స్టాలిన్ ఇలా మారిపోయాడేంటి?

డీఎంకే అధినేత స్టాలిన్ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు స్టాలిన్ కే అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ అవకాశాన్ని స్టాలిన్ చేజార్చుకోదలచుకోలేదు. [more]

Update: 2021-03-28 18:29 GMT

డీఎంకే అధినేత స్టాలిన్ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు స్టాలిన్ కే అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ అవకాశాన్ని స్టాలిన్ చేజార్చుకోదలచుకోలేదు. స్టాలిన్ సీట్ల సర్దుబాటు, కూటమిలో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించారు. స్టాలిన్ కు ఈఎన్నికలు ప్రతిష్టాత్మకం. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలవకపోతే స్టాలిన్ నాయకత్వంపై అనుమానాలు తలెత్తే అవకాశముంది.

ఓటమికి తావివ్వకుండా…..

ఇక ఏమాత్రం ఓటమికి తావివ్వకుండా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలనే అమలు చేేస్తున్నారు. ప్రచారంలో కూడా ఎక్కువగా యువతను ఆకట్టుకునేలా స్టాలిన్ చర్యలు తీసుకుంటున్నారు. తన కుమారుడు ఉదయనిధినికూడా స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చారు. దీంతో పాటు అనేక హామీలను ప్రకటించి స్టాలిన్ అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

తండ్రి సిద్ధాంతాలను….

అయితే ఇందులో విచిత్రమేంటంటే.. డీఎంకే చరిత్రలో ఎన్నడూ లేని నిర్ణయాన్ని స్టాలిన్ తీసుకున్నారు. కరుణానిధి ఫక్తు నాస్తికుడు. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామికి నిజమైన వారసుడినని కరుణానిధి ప్రకటించుకున్నారు. కరుణానిధి ఎప్పుడూ ఆలయాల సందర్శనకు వెళ్లలేదు. ఏ ఎన్నికల్లోనూ కరుణానిధి హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన తన కంటూ ఒక అజెండాతో ముందుకు వెళ్లారు.

హిందూ ఓటర్లను…..

కానీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న స్టాలిన్ హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి కరుణానిధి సిద్ధాంతాలను పక్కన పెట్టిన స్టాలిన్ తమిళనాడులో హిందూ ఆలయాల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశమైంది. ఇక తీర్థయాత్రలకు వెళ్లే వారికి ఇరవై ఐదేళ్ల నుంచి లక్ష రూపాయల వరక ఆర్థిక సాయాన్ని కూడా స్టాలిన్ ప్రకటించారు. స్టాలిన్ ఎన్ని హామీలు ఇచ్చినా ఈ ఒక్క హామీ మాత్రం తమిళనాడులో ట్రెండింగ్ అవుతుంది.

Tags:    

Similar News