ఏలూరి ముందున్న టార్గెట్లు.. ఆ మూడే

టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా పార్లమెంట‌రీ జిల్లాల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. దీనివెనుక ఉన్న ప్రధాన వ్యూహం.. పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని తిరిగి అధికారంలోకి [more]

Update: 2020-10-11 00:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా పార్లమెంట‌రీ జిల్లాల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. దీనివెనుక ఉన్న ప్రధాన వ్యూహం.. పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డం, ఇప్పుడున్న స‌మ‌స్యల‌ను అధిగ‌మించి పార్టీలో అసంతృప్తుల‌ను త‌గ్గించి, నాయ‌కుల‌ను లైన్‌లో పెట్టి.. పార్టీ పుంజుకునేలా చేయ‌డం. ఈ క్రమంలో ఈ బాధ్యత ఇప్పుడు పార్టీ పార్లమెంట‌రీ జిల్లాల ఇంచార్జ్‌లుగా ఉన్న నేత‌ల‌పైనే ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విష‌యంలో బాప‌ట్ల ఇంచార్జ్‌గా నియ‌మితులైన‌.. ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుకు కొన్ని స‌వాళ్లు ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ మూడు నియోజకవర్గాల్లో…..

బాప‌ట్ల పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చూసుకుంటే.. చీరాల‌, సంత‌నూత‌ల‌పాడు, బాప‌ట్ల వంటి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. బాప‌ట్లలో అయితే.. 1999లో అనంత‌వ‌ర్మ గెలిచిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు మ‌ళ్లీ పార్టీ గెలుపుగుర్రం ఎక్కిన ప‌రిస్థితి లేదు. ఇక్కడ పార్టీని లైన్‌లో పెట్టడం గెలుపు గుర్రం ఎక్కేలా చేయ‌డం ఏలూరి సాంబ‌శివ‌రావుకి స‌వాలుతో కూడిన ప‌నేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఇక్కడ దారుణంగా ప‌డిపోయింది.

మార్చాలని డిమాండ్……

నిన్న మొన్నటి వ‌ర‌కు ఇక్కడ పార్టీ కేడ‌ర్‌కు భ‌రోసా క‌ల్పించే నేతే క‌రువ‌య్యారు. అయితే, ఇటీవ‌ల వేగేశ‌న‌‌ న‌రేంద్ర వ‌ర్మకు బాధ్యత‌లు అప్పగించాక పార్టీ స్పీడ్ అందుకుంది. న‌రేంద్ర వ‌ర్మ నేతృత్వంలో పార్టీని స‌మ‌న్వయం చేసుకోగ‌లిగితే ఇక్కడ పార్టీ రెండున్నర ద‌శాబ్దాల త‌ర్వాత అయినా గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం అయితే ఉంది. ఇక‌, సంత‌నూత‌ల‌పాడు కూడా ఏలూరి సాంబ‌శివ‌రావుకి స‌వాలే. ఇక్కడ గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ బీఎన్ విజ‌య్‌కుమార్‌.. ఓట‌మి బాట‌లో ఉన్నారు. పైగా ఆయ‌న‌ను మార్చాల‌ని ఇక్కడి త‌మ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా అధ్యక్షుడి వల్లనే కాలేదు…..

2014 ఎన్నిక‌ల్లోనే ఇక్కడ విజ‌య్‌కు సీటు ఇచ్చేందుకు స్థానిక నాయ‌కులు ఒప్పుకోలేదు. అయితే చంద్రబాబు ఆయ‌న‌కే సీటు ఇవ్వగా ఓడిపోయారు. ఇక 2019లో విజ‌య్‌కు సీటు ఇస్తే ఓడిస్తామ‌ని టీడీపీ నేత‌లు స‌వాల్ చేసినా బాబు మ‌రోసారి ఆయ‌న‌కే సీటు ఇవ్వగా అక్కడ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ విజ‌య్‌పై స్థానిక నాయ‌క‌త్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. అక్కడ ఎవ‌రు చెప్పినా విజ‌య్ విష‌యంలో స్థానిక కేడ‌ర్ విన‌డం లేదు. ఈ స‌మ‌స్య ప‌రిష్కరించ‌లేక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జ‌నార్థన్ సైతం చేతులు ఎత్తేశాడు. ఈ స‌మ‌స్యను స‌రిచేయ‌డంఏలూరి సాంబ‌శివ‌రావుకి పెద్ద స‌వాలే.

చీరాలలోనూ చేతులెత్తేయడంతో….

ఇక‌, చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాం గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి.. పార్టీకి ఊపు తెచ్చార‌ని అనుకునేలోగానే.. ఆయ‌న పార్టీ మారిపోయారు. దీంతో ఇక్కడ పార్టీని మ‌ళ్లీ మొద‌టి నుంచి లైన్‌లో పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక్కడ వైసీపీలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న క‌ర‌ణం, ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీత‌, పాలేటి రామారావు లాంటి ఉద్దండులు ఉన్నారు. వీరికి బ‌లంగా పార్టీని నిల‌బెట్టే బాధ్యత ఏలూరి సాంబ‌శివ‌రావుమీదే ఉంది. అయితే, కొస‌మెరుపు ఏంటంటే.. రేప‌ల్లె, వేమూరు, అద్దంకి, ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పార్టీ ఆశాజ‌న‌కంగా ఉండ‌డ‌మే. మిగిలిన మూడు నియోజ‌క‌వ‌ర్గాలు మాత్రం ఏలూరి సాంబ‌శివ‌రావు వ్యూహాల‌కు స‌వాలుగా మార‌నున్నాయి. మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Tags:    

Similar News