డీకేకు బొకే ఇవ్వకుంటే?

డీకే అరుణ కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించారు. మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వెలుగు [more]

Update: 2020-02-20 09:30 GMT

డీకే అరుణ కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించారు. మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వెలుగు వెలిగారు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రాకపోవడం, హస్తం పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, సమర్థ నాయకత్వం లేకపోవడంతో డీకే అరుణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం కండువా కప్పేసుకున్నారు.

పెద్దపదవిపైనే?

అయితే బీజేపీ లో చేరిన డీకే అరుణ పెద్ద పదవి పైనే కన్నేశారు. జిల్లాలో డీకే అరుణకు పెద్దగా కలసి రాలేదు. శాసనసభ ఎన్నికల దగ్గర నుంచి పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు చివరకు సహకార సంఘాల ఎన్నికల్లో కూడా బీజేపీకి ఏమాత్రం అచ్చిరాలేదు. దీంతో డీకే అరుణకు జిల్లాపై పట్టు కోల్పోతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచే ఆమె రాష్ట్ర స్థాయి నేతగా బీజేపీలో ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.

కీలక నేతతో టచ్ లో….

రాష్ట్రంలో మద్య నిషేధం అమలు పర్చాలంటూ డీకే అరుణ దీక్ష కూడా చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముందే డీకే అరుణ బీజేపీలో చేరారు. అయినా జిల్లాలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో డీకే అరుణ రాష్ట్రంలోకీలక పదవిని చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆమె హస్తిన చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ ను ఢీకొట్టాలంటే తానే సరైన నేతనని అక్కడ పార్టీ పెద్దలకు చెబుతన్నారు. తనను పార్టీలోకి తీసుకొచ్చిన రామ్ మాధవ్ తో ఇటీవల డీకే అరుణ సమావేశమయి తన పదవి విషయంలో చర్చించారన్న టాక్ నడుస్తోంది.

అన్ని విధాలుగా……

అంతేకాకుండా తన సామాజికవర్గాన్ని కూడా చూడాలంటున్నారట. కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే తనకు బాధ్యతలను అప్పగించాలని చెబుతున్నారట. అయితే కొత్తగా వచ్చి పార్టీలో చేరిన వారికి పెద్ద పదవులు ఇస్తారా? అన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి సయితం డీకేకు పోటీగా అధిష్టానం వద్ద ప్రయత్నాలు ప్రారంభించారట. మొత్తం మీద డీకే అరుణ కు ఈ పదవి దక్కకపోతే ఆమె జిల్లా రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుందన్న ఆందోళన ఆమె సన్నిహితులు, అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News