ధ‌ర్మాన మంత్రి ప‌ద‌వికి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే ?

శ్రీకాకుళం జిల్లా పెద్దాయన, వైసీపీలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మంత్రి అవుతారా లేదా ? అన్నది ఇపుడు చర్చగా ఉంది. ద‌స‌రా లోపులోనే జగన్ మంత్రి [more]

Update: 2021-08-09 02:00 GMT

శ్రీకాకుళం జిల్లా పెద్దాయన, వైసీపీలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మంత్రి అవుతారా లేదా ? అన్నది ఇపుడు చర్చగా ఉంది. ద‌స‌రా లోపులోనే జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ఉత్తరాంధ్రాలో ఉండేది ఎవరు, కొత్తగా వచ్చి చేరేది ఎవరు అన్న చర్చ అయితే వాడిగా వేడిగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ఈసారి మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుంది అని ఆయన అభిమానులు ధీమాగా ఉంటే అలాంటిది ఏమీ ఉండదని మరో వైపు అంటున్నారు. ధర్మనా క్రిష్ణదాస్ ని ఉప ముఖమంత్రిగా, రెవెన్యూ వంటి కీలక శాఖను ఇచ్చి మరీ జగన్ ప్రోత్సహిస్తున్నారు. అయితే విస్తరణలో క్రిష్ణ‌దాస్ కి కూడా ఉద్వాసన ఖాయ‌మని అంటున్నారు.

సోదరుడు దూకుడు గా లేకపోవడంతో……?

ఎంతటి కీలకమైన శాఖ ఇచ్చినా కూడా ఆయన దూకుడు చూపించలేకపోతున్నారు అన్నదే ప్రధాన ఆరోపణ. క్రిష్ణ దాస్ సహజంగా మెత్తగా ఉంటారు. రాజకీయాల్లో అది కుదరదు. ధర్మాన ప్రసాదరావు దూకుడుగా ఉంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే అవతల పక్కన ఉన్నది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. ఆయన అన్న కొడుకు రామ్మోహననాయుడు, వీరిద్దరూ జిల్లాలో టీడీపీకి ప్రాణం పోస్తున్నారు. పైగా గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రం అంత‌టా వైసీపీ స్వీప్ చేసినా రామ్మోహ‌న్ నాయుడు ఎంపీగా వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. అటు అచ్చెన్నాయుడు టెక్క‌లిలో మ‌ళ్లీ గెలిచారు. వీరిద్ద‌రే ఇటు జిల్లాలోనూ అటు రాష్ట్రంలోనూ టీడీపీకి ఫిల్ల‌ర్లుగా ఉన్నారు.

ఎన్నికల సమయంలో…..

అలాగే కూన రవికుమార్ మంచి దూకుడుగా ఉంటారు. ఆయ‌న శ్రీకాకుళం జిల్లా పార్టీ పార్ల‌మెంట‌రీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. మరి ఇదే జిల్లాలో వైసీపీ నుంచి కూడా అలాంటి వారే ఉండాలన్నది జగన్ కోరికగా చెబుతున్నారు. రాజకీయాలలో తన వెంట నడిచారు అన్న విశ్వాసంతో క్రిష్ణ దాస్ కి ఇంతటి ఉన్నత స్థితిని జగన్ కల్పించారు. కానీ ఎన్నికల వేళ ఆయన నాయకత్వంలో వెళ్తే జిల్లాలో రిజల్ట్స్ తారుమారు అవుతాయన్న బెంగ అధినాయకత్వంలో ఉంది. అయితే క్రిష్ణదాస్ కంటే దూకుడు ఎక్కువగా ఉండే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కుతుందా అన్నదే చర్చ.

వ్యూహాల పరంగా….

ధర్మాన ప్రసాదరావు సీనియరే కాదు, రాజకీయ వ్యూహాలు బాగా రచించగలరు, పైగా ప్రత్యర్ధుల ఎత్తులను ఎప్పటికపుడు గమనిస్తూ చిత్తు చేయగలరు, అయితే ఆయనకు ప్రత్యర్ధి పార్టీల నేతల‌తో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయన్నదే మైనస్ పాయింట్. రేపటి ఎన్నికల్లో ఎలాగైనా కింజరాపు ఫ్యామిలీని ఓడించాలనుకుంటున్న జగన్ కి ధర్మాన ప్రసాదరావు మీద నమ్మకం అయితే కుదరడంలేదుట. ఎందుకంటే కుల స‌మీక‌ర‌ణ‌ల‌కు ధ‌ర్మాన త‌ల‌వంచేస్తార‌న్న టాక్ ఉంది. దాంతో జ‌గ‌న్ జిల్లాలో సరైన మొనగాడి కోసం చూస్తున్నారని టాక్. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు ఆశలు తీర‌డం అయితే క‌ష్టంగానే ఉంది.

Tags:    

Similar News