విప్లవ్ పదవికి మూడినట్లేనా?

గత మూడు నాలుగు నెలలుగా త్రిపుర ప్రభుత్వంలో అసమ్మతి చెలరేగుతుంది. ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ పై తిరుగుబాటు మొదలయింది. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు విప్లవ్ కుమార్ [more]

Update: 2020-12-09 17:30 GMT

గత మూడు నాలుగు నెలలుగా త్రిపుర ప్రభుత్వంలో అసమ్మతి చెలరేగుతుంది. ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ పై తిరుగుబాటు మొదలయింది. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు విప్లవ్ కుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా ఈ తంతు జరుగుతోంది. బీజేపీ పెద్దలు ఈ పంచాయతీని పలుమార్లు చేసినా ఫలితం కన్పించడం లేదు. మంత్రి పదవులు దక్కకపోవడం, ప్రాధాన్యత కల్పించకపోవడమే అసమ్మతికి ముఖ్య కారణంగా తెలుస్తోంది.

సుదీర్ఘకాలం తర్వాత…..

త్రిపురలో సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి 36మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో దాదాపు పన్నెండు మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను పార్టీ పెద్దలకు తెలియజేశారు. ముఖ్యమంత్రి ని మార్చాలన్నదే వీరి ప్రధాన డిమాండ్ గా విన్పిస్తుంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో మిత్రపక్షం ఐపీఎఫ్టీ తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సర్దుబాటు చేసేందుకు…..

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అసమ్మతి వర్గీయుల డిమాండ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ పంచాయతీని తెంపేందుకు బీజేపీ అధినాయకత్వం సీనియర్ నేత వినోద్ కుమార్ సోన్ కర్ ను త్రిపురకు పంపింది. రెండు వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. కానీ ముఖ్యమంత్రిని మార్చాల్సిందేనని అసమ్మతి వర్గం పట్టుబడుతోంది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను హైకమాండ్ కు సోన్ కర్ అందజేయనున్నారు.

ముప్పు లేకపోయినా….

ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రభుత్వానికి త్రిపురలో వచ్చే ముప్పు ఏమీ లేదు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలసి 44 మంది సభ్యుల బలం ఉంది. సీపీఎంకు కేవలం 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏదీ లేకపోయినా ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ ను మార్చాలన్నది ప్రధాన డిమాండ్. అయితే దీనిపై తాను ఈ నెల 13వ తేదీన ప్రజల ముందే తేల్చుకుంటానని ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ తెలిపారు. మరి ఆయన పదవికి రాజీనామా చేస్తారా? అసమ్మతిని సర్దుబాటు చేసుకుంటారా? అన్నది చూడాలి.

Tags:    

Similar News