ఉమ పై వాళ్లకు అంత కోపమెందుకో?

బెజవాడలో తెలుగుదేశం పార్టీ దీన పరిస్థితిని గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. చంద్రబాబు కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మిగిలిన నేతల ఆవేదన.. ఆగ్రహం కూడా. [more]

Update: 2021-08-17 00:30 GMT

బెజవాడలో తెలుగుదేశం పార్టీ దీన పరిస్థితిని గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. చంద్రబాబు కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మిగిలిన నేతల ఆవేదన.. ఆగ్రహం కూడా. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి, దేవినేని ఉమ కు మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. దేవినేని ఉమకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన తప్పపడుతున్నారు. దేవినేని ఉమ కారణంగానే పార్టీ ఇలా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అరెస్ట్ చేసినా…?

ఇటీవల దేవినేని ఉమను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపారు. రాష్ట్రంలోని టీడీపీ నేతలందరూ దేవినేని ఉమ అరెస్ట్ ను ఖండించారు. కానీ బెజవాడ తమ్ముళ్లు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిని బట్టి దేవినేని ఉమ పై ఎంత కోపం స్థానిక నేతలకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో జరిగిన సంఘటనలపై స్పందిచిన బెజవాడ టీడీపీ నేతలు దేవినేని ఉమపై మాత్రం మాట కూడా మాట్లాడటం లేదు.

జిల్లా నేతల నుంచి….

చంద్రబాబును మభ్య పెట్టేందుకే దేవినేని ఉమ ఇలాంటి డ్రామాలు ఆడతారని వారు ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటం విశేషం. నిజానికి కేశినేని నానిని వ్యతిరేకిస్తున్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమామహేశ్వరావు, గద్దె రామ్మోహన్ వంటి వారు దేవినేని ఉమకు అండగా నిలబడాలి. కానీ వారు కూడా ఎందుకో ఉమ విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. సొంత జిల్లాలోనే ఉమకు పార్టీ నుంచి మద్దతు లేదన్న విషయం బయటకు తెలిసింది.

అధికారంలో ఉన్నప్పుడు….

దేవినేని ఉమ అధికారంలో ఉన్నప్పడు జిల్లాలో పెత్తనం చేసేవారు. తనకు అనుకూలురైన వారికే పనులు చేసి పెట్టేవారన్న ఆరోపణలున్నాయి. వల్లభనేని వంశీ వంటి వారు సయితం పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత దేవినేని ఉమను టార్గెట్ చేశారు. ఇలా జిల్లాలో దేవినేని ఉమ ఒంటరి అయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలోని మాజీమంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు వరకూ దేవినేనికి అండగా నిలిచినా సొంత ఇలాకాలో మాత్రం ఆయనకు మద్దతు లభించలేదన్నది వాస్తవం.

Tags:    

Similar News