ట్రబుల్ షూటర్ సక్సెస్ అవుతారా…?

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ శాసనసభ్యులు 13 మంది రాజీనామాలకు సిద్ధపడ్డారు. స్పీకర్ ను కలసి తమ రాజీనామా లేఖలను మరోసారి కూడా ఇచ్చారు. [more]

Update: 2019-07-13 17:30 GMT

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ శాసనసభ్యులు 13 మంది రాజీనామాలకు సిద్ధపడ్డారు. స్పీకర్ ను కలసి తమ రాజీనామా లేఖలను మరోసారి కూడా ఇచ్చారు. మరోవైపు కుమారస్వామి తాను బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షోభ సమయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పార్టీ అధిష్టానం, కుమారస్వామిపై రగలి పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ తన ప్రయత్నాలను ప్రారంభించారు.

త్రీడేస్ మోర్…..

కర్ణాటకలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు మంగళవారం వరకూ గడువు ఇచ్చింది. ఇక మిగిలింది మూడు రోజుల సమయమే. ఈలోపు ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష తేదీని కూడా స్పీకర్ ప్రకటించే అవకాశముంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుమారస్వామి బలపరీక్షలో నెగ్గాలంటే రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి సొంత గూటికి రప్పించడమే ఏకైక మార్గం. ఇందుకు సీనియర్ నేత డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సంక్షోభ సమయంలో….

డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచుతూ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు. ఆ తర్వాత అనేకసార్లు ఆయన కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ట్రబుల్ షూటర్ గా పనిచేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి కూడా అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. డీకే శివకుమార్ పై ఆదాయపు పన్ను దాడులు వరసగా జరిగినా పార్టీని వీడకపోవడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

తిరిగి రప్పించగలిగితే…..

తాజాగా రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు డీకే శివకుమార్ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా రెబెల్ ఎమ్మెల్యే నాగరాజుతో నాలుగు గంటలకు పైగా చర్చించి తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించగలిగారు. మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా బుజ్జగించి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని డీకే శివకుమార్ శ్రమిస్తున్నారు. ముంబయి హోటల్ లో బస చేసి ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లినా డీకేను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా డీకే శివకుమార్ తన ప్రయత్నాలు మానలేదు. చివరి నిమిషంలోనైనా అసంతృప్త ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరతారన్న ఆత్మవిశ్వాసాన్ని డీకే శివకుమార్ వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News