అందరికీ ఆదర్శం….ఆడుతు పాడుతూ పనిచేస్తూంటే ..!

అవును మరి వారు ఇద్దరు ఇపుడు అచ్చమైన రైతు సోదరులైపోయారు. ఒకాయన అందులో మంత్రి గారు కూడా. కరోనా వైరస్ వ్యాప్తి ఓ వైపు, మరో వైపు [more]

Update: 2020-04-06 00:30 GMT

అవును మరి వారు ఇద్దరు ఇపుడు అచ్చమైన రైతు సోదరులైపోయారు. ఒకాయన అందులో మంత్రి గారు కూడా. కరోనా వైరస్ వ్యాప్తి ఓ వైపు, మరో వైపు లాక్ డౌన్ నేపధ్యంలో పూర్తిగా ఇంటిపట్టునే ఉంటున్నారు. సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములూ ధర్మాన కృష్ణ దాస్, ధర్మాన ప్రసాదరావు అని వేరే చెప్పనక్కరలేదు. ఈ ఇద్దరూ ఇపుడు పొలాంలో సాధారణ రైతుల్లా మారిపోయారు. వ్యవసాయం ఇద్దరికీ చాలా బాగా వచ్చు. దాంతో ఈ ఇద్దరూ అలుపు లేదు మనకు అనుకుంటూ పొలం దున్నేస్తున్నారు.

వేషం మారింది….

రాజకీయ వేషం పూర్తిగా పక్కకు పోయింది. ఇద్దరూ ఇపుడు అచ్చమైన రైతన్న వేషానికి మారిపోయారు. ధర్మాన కృష్ణ దాస్ తన శ్రీకాకుళం జిల్లాలోని పోలాకీ మండలంలో తన సొంత పొలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే తన ఇంటిని తాను పరిశుభ్రం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ వంటివి వ్యాపించకుండా ఉండాలంటే పరిశుభ్రత తప్పనిసరి అని ఆయన స్థానిక ప్రజలకు చాటి చెబుతున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి కాలువ పనులను కూడా చేపడుతున్నారు. మురుగుని బయటకు నెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఏకాంత వాసమే….

ఇక తమ్ముడు ప్రసాదరావు అయితే జనతా కర్ఫ్యూ నుంచే జనంలోకి రావడం మానుకున్నారు. తనను ఎవరూ కలవవద్దని ఆయన ఏకంగా భారీ స్టేట్మెంట్ ఇచ్చేసి మరీ ఏకాంత వాసానికి షిఫ్ట్ అయిపోయారు. ఆయన సైతం తన పొలంలో పంటలకు నీళ్ళు పెడుతూ కనిపిస్తున్నారు. అలాగే గొప్పులు తవ్వుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కాయకష్టం చేస్తున్నారు. ఆయన్ని చూసిన వారు మంత్రిగా చేసింది ఈయనేనా అన్న డౌట్ రాక మానదు. ఇక పొలంలోనే తిండీ నిద్ర చేస్తూ అచ్చమైన పల్లెటూరి జీవితాన్ని ప్రసాదరావు ఆస్వాదిస్తున్నారు.

వారే స్పూర్తిగా…

పొలం పనులను రైతులు ఆపాలసిన అవసరం లేదని ఈ ఇద్దరు అన్నదమ్ములూ తాము స్వయంగా చేసి చూపుతున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రతీ వారు పొలం పనులను చేసుకోవాలని పిలుపు ఇస్తున్నారు. అలాగే కరోనా వైరస్ నేపధ్యంలో పది మంది ఉన్న చోటకు వెళ్ళకుండా అలాగే ఇంట్లో ఒంటరిగా బోర్ కొట్టేలా గడపకుండా ఉండకుండా పనికి వచ్చే పొలం పని చేసుకోవడం అరోగ్యానికి, కుటుంబానికి కూడా మంచిదని ధర్మాన సోదరులు అంటున్నారు. మరి ఇదే తీరులో మిగిలిన నేతలు కూడా ఇపుడు పోలం పనులకు దిగిపోతున్నారు. మొత్తం మీద ధర్మాన సోదరులు చూపిన బాట ఈ టైంలో ధర్మంగానే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News