఇప్పటికీ ఉమాకు విజ‌య‌వాడ‌ ఎంపీ, సొంత పార్టీ నాయకుడు కేశినేని నానితో విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ దేవినేని ప‌ట్టు కోల్పోయారు.

2006లోనూ టీడీపీని….

ఇక గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుటుంబానికి చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువు అయిన వ‌సంత కుటుంబ వార‌సుడు వ‌సంత కృష్ణప్రసాద్ త‌న‌ను స‌వాల్ చేసి మ‌రీ ఓడించ‌డం ఇప్పట‌కీ ఊమా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక తాను నందిగామ‌లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2006 స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ ఇదే వ‌సంత స‌వాల్ చేసి మ‌రీ నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు మండలాల్లోనూ నాడు టీడీపీని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు మ‌ళ్లీ వ‌సంత దూకుడుతో ఉమా డైల‌మాలోనే ఎన్నిక‌ల‌కు ఎదుర్కొంటున్నారు. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. అధికార పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణప్రసాద్‌కు రాజ‌ధాని సెగలు భారీగా తాకుతున్నాయి. రాజ‌ధానితో సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గమే అయినా.. త‌న సొంత సామాజిక వ‌ర్గమే ఆయ‌న‌పై ఒత్తిడి పెంచుతోంది.

హోరాహోరీ…..

ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కొత్తగా కొండ‌ప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ఆవిర్భవించింది. ఈ న‌గ‌ర పంచాయ‌తీలో గెలుపు కోసం రెండు పార్టీ నేత‌లు క‌త్తులు దూసుకున్నా ఇక్కడ ఎన్నిక వాయిదా ప‌డింది. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న మైల‌వ‌రం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంప‌ట్నం మండ‌లాల్లో ఎంపీపీలు, జ‌డ్పీటీసీల్లో గెలుపు కోసం ఈ ఇద్దరు నేత‌లు కొద‌మ‌సింహాల్లా త‌ల‌ప‌డుతున్నారు. అయితే స్థానిక ఎన్నిక‌ల‌కు వెళ్లడం అటు దేవినేనికి, ఇటు వసంత‌కు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇక‌, ఎన్నిక‌ల ప‌రంగా చూస్తే.. దేవినేనితో క‌లిసి వ‌చ్చే బ్యాచ్ పెద్దగా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న క‌నుక క‌లుపుకొని ముందుకు వెళ్తే బ‌ల‌మైన ఓటు బ్యాంకు తిరిగి టీడీపీకి సొంత‌మ‌వుతుంద‌నే భావ‌న క‌లుగుతోంది. అయితే, వైసీపీపై వ్యతిరేక‌త లేక‌పోయినా రాజ‌ధాని విష‌యంలో క్లారిటీ ఇవ్వలేక పోవ‌డం ఎమ్మెల్యే వ‌సంత‌కు ఇబ్బందిగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు కూడా ఇక్కడ హోరాహోరీ పోరు త‌ల‌ప‌డాల్సిందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News