పట్టుదల.. మొండి పట్టుదల ఎవరిది గెలుపు?

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మొదలయింది. ఎనిమిది దశలలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఎవరిది గెలుపు అన్నది తేలనుంది. అయితే మూడో సారి [more]

Update: 2021-03-10 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మొదలయింది. ఎనిమిది దశలలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఎవరిది గెలుపు అన్నది తేలనుంది. అయితే మూడో సారి అధికారాన్ని నిలుపుకోవాలని మమత బెనర్జీ పట్టుదలగా ఉంది. అయితే ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని మొండిపట్టుదలతో బీజేపీ ఉంది. 294 అసెంబ్బీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ లో ఎవరిది గెలుపు అన్నది ఉత్కంఠగా మారింది. కానీ రెండు పార్టీల్లో ఒక్కటే ఆశ.

పార్లమెంటు ఎన్నికల్లో….

గత పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన స్థానాలను బట్టి బీజేపీ పశ్చిమ బెంగాల్ ను ఎలాగైనా చేజిక్కించుకుంటామని బీజేపీ విశ్వాసంతో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో 40 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకుని బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ లాంటి కీలక నేతలు పార్టీ మారడంతో తమ బలం పెరిగిందని బీజేపీ భావిస్తుంది.

స్థానికతకే పెద్దపీట వేస్తారని….

కానీ మమత బెనర్జీ ఆశలు వేరు. పార్లమెంటు ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికతను ప్రజలు చూస్తారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచినంత సులువు కాదని మమత బెనర్జీ భావిస్తున్నారు. అందుకే స్థానికతకే అవకాశం ఇవ్వాలని, గుజరాతీ పార్టీకి రాష్ట్రంలో కాలుమోపవద్దనీయవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ముస్లిం ఓట్లు చీలకుండా మమత బెనర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తనవైపునకు తిప్పుకునేందుకు…..

మైనారిటీలు మొన్నటి వరకూ మమత బెనర్జీ వెంటే ఉన్నారు. అయితే ఈసారి ముస్లిం పార్టీలు పోటీ చేస్తుండంతో వారి వైపు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. అందుకే మమత బెనర్జీ ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగాలీలు తన వైపే ఉంటారని మమత బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మమత బెనర్జీ, బీజేపీలు ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News