టీఆర్ఎస్ లో సీన్ రివర్స్

ఇద్దరూ సీనియ‌ర్ నాయ‌కులే. రెండు ద‌శాబ్దాల‌కు పైగానే రాజ‌కీయాలు చేస్తున్న వారే. ఇద్దరూ కూడా తెలంగాణ‌లో ప్రస్తుతం కొడిగ‌ట్టేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారే. [more]

Update: 2019-08-27 09:30 GMT

ఇద్దరూ సీనియ‌ర్ నాయ‌కులే. రెండు ద‌శాబ్దాల‌కు పైగానే రాజ‌కీయాలు చేస్తున్న వారే. ఇద్దరూ కూడా తెలంగాణ‌లో ప్రస్తుతం కొడిగ‌ట్టేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారే. అయితే, ఇప్పుడు వీరిద్దరే తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారారు. విష‌యంలోకి వెళ్తే.. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన క‌డియం శ్రీహ‌రి. తెలంగాణ ఉద్యమ స‌మ‌యానికి ముందు టీడీపీలో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు హ‌యాంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. ఇక‌, తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న క్రమంలో ఆయ‌న సైకిల్ దిగి కారెక్కారు. తెలంగాణ ఉద్యమ సార‌ధి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జై కొట్టారు.

నమ్మదగిన నేతగా….

అనంత‌రం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, వ‌రంగ‌ల్ ఎంపీగా విజ‌యం సాధించిన క‌డియం శ్రీహ‌రికి అనూహ్యంగా డిప్యూటీ సీఎం ప‌ద‌వి సొంత‌మైంది. వాస్తవానికి ఎస్సీ వ‌ర్గానికి చెందిన సిరిసిల్ల రాజ‌య్యకు కేసీఆర్ డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చారు. అయితే, ఆయ‌న పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను ప‌క్కన పెట్టి ఆయ‌న స్థానంలో అదే ఎస్సీ వ‌ర్గానికి చెందిన క‌డియంకు పెద్దపీట వేశారు. కేసీఆర్‌కు రైట్ హ్యాండ్‌, న‌మ్మద‌గిన నాయ‌కుడిగా ఎదిగారు క‌డియం. 2014 ఎన్నిక‌ల్లో కేసీఆర్ ముందు క‌డియంకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాల‌నుకున్నా చివ‌ర్లో వ‌రంగ‌ల్ ఎంపీ సీటు ఇచ్చారు.

కొంతకాలం హవా….

ఆయ‌న ఎంపీగా గెలిచాక‌… రాజ‌య్యను త‌ప్పించ‌డంతో ఆయ‌న్ను ఆ ప‌ద‌వికి రాజీనామా చేయించి ఉప‌ముఖ్యమంత్రిని చేయ‌డంతో పాటు ఎమ్మెల్సీని చేశారు. ఆ త‌ర్వాత జిల్లాలో క‌డియం హ‌వా సాగింది. దీంతో ఆయ‌న వ‌రంగ‌ల్‌లో ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఈ స‌మ‌యంలోనే టీడీపీ అసెంబ్లీ ప‌క్ష నాయ‌కుడిగా ఉన్న ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో క‌డియం వ్యవ‌హ‌రించారు. గ‌త నాలుగున్నరేళ్లలో ఇద్దరి మ‌ధ్య ఆధిప‌త్యం భారీ స్థాయిలో కొన‌సాగింది. అయితే, అనూహ్యంగా 2016లో ఎర్రబెల్లి టీడీపీకి రాం రాం ప‌లికి.. టీఆర్ఎస్ చెంత‌కు చేరిపోయారు.

ఆధిపత్య పోరుతో…..

అయితే క‌డియం, ఎర్రబెల్లి మ‌ధ్య వారు టీడీపీలో ఉన్నప్పటి నుంచే పొసిగేది కాదు. క‌డియం ఎర్రబెల్లిని బాగా టార్గెట్‌గా చేసేవారు. వీరు పార్టీలు మారినా ఆ శ‌తృత్వం అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే ఎర్రబెల్లి పార్టీ మారారో వ‌రంగ‌ల్ నుంచి ఆయ‌న కూడా టీఆర్ ఎస్‌లో కీల‌కంగా మారారు. దీంతో అటు క‌డియం, ఇటు ఎర్రెబెల్లి వ‌ర్గాల మ‌ధ్య పోరు సాగుతోంది. ఇక‌, తాజాగా గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. క‌డియంకు టికెట్ ఇవ్వలేదు. ఆయ‌న ఎమ్మెల్సీగానే ఉన్నారు.

ఇప్పుడు ఎర్రబెల్లి…..

ఆ ఎన్నిక‌ల్లో త‌న‌కు లేదా త‌న కుమార్తె సుష్మకు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ సీటు ఇప్పించుకోవాల‌ని విఫ‌ల ప్రయ‌త్నాలు చేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ మాత్రమే ఉంది. ఈ కేబినెట్‌లోకి క‌డియంను కేసీఆర్ తీసుకోలేదు. దీంతో ఇప్పుడు ఎర్రబెల్లి రివ‌ర్స్ అవుతున్నారు. గ‌తంలో ఆధిప‌త్యం చ‌లాయించిన క‌డియంపై తాను ఇప్పుడు ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. జిల్లాలో ఎర్రబెల్లి వ‌న్ మ్యాన్ షో న‌డుస్తుండ‌గా క‌డియంను ప‌ట్టించుకున్న వారే లేరు. మ‌రి ఓడ‌లు బ‌ళ్లవ‌డం, బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం అంటే ఇదేన‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News