చేసుకున్న వారికి చేసుకున్నంత..ఇప్పుడు తెలిసిందా?

నోరు మంచిదైతే.. ఊరు మంచిద‌వుతుంద‌నే సామెత రాజ‌కీయాలకు కూడా వ‌ర్తిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవ‌హ‌రిస్తే అధికారం పోయిన త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి ? అనే ఆలోచ‌న [more]

Update: 2020-03-13 03:30 GMT

నోరు మంచిదైతే.. ఊరు మంచిద‌వుతుంద‌నే సామెత రాజ‌కీయాలకు కూడా వ‌ర్తిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవ‌హ‌రిస్తే అధికారం పోయిన త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి ? అనే ఆలోచ‌న చేయ‌ని నాయ‌కుల‌కు ఇప్పుడు ప్రజ‌ల నుంచి మరో ప‌క్క పార్టీ నుంచి కూడా తీవ్ర అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. టీడీపీ మాజీ మంత్రి, కృష్ణా జిల్లాలో రెండు ద‌శాబ్దాలుగా త‌న స‌త్తా చాటిన నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు తీవ్ర చిక్కుల్లో ప‌డ్డార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014కు ముందు ప‌దేళ్ల పాటు పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నా దేవినేని ఉమ జిల్లాలో ఎన్నో పోరాటాలు చేశారు. 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించిన దేవినేని ఉమ 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉమా విజ‌యం సాధించారు. ఆ క్రమంలోనే ఆయ‌న‌కు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇరిగేష‌న్ మంత్రిగా ప్రమోష‌న్ ఇచ్చారు.

జిల్లాను గుప్పిట్లో….

ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని పార్టీని అభివృద్ధి చేయాల్సినదేవినేని ఉమ వ‌ర్గ పోరుకు తెర‌దీశారు. త‌న‌ను మెచ్చుకున్న వారే నాయ‌కులు, త‌న వెంట తిరిగిన వారే నాయ‌కులు అనే రీతిగా ఆయ‌న వ్యవ‌హ‌రించారు. కృష్ణా జిల్లాపై పూర్తి ప‌ట్టును సాధించేందుకు ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఎవ‌రినీ లెక్కచేయ‌డం మానేశారు. చంద్రబాబు వ‌ద్ద కూడా రాంగ్ నివేదిక‌లు ఇచ్చి.. జిల్లాలో ప‌ట్టుకు దేవినేని ఉమ ప్రయ‌త్నించారు. ఆయ‌న దెబ్బకు జిల్లా టీడీపీలో పేరున్న నాయ‌కులు కూడా మౌనం వ‌హించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ దేవినేని ఉమ చెప్పిన‌ట్టే వినేవారు. దీంతో ఆయ‌న మ‌రింత పేట్రేగిపోయారు. ఫ‌లితంగా జిల్లాలో టీడీపీ నాయ‌కుల‌కు స్వతంత్రం అనేది పోయింది.

ఎవరితోనూ పడక…

అయితే, ఆ ఐదేళ్లు దేవినేని ఉమను భ‌రించిన నాయ‌కులు త‌ర్వాత మాత్రం ఆయ‌న‌ను ప‌క్కన పెట్టేందుకు ప్రయ‌త్నించారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో దేవినేని ఉమ మైల‌వ‌రంలో ఓడిపోయారు. వాస్తవానికి ఆయ‌న ఓట‌మికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేత కేశినేని నాని ప‌రోక్షంగా స‌హ‌క‌రించార‌నే వాద‌న కూడా ఉంది. ఇప్పటికే దేవినేని ఉమ తీరు న‌చ్చకే గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ పార్టీ మారిపోయారు. ఇక గుడివాడ‌లో పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ఉమ బంధువు అవినాష్ సైతం పార్టీ మారారు. మండ‌లి, కాగిత‌, ముద్దర‌బోయిన‌, బోడే, బొండా లాంటి నేత‌లు అంద‌రితోనూ దేవినేని ఉమకు ప‌డ‌ట్లేదు.

ఆ ముద్రను చెరిపేసేందుకు….

ఇక‌, ఇప్పుడు పూర్తిగా కృష్ణాజిల్లాపై దేవినేని ఉమ ముద్రను చెరిపి వేసేందుకు కూడా ఓ ఇద్దరు టీడీపీ నాయ‌కులు ప్రయ‌త్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దేవినేని ఉమ కార‌ణంగానే ఇప్పటికి ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పడం ఉన్న నాయ‌కులు కూడా అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్న కార‌ణంగా ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్కన పెట్టి త‌మ‌దైన రాజ‌కీయాలు చేసేందుకు ఆ ఇద్దరు కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ కలసి…..

వారే విజ‌యవాడ ఎంపీ కేశినేని నాని. మ‌రొక‌రు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన గ‌ద్దె రామ్మోహ‌న్‌. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌ను పార్టీని గ‌ద్దె క‌నుస‌న్నల్లో న‌డిపిస్తుండగా, జిల్లా రాజకీయాల‌ను నాని న‌డిపిస్తున్నారు. కేశినేని ముందు చంద్రబాబుతో విబేధించినా ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఆయ‌న‌కు పార్టీ అవ‌స‌రం ఉంది. అందుకే ఇప్పుడు నానికి బాబు బ‌ల‌వంతంగా అయినా ప్రయార్టీ ఇవ్వక త‌ప్పట్లేదు. ఇక ఇప్పుడు దేవినేని ఉమ ఓడిపోవ‌డంతో ఆయ‌న్ను పెద్దగా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఏదైనా చేసుకున్న వారికి చేసుకున్నంత అని దేవినేని ఉమ గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేక‌దా?

Tags:    

Similar News