వాకింగ్ సీజన్ వస్తోంది..?

పాదయాత్ర. నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు తమ అజెండాకు విస్త్రృతమైన ఆదరణ కల్పించేందుకు ఉపకరించే సాధనం. ఆయా నాయకుల వ్యక్తిగత ఇమేజ్ ను సైతం ఈ యాత్రలు పైపైకి [more]

Update: 2021-06-29 15:30 GMT

పాదయాత్ర. నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు తమ అజెండాకు విస్త్రృతమైన ఆదరణ కల్పించేందుకు ఉపకరించే సాధనం. ఆయా నాయకుల వ్యక్తిగత ఇమేజ్ ను సైతం ఈ యాత్రలు పైపైకి తీసుకెళుతుంటాయి. మిగిలిన నాయకులకంటే ఓ మెట్టు పైన నిలబెడుతుంటాయి. గడచిన రెండు దశాబ్దాల్లో తెలుగు ప్రాంతంలో పాదయాత్రలు నాయకులను అధికారపీఠానికి చేరువ చేశాయి. పంక్లిష్టమైన రాజకీయ చిత్రం కనిపిస్తున్న తెలంగాణలో ఆధిక్యం కోసం మూడు పార్టీలు సిద్దమవుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తమ పార్టీలు ప్రత్యామ్నాయంగా ప్రజల్లో ముద్ర వేయించుకోవాలనే తపనతో నాయకులు వీటికి శ్రీకారం చుట్టబోతున్నారు. రెండు జాతీయ పార్టీలు, కొత్తగా పెట్టబోతున్న టీవైఎస్సార్ పార్టీలు ఇందుకు సిద్దమవుతున్నాయి.

రోడ్ టు హుజూరాబాద్….

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఏడాది మొదట్లోనే పాదయాత్రను మొదలు పెట్టాలనుకున్నారు. కానీ వరస ఎన్నికలు, కరోనా పెరగడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వాతావరణం క్రమేపీ మెరుగున పడుతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమెవరిదనే పోటీ పెరిగింది. అందులోనూ కాంగ్రెసు పార్టీ రేవంత్ ను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పోటీ మరింత గట్టిగా ఉండబోతోంది. ఈ పరిస్థితులను తట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని విస్తరించాలంటే ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదు. తాజాగా ఈటల రాజేందర్ రూపంలో బీజేపీకి బ్రహ్మాండమైన అస్త్రం దొరికింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రాజేందర్ విజయం సాధించేలా చూసుకుంటే కమలం మరో సారి గర్జించే అవకాశం ఏర్పడుతుంది. అక్టోబర్ లో ఉప ఎన్నికలు రావొచ్చని అంచనా. ఆగస్టు పదిహేను నుంచి భారత్ 75వ స్వాతంత్ర్యోత్సవ వార్షిక వేడుకలలో అడుగు పెడుతోంది. ఆ ముహూర్తాన పాదయాత్ర మొదలు పెట్టవచ్చని బీజేపీ శ్రేణులు బావిస్తున్నాయి. ఒకవేళ ఈలోపుగా పరిస్థితులు పూర్తిగా కుదుటపడకపోతే తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17 కూడా మంచి సమయంగానే చెబుతున్నారు. అన్నిజిల్లాలను చుట్టుముడుతూ ముగింపు సభ హుజూరాబాద్ లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని తలపోస్తున్నారు.

అందర్నీ చక్కబెట్టేందుకు…

ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు రేవంత్ పరిస్థితి కాంగ్రెసు లో ఇంకా కుదుట పడలేదు. అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. వీటన్నిటిని చక్కదిద్దేందుకు ఒకటి రెండు నెలలు పెద్దలందరితో సమన్వయం చేసుకుంటూ సంప్రతింపులు జరపాల్సి ఉంటుంది. అధిష్టానమూ అసమ్మతి నాయకులతో మాట్టాడే అవకాశాలున్నాయి. జిల్లాల స్థాయిలో రేవంత్ పై పెద్దగా తిరుగుబాట్లు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ వంటి రెబల్ లీడర్ కావాలని శ్రేణుల్లో వాదన వినిపిస్తోంది. ఆయనతో పీసీసీ పీఠానికి పోటీ పడిన వారెవరికీ రాష్ట్ర స్థాయిలో మాస్ ఇమేజ్ లేదు. అధిష్టానం దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫాలోయింగ్ కూడా కారణం. పార్టీని పటిష్టం చేస్తూ బలమైన నాయకుడిగా ఎదగడానికి పాదయాత్ర సరైన మార్గమనేది రేవంత్ ఆలోచన. గతంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలనుకున్నారు. కానీ మిగిలిన నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేసి , ఆపి వేయించగలిగారు. పీసీసీ అధ్యక్షునిగా ఇప్పుడా పరిస్థితి ఉండదు. అందువల్ల అక్టోబర్ తర్వాత ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకూ పాదయాత్ర చేయాలనేది రేవంత్ ఆలోచన. హుజూరాబాద్ ఎన్నిక తర్వాతనే దీనికి శ్రీకారం చుట్టవచ్చని తెలుస్తోంది.

జనంలోకి జెండా…

వ్యూహాత్మకమైన అజెండాతో అధికార టీఆర్ఎస్ షర్మిల పెట్టబోతున్న పార్టీకి ఆదిలోనే గండి కొట్టాలని చూస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డిని విలన్ గా రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టాలని దాడి మొదలు పెట్టింది. ఈ దాడిని తిప్పికొట్టి ప్రజల్లో వై.ఎస్. కు ఉన్న ఇమేజ్ ను పార్టీకి పెట్టుబడిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ షర్మిల పెట్టే పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రసార, ప్రచార సాధనాల కంటే పాదయాత్రనే సరైన సాధనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది వై.ఎస్ . రాజశేఖరరెడ్డి. ఒక మహిళగా అత్యధిక దూరం నడిచిన పాదయాత్రికురాలిగా షర్మిలది అరుదైన రికార్డు. ఈ రెండింటి ప్రేరణతో తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేయాలనేది షర్మిల లక్ష్యంగా తెలుస్తోంది. జిల్లాల వారీ కమిటీలు వేసి , పార్టీకి కొంత ఉత్సాహం తెప్పించిన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లాలనేది షర్మిల సంకల్పం. వైఎస్సార్ తన యాత్రను తెలంగాణ నుంచే ప్రారంభించారు. వచ్చే ఏడాది మొదటి నుంచి నాలుగు నెలలపాటు పాదయాత్ర చేసి వై.ఎస్. పాదయాత్ర ప్రారంభించిన ఏప్రిల్ తొమ్మిదో తేదీన ముగింపు చేయవచ్చని తెలంగాణ వైఎస్సార్ పార్టీ నాయకులు యోచిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News