ఇక దానిపైనే ఫోకస్…బాబు ఫిక్సయ్యారట

పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఏపీకి కొన్ని సంబంధాలుంటాయి. తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులున్నారు. అలాగే రాష్ట్రం విడిపోయినప్పటికీ కేసీఆర్ ను అభిమానించే వాళ్లు ఏపీలోనూ ఉన్నారు. [more]

Update: 2020-11-18 05:00 GMT

పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఏపీకి కొన్ని సంబంధాలుంటాయి. తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులున్నారు. అలాగే రాష్ట్రం విడిపోయినప్పటికీ కేసీఆర్ ను అభిమానించే వాళ్లు ఏపీలోనూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అక్కడా, ఇక్కడా బేరీజు వేసుకోవడం పరిపాటి. ఇప్పుడు తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక కూడా ఏపీలో చర్చ నీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జోష్ నింపిందనే చెప్పాలి.

సోషల్ మీడియాపైన…..

అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం వెనక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రధానంగా బీజేపీ సోషల్ మీడియా వింగ్ అక్కడ పనిచేసిన తీరును అధ్యయనం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లు బీజేపీకి సత్ఫలితాలనిచ్చాయంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ను కూడా బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

యువతలో నిరాశను…..

దీంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో యువత ఎక్కువ సంఖ్యలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసినట్లు స్పష్టమయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా యువత నిరాశలో ఉన్నారు. గత పదిహేను నెలలుగా పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేవు. దీనికి తోడు కరోనా వైరస్ తో ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారు. దీంతో చంద్రబాబు ఎక్కువగా యువతపై దృష్టిి పెట్టాలని నిర్ణయించారు.

త్వరలో సెమినార్ లు…..

త్వరలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ సెమినార్ లను నిర్వహించే యోచనలో ఉంది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చింది? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఎంతమందికి ఉపాధి లభించింది లెక్కలతో వివరించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికలో ప్రయోగాత్మకంగా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని, యువత సమస్యలపై ఫోకస్ పెంచాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు తెలుగుదేశం పార్టీలో హోప్స్ ను పెంచాయనే చెప్పాలి.

Tags:    

Similar News