బాస్… ఇప్పటికైనా తెలిసిందా?

ఒక రకంగా దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు [more]

Update: 2020-11-10 11:00 GMT

ఒక రకంగా దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు పరాజయం కలగలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచినా అది గెలుపు కాదు. ఎందుకంటే తొలి నుంచి టీఆర్ఎస్ నేతలు తాము గెలుపుకోసం కాదని, మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని పదే పదే చెప్పారు. కానీ ఫలితాలను చూస్తే టీఆర్ఎస్ కు ఒకరకంగా ప్రజలు షాకిచ్చారనే చెప్పాలి.

అన్ని ఉప ఎన్నికల్లో…..

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లోె ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరధం పట్టారు. ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తేగలిగారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచే టీఆర్ఎస్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇది నిజంగా ఆ పార్టీ నేతలు ఊహించనది. బీజేపీ ఇంతగా పుంజుకుంటుందని టీఆర్ఎస్ నేతలు ఊహించలేకపోయారు.

అంతా హరీశ్ రావే అయినా…..

దుబ్బాక ఉప ఎన్నికను అంతా మంత్రి హరీశ్ రావుపైనే వదిలిపెట్టారు. ప్రచారానికి కేసీఆర్ కూడా దూరంగా ఉన్నారు. మంత్రులెవ్వరూ వెళ్లలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఈ ఉప ఎన్నికలో బాధ్యులుగా వ్యవహరించారు. దీంతో ఉప ఎన్నిక మొత్తాన్ని హరీశ్ రావు మాత్రమే చూసుకున్నారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు ఒక గుణపాఠంగానే చెప్పాలి. భవిష‌్యత్ లోనూ బీజేపీ నుంచి టీఆర్ఎస్ కు ముప్పు పొంచి ఉందని ఈ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతున్నాయి.

కళ్లెం వేసినట్లేనా?

నిజానికి ఈ ఎన్నికల్లో సానుభూతి ఓట్లు టీఆర్ఎస్ కు రావాల్సి ఉంది. అందుకే మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టిక్కెట్ ఇచ్చారు. అయినా పెద్దగా సానుభూతి పనిచేయలేదనే చెప్పాలి. మూడు సార్లు ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకే సింపతీ ఎక్కువగా పనిచేసిందనే చెప్పాలి. ఇక కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా టీఆర్ఎస్ కు పెద్దగా కలసి వచ్చినట్లు కన్పించలేదు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేస్తుందనే చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News