ఏడాది పూర్తయినా అంతా ఉత్తుత్తిదేనా?

ధ‌ర్మాన కృష్ణదాస్‌. గుడ్ మినిస్టర్‌!.. వివాద ర‌హితుడు.. అవినీతి ర‌హితుడు.. జ‌గ‌న్‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడు.. ఇవీ ఆయ‌న ఈ ఏడాది కాలంలో సంపాయించుకున్న ప్రధాన రికార్డులు. [more]

Update: 2020-07-03 02:00 GMT

ధ‌ర్మాన కృష్ణదాస్‌. గుడ్ మినిస్టర్‌!.. వివాద ర‌హితుడు.. అవినీతి ర‌హితుడు.. జ‌గ‌న్‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడు.. ఇవీ ఆయ‌న ఈ ఏడాది కాలంలో సంపాయించుకున్న ప్రధాన రికార్డులు. ఇంత వ‌రకు బాగానే ఉంది. కానీ, ఈ ఏడాది కాలంలో పాల‌న ప‌రంగా.. త‌న‌కు అప్పగించిన శాఖ ప‌రంగా ఆయ‌న దూకుడు చూపించారా ? పార్టీ ప‌రంగా ఆయ‌న ఓ అడుగు ముందుకు వేశారా ? అని చూస్తే.. మాత్రం ఎక్కడా ధ‌ర్మాన కృష్ణదాస్‌ కు రికార్డు స్థాయిలో కాదు క‌దా.. క‌నీసం చ‌ర్చించుకునే రేంజ్‌లో కూడా ఆయ‌న ప్రతిభ క‌నిపించ‌డం లేదు. శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్నపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించినధ‌ర్మాన కృష్ణదాస్‌కు జ‌గ‌న్ త‌న తొలి కేబినెట్‌లోనే బెర్త్ ఇచ్చారు.

శాఖా పరంగా…..

నిజానికి ధ‌ర్మాన కృష్ణదాస్‌ సోద‌రుడు ప్రసాద‌రావుకు బెర్త్ ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, విధేయ‌త‌కు వీర తాడు అన్నట్టుగా ధ‌ర్మాన కృష్ణదాస్‌కు జ‌గ‌న్ ఏరికోరి ప‌ద‌విని ఇచ్చారు. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రీ విజ‌యం సాధించారు. దీంతో ధ‌ర్మాన ప్రసాద‌రావు లాంటి సీనియ‌ర్లను కాద‌ని మ‌రి జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. రోడ్లు, భ‌వ‌నాల శాఖను ఆయ‌న చేతిలో పెట్టారు. ఇప్పుడు ఏడాది పూర్త యింది. మ‌రో ఏడాదిన్నర‌లో మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉండ‌నుంది. మ‌రి ఈ ఏడాది కాలంలో ధ‌ర్మాన కృష్ణదాస్‌ సాధించిన ప్రగ‌తి ఏంటి? ఆయ‌న దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఎన్ని స‌మీక్షలు చేశారు? అని చూస్తూ.. అంతా తూతూ మంత్రంగానే క‌నిపిస్తున్నాయి.

మంత్రిగానే కాకుండా….

వివాదాల‌కు తావివ్వక‌పోయినా.. త‌న శాఖ ప‌రిధిలో ధ‌ర్మాన కృష్ణదాస్‌ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఆయన పెద్దగా ప‌ట్టించుకోలేద‌నే అంటున్నారు సీనియ‌ర్ అధికారులు కూడా. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస పాత్రుడు కావ‌డం, ఆయ‌న నిర్ణయాల‌ను వ్యతిరేకించ‌క‌పోవ‌డం ధ‌ర్మాన కృష్ణదాస్‌కు పెద్ద ప్లస్‌. అయితే జిల్లాలో రాజ‌కీయంగాను, అటు శాఖ‌లోనూ ఆయ‌న మెరుపులు లేవు. ఇక‌,శ్రీకాకుళం జిల్లా అంటేనే రాజ‌కీయంగా పెద్ద వ్యూహాత్మక జిల్లా. ఇక్కడ నుంచి టీడీపీలో కీల‌క‌మైన నాయ‌కులు ఉన్నారు. వారికి చెక్ పెట్టాల్సిన మంత్రిగా ధ‌ర్మాన కృష్ణదాస్‌ దూకుడు ప్రద‌ర్శించ‌లేక పోయారు. అదేస‌మ‌యంలో పార్టీలో ఉన్న విభేదాల‌ను కూడా ఆయ‌న ప‌రిష్కరించ‌లేక పోయారు.

జగన్ దగ్గర మాత్రం….

శ్రీకాకుళం అధికార పార్టీలో లెక్క‌కు మిక్కిలిగా గ్రూపు త‌గాదాలు ఉన్నాయి. ప్రతిప‌క్ష పార్టీకి ఎంపీతో పాటు ఇద్దరు బ‌ల‌మైన వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కౌంట‌ర్లు ఇవ్వడంలోన‌నూ… పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోనూ సీనియ‌ర్‌గా ధ‌ర్మాన కృష్ణదాస్‌ ప‌ట్టించుకోలేదు. ఇక‌, త‌న సోద‌రుడైన ప్రసాద‌రావు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోయినా.. ఆయ‌న‌ను బుజ్జగించ‌డంలోనూ ధ‌ర్మాన కృష్ణదాస్‌ ప్రయ‌త్నించ‌లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌క‌పోయినా.. పాల‌న ప‌రంగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డంలో దాస్ విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఇటు పార్టీలోను, అటు జిల్లాలోనూ కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఏడాది గ‌డిచిన‌ప్పటికీ.. సంచ‌ల‌నాల‌ను ఆయ‌న సృష్టించ‌లేక పోయారు. అయితే.. జ‌గ‌న్ ద‌గ్గర మాత్రం విధేయ‌త‌లో మంచి మార్కులు సంపాయించ‌డం ఒక్కటే ధ‌ర్మాన కృష్ణదాస్‌ కు ప్రధానంగా మిగిలింది.

Tags:    

Similar News