అదే భయ పెడుతోంది….?
తెలంగాణ రాష్ట్రసమితికి ఎన్నికలు కొత్తకాదు. సాహసాలూ సర్వసాదారణమే. ఉద్యమకాలంలో ఏమంత పరిస్థితులు అనుకూలంగా లేని స్థితిలోనూ సవాల్ విసిరి తన సత్తా చాటుకున్న సందర్భాలున్నాయి. దెబ్బతిన్న ఘట్టాలకూ [more]
తెలంగాణ రాష్ట్రసమితికి ఎన్నికలు కొత్తకాదు. సాహసాలూ సర్వసాదారణమే. ఉద్యమకాలంలో ఏమంత పరిస్థితులు అనుకూలంగా లేని స్థితిలోనూ సవాల్ విసిరి తన సత్తా చాటుకున్న సందర్భాలున్నాయి. దెబ్బతిన్న ఘట్టాలకూ [more]
తెలంగాణ రాష్ట్రసమితికి ఎన్నికలు కొత్తకాదు. సాహసాలూ సర్వసాదారణమే. ఉద్యమకాలంలో ఏమంత పరిస్థితులు అనుకూలంగా లేని స్థితిలోనూ సవాల్ విసిరి తన సత్తా చాటుకున్న సందర్భాలున్నాయి. దెబ్బతిన్న ఘట్టాలకూ కొదవ లేదు. కానీ ఈసారి హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు దడ పుట్టిస్తున్నాయి. ఎన్నికలంటే వచ్చిన జడుపు కాదు అది. ఎన్నికల అనంతరం పర్యవసానాలే టీఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తున్నాయి. నిజానికి ఎన్నికలకు సంబంధించి చిత్రం ఇప్పటికే స్పష్టమైపోయింది. బీజేపీ దూకుడు పోటాపోటీ వాతావరణాన్ని స్రుష్టించింది. తన సంప్రదాయ ఓటర్లనే కాకుండా తటస్థ ఓటర్లను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగానే బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తీవ్రస్థాయి విమర్శలతో అధికారపక్షం పోటీలోనే లేదన్నంత హడావిడి చేస్తోంది. ఎంఐఎం ను టార్గెట్ చేస్తోంది. హిందూ ఓట్లను అత్యధికంగా రాబట్టుకోవాలనుకునే ఎత్తుగడ లో భాగమే ఇది. అందుకే ఎంఐఎంను, టీఆర్ఎస్ ను కలగలిపి ఒకే కూటమిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కొంతమేరకు ఇది ఫలిస్తున్న సూచనలే కానవస్తున్నాయి. ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. అయినా అధికారం ఆమడదూరమే. బలాబలాల్లో మార్పులే తప్ప ఒక్కసారిగా పీఠం చేజిక్కేంతటి మార్పు సాధ్యం కాదనేది ఒక అంచనా.
కాంగ్రెసు కథ కంచికేనా….?
ఈ గ్రేటర్ ఎన్నికలతో కాంగ్రెసు పార్టీ కోలుకోలేని దెబ్బతినే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రచారంలో ఆ పార్టీ పూర్తిగా వెనకబడింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ల హవా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష స్థాయికి తాను చేరుకున్నానని బీజేపీ భావిస్తోంది. హైదరాబాద్ ఎన్నికలతో ఆ విషయాన్ని మరింత స్పష్టం చేయాలని పావులు కదుపుతోంది. ఒకవేళ కాంగ్రెసు పార్టీ గ్రేటర్ లో అత్యధిక సీట్లు, ఓట్లు సాధించే మొదటి మూడు పార్టీల్లో లేకపోతే చిక్కులు తప్పవు. దాని ప్రభావం తెలంగాణలో హస్తం పార్టీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగానే పడుతుంది. కాంగ్రెసు స్థానం కుదేలు అవుతుందన్న అనుమానం ఇప్పుడు టీఆర్ఎస్ ను సైతం వేధిస్తోంది. నిత్యం ముఠా తగాదాలు, నాయకత్వ విభేదాలతో సతమతమయ్యే కాంగ్రెసు ను ఎదుర్కోవడం అధికార పార్టీకి చాలా సులభం. బీజేపీ బలపడితే నిరోధించడం టీఆర్ఎస్ కు అంత సులభం కాదు.
కలిసొస్తున్న సమీకరణలు…
తెలుగుదేశం, వైసీపీల ఓటు బ్యాంకు, ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు. ఈ మూడు ఫాక్టర్లు చర్చకు తావిస్తున్నాయి. వైసీపీ ఎప్పుడో చేతులెత్తేసింది. తెలుగుదేశం నామమాత్రపు పోటీ చేస్తున్నప్పటికీ దాని ప్రభావం శూన్యం. టీడీపీ సంప్రదాయ ఓటు బీజేపీకి పడే సూచనలు న్నాయంటున్నారు. సెటిలర్ల విషయంలో అధికార పార్టీ ఎంత మంచిగా మాట్లాడుతున్నప్పటికీ టీఆర్ఎస్ తో మానసిక అగాధం అనేది ఇప్పటికీ ఉంది. 2016లో తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్న స్థితిలో రిస్క్ కు సాహసించని సీమాంధ్ర ప్రాంతం ఓటర్లు టీఆర్ఎస్ కే జై కొట్టారు. ఓటుకు నోటు దెబ్బతో చంద్రబాబు అధికార నివాసాన్ని విజయవాడకు మార్చుకోవడం, రాజధానిని వదిలి వెళ్లిపోవడంతో అప్పట్లో ప్రత్యామ్నాయం కనిపించని స్థితిలో ఉన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లకూ అప్పట్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా తనను తాను ఆవిష్కరించుకోలేకపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయమన్న భావనను రేకెత్తించగలిగింది. దీంతో సీమాంధ్ర ప్రాంత ఓటర్లతో పాటు టీఆర్ఎస్ వ్యతిరేకులకూ బీజేపీ ఒక ఆశాజనకమైన శక్తిగా కనిపిస్తోంది. ఇదే అధికార పార్టీకి గుబులు పుట్టించే అంశం.
అటు ఇటు కాని స్థితి…
రాజకీయాల్లో చాలా స్పష్టమైన ఒరవడితో దూసుకుపోవడం, ఎత్తుగడలు వేయడం కేసీఆర్ శైలి. ఈ ఎన్నికలో అది లోపించింది. అటు తెలంగాణ సెంటిమెంటు భావోద్వేగాలను రగిలించలేక పోతున్నారు. ఆంధ్రప్రాంతం ఓటర్లు దూరమవుతారనే భావనతో ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. అయినప్పటికీ వారిని ఆకట్టుకోలేకపోతున్నారు. అటు తెలంగాణ ఓటర్లు, ఇటు ఆంధ్రా ఓటర్లకు తననే ఎన్నుకోవాల్సిన అవసరాన్ని టీఆర్ఎస్ చూపించలేకపోతోంది. కచ్చితంగా ఈ ఎన్నికల అనంతరం టీఆర్ ఎస్, ఎంఐఎం కూటమి కడితేనే గ్రేటర్ హైదరాబాద్ లో అధికార జెండా ఎగురుతుంది. గతంలో మాదిరిగా టీఆర్ఎస్ గ్రేటర్ లో సెంచరీ కొట్టి ఏకపక్ష విజయం సాధించే వాతావరణం ఏమాత్రం లేదు. మరో వైపు ఎంఐఎం తన బలాన్ని దాదాపు కాపాడుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సగం సీట్లలో గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు. అదే జరిగితే ఎన్నికల అనంతరం ఎంఐఎం కలిసి వస్తేనే అధికారం దక్కుతుంది.
బీజేపీ పంట పండినట్లే…
గ్రేటర్ లో జెండా ఎగరవేస్తామని పైకి ఎన్ని మాటలు చెప్పినా అదంత సులభం కాదని బీజేపీ నాయకులకు తెలుసు. కానీ దీర్ఘకాల వ్యూహంతోనే ఆ పార్టీ ముందుకు వెళుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎం ను తలదన్నిసీట్లు, ఓట్లు పరంగా రెండో స్థానంలో నిలవాలనేది బీజేపీ ఎత్తుగడ. కమలం పార్టీ నగరంలో 50 వరకూ సీట్లు సాధించగలిగితే ఎంఐఎం, టీఆర్ఎస్ లు కలిసికట్లుగా పాలక మండలిని ఏర్పాటు చేసినా బీజేపీ పంట పండినట్లే. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తానా ను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి, హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఈ అంశమే టీఆర్ఎస్ ను భయపెడుతోంది. గ్రేటర్ ఎన్నికలతో భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పునాదులు వేసుకుంటోంది. ఇది కచ్చితంగా అధికార పార్టీని కలవరానికి గురి చేసే అంశమే.
– ఎడిటోరియల్ డెస్క్