“డొక్కా” చించేసేటట్లున్నారే

ప‌ల్నాటి పౌరుషానికి ప్రతీక అయిన గుంటూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొద‌లైంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన టీడీపీకి ఇది పెద్ద త‌లనొప్పిగా ప‌రిణ‌మించింది. [more]

Update: 2019-07-11 13:30 GMT

ప‌ల్నాటి పౌరుషానికి ప్రతీక అయిన గుంటూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొద‌లైంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన టీడీపీకి ఇది పెద్ద త‌లనొప్పిగా ప‌రిణ‌మించింది. పార్టీలో ఒరికొక‌రు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు వెళ్లాల‌ని, ఒక‌రికి ఒక‌రు స‌హ‌క‌రించుకోవాల‌ని పార్టీ అధినేత‌గా చంద్రబాబు ఎప్పటిక‌ప్పుడు సూచిస్తున్నారు. అయితే, వివిధ పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కులు మాత్రం ఒక‌రిపై ఒక‌రు అంత‌ర్గతంగా క‌ల‌హాలు పెట్టుకుని, ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో నేత‌లు ఒక‌రిని ఓడించుకునేందుకు మ‌రొక‌రు చ‌క్రం తిప్పుకొన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, గల్లా అరుణ్ కుమారి ల మధ్య వార్ మొదలయింది.

ఇద్దరూ ఒకే పార్టీ నుంచి వచ్చి….

ఇలా చేసుకునే పార్టీని రాష్ట్రంలో కేరాఫ్ లేకుండా చేశార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి గుంటూరులోనూ వెలుగు చూసింది. గుంటూరులో కీల‌క‌మైన రాజ‌కీయ నేత‌లు విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిపోయారు. ఇలాంటి వారిలో గ‌ల్లా అరుణ ఫ్యామిలీ స‌హా, డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ ఉన్నారు. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చ‌క్రాలు తిప్పిన వారే. అయిన‌ప్పటికీ.. ఒక‌రంటే ఒక‌రికి గిట్టని ప‌రిస్థితి ఉంది. అదే.. టీడీపీలోనూ కొన‌సాగింది. టీడీపీలో అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని అధినేత చెప్పిన‌ప్పటికీ.. ఈ ఇద్దరు మాత్రం ప‌ట్టించుకోలేదు.

డొక్కా రగిలిపోతుంది అందుకే….

గుంటూరు ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌ల్ల జిల్లాకు ఏమీ ఒర‌గ‌లేద‌ని డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ త‌న అంత‌ర్గత స‌మావేశాల్లో విమ‌ర్శించారు. వ‌ల‌స నాయ‌కుల వ‌ల్ల పార్టీకి ఒరిగేది ఏమీలేద‌ని గ‌ల్లా అరుణ కూడా అదే రేంజ్‌లో ప‌లుమార్లు కౌంట‌ర్లు ఇచ్చారు. స‌రే! ఎన్నికల స‌మ‌యంలో అయినా.. ఎవ‌రి ప‌నివారు చేసుకుని ఉంటే ఈ గొడ‌వా వ‌చ్చేది కాదు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో నూ పార్టీని మ‌రిచిపోయి.. వ్యక్తిగ‌త విమ‌ర్శల‌కే గ‌ల్లా కుటుంబం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ.. అరుణ‌.. ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి, ఎంపీకి మాత్రం టీడీపీకే వేయండి అంటూ అభ్యర్థించారని, అందుకే తాను ఓట‌మి పాల‌య్యాన‌ని ఇప్పుడు డొక్కా ర‌గిలి పోతున్నారు.

ఏదో ఒకటి తేల్చుకునేందుకు….

గ‌ల్లా కుటుంబం కుట్రపూరితంగానే త‌న‌పై ఇలా ప్రచారం చేసింద‌ని డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ మండిప‌డుతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని టీడీపీ ఛీఫ్ చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళారు. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం వివరణ కూడా అడగలేదు. దీంతో మరింత అసంతృప్తితో ఉన్న డొక్కా ఏదో ఒకటి తేల్చుకునేందుకు త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బాబును క‌లిసేందుకు రెడీ అవుతున్నారు. అదే స‌మ‌యంలో గ‌ల్లా కుటుంబం కూడా దీనికి కౌంట‌ర్ ఇచ్చేందుకు అస్త్ర శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి. చంద్రబాబు ఈ ఇంట‌ర్నల్ వార్‌కు ఎలా ? చెక్ పెడ‌తారో ? చూడాలి. ఇదిలా ఉంటే గ‌ల్లా అరుణ‌కుమారి 2014 ఎన్నిక‌ల్లో కూడా తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే త‌ర‌హా ప్రచారం చేసిన‌ట్టు అప్పట్లో ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఇప్పుడు కూడా ఆమెపై మ‌ళ్లీ ప్రత్తిపాడులో అవే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

Tags:    

Similar News