ధూళిపాళ్ల ఎవరిని దగా చేస్తున్నారో తెలుసా?

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ ఐదు సార్లు విజ‌యం సాధించారు. అది కూడా టీడీపీ నుంచే ఇక‌, [more]

Update: 2021-04-25 13:30 GMT

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ ఐదు సార్లు విజ‌యం సాధించారు. అది కూడా టీడీపీ నుంచే ఇక‌, ఆయ‌న తండ్రి.. వీర‌య్య చౌద‌రి కూడా రెండు సార్లు గెలిచారు. ఫ‌లితంగా పొన్నూరు రాజ‌కీయాల్లో ధూళిపాళ్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఓవ‌రాల్‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ కుటుంబానికి నాలుగు ద‌శాబ్దాల ఘ‌న‌మైన రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. అలాంటి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ రాజ‌కీయంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న వ్యవ‌హారం ఏంటి ? ఏదిశ‌గా అడుగులు వేస్తున్నారు ? అనే విష‌యం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

పార్టీని పట్టిష్టం చేయడంలో…..

గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక్కసారి.. అది కూడా కేవ‌లం వెయ్యి ఓట్లతో మాత్రమే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ ఓడిపోయారు. అప్పటి నుంచిఆయ‌న యాక్టివ్‌గా లేకుండా పోయారు. ముఖ్యంగా పాతిక సంవ‌త్సరాలు త‌న‌కు టికెట్ ఇచ్చి.. ఆద‌రించిన‌.. టీడీపీని స్థానికంగా ప‌టిష్టం చేసే ప్రయ‌త్నం ఎంత మాత్రం చేయ‌డం లేద‌న్న విమ‌ర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఏదైనా త‌న‌కు స‌మ‌స్య వ‌స్తే.. వెంట‌నే మీడియా ముందుకు వ‌స్తున్న ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ అదే టీడీపీకి ఎదైనా స‌మ‌స్య వ‌స్తే.. మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. రాజ‌ధాని భూముల విష‌యంలో త‌న‌పై ఆరోపణ‌‌లు వ‌స్తే.. వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చి ఖండించారు. కానీ.. టీడీపీ చేప‌ట్టిన అమ‌రావ‌తి ఉద్యమానికి మొక్కుబ‌డిగా మాత్రమే మ‌ద్దతిచ్చారు.

సంగం డెయిరీ…..

ఇక‌, రాష్ట్రంలో గుజ‌రాత్‌కు చెందిన అమూల్ పాల ఉత్పత్తుల‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టగానే ఆద‌రాబాద‌రాగా.. మీడియా ముందుకు వ‌చ్చి.. త‌మ డెయిరీ ఉత్పత్తుల‌ను దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ చైర్మన్‌గా ఉన్న సంగం డెయిరీకి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిరుగులేని మార్కెట్ ఉంది. దీనికి అనుబంధంగా హాస్పట‌ల్ కూడా నిర్మించారు. దీంట్లో చాలా అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక టీడీపీ మ‌ద్దతుదారుల‌ను పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఇదే గుంటూరులో నామినేష‌న్ కూడా వేయ‌కుండా వైసీపీ నాయ‌కులు అడ్డుకుంటున్నార‌న్న విష‌యంపై మాత్రం న‌రేంద్ర మౌనం పాటిస్తున్నారు.

తనకు ఇబ్బంది ఉంటేనే…?

ఇలా.. అనేక విష‌యాల్లో త‌న‌కు ఇబ్బంది ఉంటే నోరు విప్పడం.. లేదంటే.. సైలెంట్ అవ‌డం గ‌మ‌నార్హం. పైగా పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేతో లోపాయికారీగా చేతులు క‌లిపార‌నే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ కు పెద్ద మైన‌స్ అయిపోయింది. న‌రేంద్ర ఎప్పుడూ ఎమ్మెల్యే కిలారు రోశ‌య్యపై చిన్న విమ‌ర్శ కూడా చేయ‌రు. అలాగే రోశ‌య్య సైతం న‌రేంద్రను ప‌న్నెత్తు మాట అన‌రు. ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ వీరికి ఇష్టమైన గ్రామాల్లో ఎన్నిక‌లు లేకుండా ఏకగ్రీవం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి.

వైఎస్ హయాంలోనూ…..

ఉమ్మడి రాష్ట్రంలో ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ అంటే ఓ పొలిటిక‌ల్ కింగ్‌. 2004లో వైఎస్ ప్రభంజ‌నంలో జిల్లాలో 19 సీట్లకు 18 చోట్ల టీడీపీ ఓడితే పొన్నూరులో న‌రేంద్ర మాత్రమే గెలిచారు. ఆ త‌ర్వాత వైఎస్ ప‌ట్టుబ‌ట్టి 2009లో న‌రేంద్రను ఓడించాల‌నుకున్నా గెలిచారు. వైఎస్ లాంటోడ్నే ఎదుర్కొని నిలిచిన న‌రేంద్ర అప్పట్లో పార్టీపై ఈగ వాలినా మీడియా ముందుకు వ‌చ్చి ఓ రేంజ్‌లో రెచ్చిపోయేవారు. అలాంటిది ఆయ‌న ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనే మిలాఖ‌త్ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా… వాటిని ఖండించ‌క‌పోవ‌డం స‌గ‌టు టీడీపీ అభిమానినే డిజప్పాయింట్ చేస్తోంది. పార్టీ కోసం చేయ‌డం మానేసి… త‌న కోసం తాను చేసుకునే రాజ‌కీయ నేత‌గా ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ మారిపోయార‌నే ప‌లువురు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Tags:    

Similar News