దుద్దిళ్ల దూకడం ఖాయమయిపోయిందటగా

దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. అయితే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతా కుదిరితే మార్చి 7వ తేదీన ఆయన [more]

Update: 2020-03-03 09:30 GMT

దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. అయితే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతా కుదిరితే మార్చి 7వ తేదీన ఆయన అధికార టీఆర్ఎస్ లో చేరే అవకాశముందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శనివారం జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి కూడా దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరుకాకపోవడం అనుమానాలకు తావిస్తుంది. కరీనంగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

రెండు ఎన్నికల్లోనూ…..

గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లారు. సీనియర్ నేతలు మాత్రమే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డిలు పార్టీని వీడినప్పుడు కూడా శ్రీధర్ బాబు పేరు విన్పించింది. అయితే తాను పార్టీని వీడేది లేదని అప్పట్లో శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.

తొలి నుంచి కాంగ్రెస్ నే….

నిజానికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబం తొలి నుంచి రాజకీయంగా కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉంది. పార్టీల మారిన చరిత్ర వారికి ఇంతవరకూ లేదు. ఆయన తండ్రి శ్రీపాదరావుకు ఉన్న మంచిపేరు శ్రీధర్ బాబు విజయానికి కారణమవుతుంది. కాని రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిన తర్వాత శ్రీధర్ బాబు కూడా ఆలోచనలో పడ్డారు. మంధనిలో తాను ఎమ్మెల్యేని అయినా అధికారులు ఎవరూ మాట వినడం లేదు. ఓడిపోయిన వారే ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తుండటంతో ఒకింత మనస్థాపానికి గురయినట్లు తెలుస్తోంది.

పీసీసీ పదవి కోసం….

అయితే శ్రీధర్ బాబును దగ్గర నుంచి చూసిన వారెవ్వరూ ఆయన టీఆర్ఎస్ లోకి వెళతారని అనుకోరు. శ్రీధర్ బాబు వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆరాట పడతారు. తాను చెప్పినట్లే నడవాలనుకుంటారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నప్పుడూ అంతే. అయితే అది టీఆర్ఎస్ లో సాధ్యంకాదు. మరోవైపు పీసీసీ చీఫ్ రేసులో కూడా శ్రీధర్ బాబు ఉన్నారు. అయినా ఆయన వెళ్లిపోయేందుకు రెడీ అయినట్లు చెబుతున్నారు. మార్చి 7వ తేదీన శ్రీధర్ బాబు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరతారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నా శ్రీధర్ బాబు మాత్రం స్పందించడం లేదు.

Tags:    

Similar News