డిగ్గీరాజా తవ్వుతున్నారెందుకో?

దిగ్విజయ్ సింగ్ వయసు మీద పడ్డా ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూనే ఉంటారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాలను శాసించిన ఆయన గత దశాబ్దకాలంగా చేష్టలుడిగిన నేతగా మిగిలిపోయారు. భారతీయ [more]

Update: 2019-09-03 16:30 GMT

దిగ్విజయ్ సింగ్ వయసు మీద పడ్డా ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూనే ఉంటారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాలను శాసించిన ఆయన గత దశాబ్దకాలంగా చేష్టలుడిగిన నేతగా మిగిలిపోయారు. భారతీయ జనాతా పార్టీ మధ్యప్రదేశ్ ను కొన్నేళ్ల పాటు ఏలడంతో దిగ్విజయ్ సింగ్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పుడు తిరిగి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తిరిగి చక్రం తిప్పుతున్నారు. ఇదే సమస్యగా మారుతోంది.

బొటాబొటీగా గెలిచి….

అసలే మధ్యప్రదేశ్ లో బొటాబొటీగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంత వయసులోనే దిగ్విజయ్ సింగ్ మూడు వేల కిలోమీటర్లకు పైగానే పాదయాత్ర చేశారు. పార్టీ పటిష్టతకు కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చింది. ముగ్గురూ కష్టపడటం, పాతుకుపోయిన బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటంతో చివరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.

సీనియర్ నేతకే…..

అయితే జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కావాల్సి ఉన్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారన్న వ్యాఖ్యలు అప్పట్లో విన్పించాయి. దిగ్విజయ్ సింగ్ సీనియర్ నేత కమల్ నాధ్ కు అండగా నిలిచారు. చివరకు కమల్ నాధ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ దిగ్విజయ్ సింగ్ అంతా తానే అయి నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కమల్ నాధ్ కూడా నాలుగు కాలాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే దిగ్విజయ్ సింగ్ సహకారం అవసరం కావడంతో ఆయన చెప్పినట్లే వింటున్నారన్న ప్రచారమూ లేకపోలేదు.

ప్రభుత్వంలో జోక్యం…..

తాజాగా మధ్యప్రదేశ్ లో ఏకంగా మంత్రి ఒకరు పాలనలో దిగ్విజయ్ సింగ్ జోక్యాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉమంగ్ సింగార్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కాదని, ఆయన వెనక ఉండి నడిపించేది దిగ్విజయ్ సింగ్ అని తెలిపారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ దిగ్విజయ్ సింగ్ జోక్యం చేసుకుంటున్నారని, తర్వాత ఏమైందని అధికారులకు లేఖలు కూడా రాస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించడం పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ నియామకంపై రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ మంత్రి తాజా వ్యాఖ్యలతో పార్టీ కష్టాల్లో పడినట్లయింది.

Tags:    

Similar News