స్పేస్ లేకుండా చేస్తే… స్పీడ్ మరింత పెరుగుతుందిగా?

మాజీ మంత్రి, టీడీపీ కీల‌క నేత దేవినేని ఉమామ‌హేశ్వర‌రావుకు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జోరు ముందు [more]

Update: 2021-03-11 03:30 GMT

మాజీ మంత్రి, టీడీపీ కీల‌క నేత దేవినేని ఉమామ‌హేశ్వర‌రావుకు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జోరు ముందు టీడీపీ క‌నీసం పోటీ కూడా ఇవ్వలేదు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉన్న మైల‌వ‌రంలో 13 పంచాయ‌తీల‌కు గాను 13 చోట్లా వైసీపీ మ‌ద్దతు దారులే విజ‌యం సాధించారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని జి. కొండూరు మండ‌లంలో 23 పంచాయ‌తీల‌కు 20 చోట్ల వైసీపీ మ‌ద్దతు దారులు గెలిస్తే కేవ‌లం రెండు చోట్ల మాత్రమే టీడీపీ సానుభూతిప‌రులు విజ‌యం సాధించారు. దీనిని బ‌ట్టి దేవినేని ఉమాకు స్థానిక ఎన్నిక‌ల ఎంత చేదు అనుభ‌వం మిగిల్చాయో అర్థమ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో దేవినేని ఉమాపై గెలిచిన‌ప్పటి నుంచి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్రసాద్ ఉమాకు నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కడా స్పేస్ ఇవ్వకూడ‌ద‌న్న క‌సితో పని చేస్తున్నారు.

అప్పుడు కూడా అంతేగా?

ద‌శాబ్దాల రాజ‌కీయం వైరం ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఉండ‌డంతో దేవినేని ఉమా వ‌ర్సెస్ కేపీ మ‌ధ్య ఎన్నిక‌ల పోరు ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటూ వ‌స్తోంది. 1999లో కేపీ వ‌ర్సెస్ ఉమా, 2004లో ఉమా వ‌ర్సెస్ వ‌సంత నాగేశ్వర‌రావు మ‌ధ్య ఎన్నిక‌ల సంగ్రామం జ‌ర‌గ‌గా… ఆ రెండు సార్లు దేవినేని ఉమాయే గెలిచాడు. ఇక 2006 స్థానిక ఎన్నిక‌ల్లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండ‌గా… కేపీ నందిగామ స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఉమాను క‌సిగా కాన్‌సంట్రేష‌న్ చేసి నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు ఎంపీపీలు, జ‌డ్పీటీసీల్లో టీడీపీని చిత్తుగా ఓడించి ఉమాపై క‌సి తీర్చుకున్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఇద్దరి మ‌ధ్య ప్రత్యక్ష పోటీ 2019 ఎన్నిక‌ల్లో 13 ఏళ్లకు జ‌రిగింది.

ఎంత చెక్ పెట్టినా….?

దేవినేని ఉమాకు వ‌సంత ఫ్యామిలీ ఎంత చెక్ పెట్టినా ఆయ‌న 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కేపీకి విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇస్తాన‌ని చెప్పినా.. కాద‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మైల‌వ‌రంలో పోటీ చేసి ఉమాను ఓడించి చాలా రోజుల త‌ర్వాత క‌సి తీర్చుకున్న ప‌రిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఉమా స‌త్తా చాటేందుకు ప్రయ‌త్నించారు. అయితే సీఎం జ‌గ‌న్ నుంచి ఎమ్మెల్యే కేపీకి ప్రత్యేక ఆదేశాలు రావ‌డంతో ఆయ‌న సర్పంచ్ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీకి ప్లేస్ లేకుండా చేశారు. దేవినేని ఉమా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఆధిక్యత వ‌స్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ప‌రంగా ప్రభావం చూపే అవ‌కాశాలు ఉండ‌డంతో వైసీపీ అధిష్టానం సైతం మైల‌వ‌రంపై దృష్టి పెట్టింది. ఇక కేపీ సైతం భారీగా ఖ‌ర్చు చేయ‌డంతో ఇక్కడ టీడీపీ సానుభూతిప‌రులు చిత్తు చిత్తుగా ఓడారు.

ప్రత్యేకంగా జరిగే నష్టం….

ఈ స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ సానుభూతిప‌రులు ఓడిపోయినంత మాత్రాన దేవినేని ఉమాకు ప్రత్యేకంగా జ‌రిగే న‌ష్టం ఉండ‌దు. అధికార పార్టీ అధిష్టాన‌మే ఇక్కడ దృష్టి పెట్ట‌డంతో పాటు… స్థానికంగా కోట్లాది రూపాయ‌లు వెద‌జ‌ల్లడంతోనే టీడీపీకి ఇక్కడ మైన‌స్ అయ్యింది. 2006 స్థానిక ఎన్నిక‌ల్లో నాడు నందిగామ‌లో కేపీ ఇదే ఫైనాన్షియ‌ల్ స్ట్రాట‌జీతో వెళ్లి నాడు కాంగ్రెస్‌ను ఆధిక్యంలో నిలిపారు. మ‌ళ్లీ రెండేళ్లకే వ‌చ్చిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో నందిగామ‌తో పాటు దేవినేని ఉమా పోటీ చేసిన మైల‌వ‌రంలోనూ టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది.

ఇప్పుడు ఓడినంత మాత్రాన….

వాస్తవంగా చూస్తే స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు మైల‌వ‌రంలో ఎమ్మెల్యే కేపీపై సొంత సామాజిక వ‌ర్గంతో పాటు .. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కోసం ప‌నిచేసిన వారిలోనూ తీవ్ర అసంతృప్తే ఉంది. అయితే ఫైనాన్షియ‌ల్ స్ట్రాట‌జీతో పాటు పార్టీ పెద్దలు దేవినేని ఉమాను టార్గెట్ చేయ‌డంతోనే ఇక్కడ టీడీపీ గెల‌వ‌లేదు. అయితే త‌న‌పై ఉన్న వ్యతిరేక‌త త‌గ్గించుకోకుండా ఎమ్మెల్యే కేపీ ఎప్పుడూ ఇదే స్ట్రాట‌జీతో వెళ్లాల‌నుకున్న వ‌ర్కవుట్ కాదు. ఇక ఈ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వర్గంలో పార్టీ సానుభూతిప‌రులు గెల‌వ‌క‌పోయినా దేవినేని ఉమాకు ఇప్పటికిప్పుడు పోయేది లేదు.. వ‌చ్చేది లేదు.

Tags:    

Similar News