దేవినేనికి బిల్లు బొక్క తప్ప…. పట్టు దొరకడం లేదా?

టీడీపీలో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి దేవినేని ఉమ. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అన్న మాట‌ను ఆయ‌న అక్షరాలా పాటిస్తున్నారు. అయినా కూడా దేవినేని ఉమకి వ‌ర్కవుట్ [more]

Update: 2020-04-19 13:30 GMT

టీడీపీలో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి దేవినేని ఉమ. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అన్న మాట‌ను ఆయ‌న అక్షరాలా పాటిస్తున్నారు. అయినా కూడా దేవినేని ఉమకి వ‌ర్కవుట్ కావ‌డం లేద‌ని అంటున్నారు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబుకు న‌మ్మిన బంటు మాదిరిగా వ్యవ‌హ‌రించారు దేవినేని ఉమ. మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఇరిగేష‌న్ మంత్రిగా కూడా త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని, నాయ‌కుల‌ను కూడా ప‌ట్టించుకో లేదు. తాను రెండు సార్లు వ‌ర‌స‌గా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఈ విజయం ఆయ‌న ఒక్కడి వ‌ల్లా కాలేదు. ఎంద‌రో కార్యక‌ర్తలు, నాయ‌కులు ఆయ‌న‌కు స‌హ‌క‌రించారు. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కులు ఎంతో మంది దేవినేని ఉమ కోసం ఎంతో కృషి చేశారు. సొంత సొమ్మును కూడా ఖ‌ర్చు పెట్టారు.

ఎవరినీ పట్టించుకోకుండా…

పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు ఈ సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే ఆయ‌న ఎక్కువ ఖ‌ర్చు పెట్టించార‌న్నది వాస్తవం. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు దేవినేని ఉమ చేస్తోన్న పోరాటాలు చూసిన ఈ సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో పాటు టీడీపీ అభిమానులు ఉమను ఓ హీరోగా చూశారు. ఈ క్రమంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక ఆయ‌న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని నాలుగున్నరేళ్లు అస్సలు ప‌ట్టించుకోలేదు. అయితే, ఆయ‌న త‌ర్వాత కేడ‌ర్ స‌హా త‌న సామాజిక వ‌ర్గాన్ని కూడా ప‌ట్టించుకో లేదు. ఇక జిల్లా రాజ‌కీయాల్లో పెద్ద నియంత మాదిరిగా వ్యవ‌హ‌రించార‌న్నది కూడా కాద‌న‌లేని స‌త్యం.

బుజ్జగించే కార్యక్రమం చేపట్టినా….

పైగా 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 7 వేల ఓట్ల మెజార్టీయే వ‌చ్చింద‌ని…టీడీపీకి మెజార్టీ త‌గ్గిన గ్రామాల్లో నేత‌ల‌ను ఆయ‌న ప‌క్కన పెట్టారు. వారి ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్యవ‌హ‌రించారు. ఫ‌లితంగానే గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో దేవినేని ఉమని సొంత పార్టీ నాయ‌కులే చాప‌కింద నీరు మాదిరిగా ప‌నిచేసి ఓడించార‌నే వాద‌న ఉంది. ఈ క్రమంలో ఆయ‌న చిత్తుగా ఓడిపోయారు. ఈ విష‌యంలో అస‌లు కిటుకు తెలుసుకున్న దేవినేని ఉమ ఇప్పుడు ప‌రిస్థితిని చ‌క్కదిద్దుకునే కార్యక్రమానికి దిగారు. క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో ఇంటి ప‌ట్టునే ఉంటున్న దేవినేని ఉమ త‌ర‌చుగా స్థానిక నాయ‌కుల‌కు ఫోన్లు చేస్తున్నారు. వారి స‌మ‌స్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక‌రిద్దరు నాయ‌కులు స్పందిస్తున్నా.. చాలా మంది నాయ‌కులు మాత్రం ఫోన్లు లిఫ్ట్ చేయ‌డం లేద‌ట‌. దేవినేని ఉమతో మాట్లాడుతున్న ఒక‌రిద్దరు కూడా ముక్తస‌రిగా మాట్లాడి ఫోన్లు క‌ట్ చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న భాష్యం కూడా డిఫరెంట్‌గా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మేం ఫోన్ చేస్తే.. ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మేం క‌నిపిస్తున్నామా ? అని ప్రశ్నించ‌డంతో దేవినేని ఉమనే అవాక్కవుతున్నార‌ట‌.

బిల్లులు ఆగిపోయిన వారంతా….

అయితే, ఇప్పుడు ఆయ‌న మాకు ఏం చేస్తారు? ఆయ‌న వ‌ల్ల ఏమ‌వుతుంది? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఎన్నిక‌ల‌కు ముందు కూడా త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. అయితే దేవినేని ఉమ మాత్రం ఫోన్ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇదిలావుంటే, మైల‌వ‌రం ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు కృష్ణప్రసాద్ మాత్రం త‌న‌దైన శైలిలో వీళ్లను మేనేజ్ చేస్తున్నార‌ని అంటున్నారు. అందుకే దేవినేని ప్రయ‌త్నాలు ఒక్కటి కూడా వ‌ర్కవుట్ కావ‌డం లేద‌ని చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని ఉమ మంత్రిగా ఉన్నప్పుడు ప‌నులు చేసి కోట్లలో బిల్లులు ఆగిపోయిన వారు అంద‌రూ ఇప్పుడు వ‌సంత కృష్ణప్రసాద్‌కు ద‌గ్గర అవుతున్నారు.

కేశినేని నాని కూడా…..

ఇక దేవినేని ఉమతో పొస‌గ‌ని విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సైతం వ‌సంత‌తో క్లోజ్‌గా ఉండ‌డం ఉమకు మింగుడు ప‌డ‌డం లేదు. ఇవ‌న్నీ రాజ‌కీయంగా దేవినేని ఉమను సంక‌ట స్థితిలోకి నెట్టేశాయి. దీంతో ఆయ‌న ఎన్ని ప్రయ‌త్నాలు చేసినప్పటికీ మైల‌వ‌రంలో ఆయ‌న ప‌ట్టు ప్రయ‌త్నాలు ఫ‌లించ‌డం లేద‌ని అంటున్నారు. నిజ‌మే క‌దా.. చేతులు కాల‌క ఆకులు పట్టుకున్న చందంగా ముందు చేయాల్సిన ప్రయ‌త్నం ఇప్పుడు చేస్తే ప్రయోజ‌నం ఏంట‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Tags:    

Similar News