మళ్లీ ఎన్నికలు.. ఈసారి ముఖాముఖి

కర్ణాటకలో మరోసారి ఎన్నికల సమరం మొదలుకానుంది. ఉప ఎన్నికలు జరగనుండటంతో కర్ణాటకలో మళ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలూ ఆ నియోజవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. [more]

Update: 2020-12-01 17:30 GMT

కర్ణాటకలో మరోసారి ఎన్నికల సమరం మొదలుకానుంది. ఉప ఎన్నికలు జరగనుండటంతో కర్ణాటకలో మళ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలూ ఆ నియోజవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. కర్ణాటకలో ఇటీవల శిర, రాజేశ్వరి నగర స్థానాలకు ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్, జేడీఎస్ విడిగా పోటీ చేయడంతో బీజేపీ లబ్ది పొందిందనే చెప్పాలి.

మూడు స్థానాలకు…..

ఇక మరోసారి రెండు శాసనసభ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. మస్కి, బసవ కల్యాణ అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు బెళగావి లోక్ సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. అయితే ఈ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన కుమారుడు విజయేంద్రను ఇన్ ఛార్జిగా నియమించారు. శిర, కేఆర్ పేట నియోజకవర్గాలకు కూడా విజయేంద్ర బాధ్యత వహించి గెలిపించడంతో ఈ ఎన్నిక బాధ్యతను కూడా యడ్యూరప్ప విజయేంద్రకు అప్పగించారు.

ఇప్పటికే ప్రచారం…

కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు కలసి ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలసి వస్తుందని వారు విశ్వసిస్తున్నారు. నేతలందరినీ ఐక్యంగా పనిచేసేలా డీకే శివకుమార్ వ్యూహరచన చేస్తున్నారు. సిద్ధరామయ్య కూడా నేతలందరినీ కలుపుకుని వెళుతుండటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

బరిలో ఉండకపోవచ్చు….

ఇక మరో ముఖ్యమైన పార్టీ జనతాదళ్ ఎస్. ఇటీవల జరిగిన శిర, రాజేశ్వరి నగర ఉప ఎన్నికల్లో పోటీ చేసిన జేడీఎస్ ఓటమి పాలయింది. దీంతో ఆ పార్టీలో నీరసం ఆవహించింది. కనీస ఓట్లను కూడా సాధించలేదు. త్వరలో జరిగే మస్కి, బసవ కల్యాణ అసెంబ్లీ స్థానాల పరిధిలో జేడీఎస్ కు పట్టు లేదు. పెద్దగా బలం లేకపోవడంతో జేడీఎస్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ మూడు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ జరిగే అవకాశముంది.

Tags:    

Similar News