ఈటలా..ఇదేంది నాయనా?

రోజుకు ఐదు వేలు కేసులకు పైగానే. కరోనా తెలంగాణను భయపెడుతుంది. మహారాష్ట్ర ప్రభావంతో తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ కరోనా తెలంగాణలో [more]

Update: 2021-04-20 00:30 GMT

రోజుకు ఐదు వేలు కేసులకు పైగానే. కరోనా తెలంగాణను భయపెడుతుంది. మహారాష్ట్ర ప్రభావంతో తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ కరోనా తెలంగాణలో చుక్కలు చూపుతుంది. అయితే తొలిసారి కరోనా వైరస్ వచ్చినప్పడు లాక్ డౌన్ ఉంది. దీంతో కరోనా కట్టడి చాలా వరకూ సాధ్యమయింది. కానీ సెకండ్ వేవ్ ను గట్టెక్కడం ఎలా అన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిత్యం అధికారులతో సమీక్ష చేస్తున్నారు.

తీవ్రత ఉందంటుంది ఆయనే…

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉందని ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. బెడ్స్ దొరకడం లేదు. ప్రయివేటు ఆసుపత్రులు కరోనాను సొమ్ము చేసుకుంటున్నాయి. లక్షల్లో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. సెకండ్ వేవ్ వారు వీరు అని తేడా లేకుండా అందరికీ అంటుకుంటుంది. మధ్య తరగతి ప్రజలు ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం అంతా బాగానే ఉందంటున్నారు.

లాక్ డౌన్ మాత్రం లేదట…..

ఇంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రజలపైనే భారాన్ని మోపింది. లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి వి పెట్టబోమని ఈటల రాజేందర్ చెబుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. లాక్ డౌన్ పెట్టకుండా ఉపాధిపనులకోసం బయటకు రావద్దంటే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉపాధి కోసం బయటకు వస్తున్న ప్రజలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

ప్రజలపైనే భారం….

ఇక హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో వలస కార్మికులు కూడా సిటీని వదిలి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కొన్ని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లాక్ డౌన్ సమస్య లేదని ఈటల రాజేందర్ చెప్పడం పై సోషల్ మీడియాలో విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను ప్రభుత్వ ఆదాయం కోసం పణంగా పెడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. స్వీయ నియంత్రణ తప్ప వేరే మార్గం లేదని ప్రభుత్వం తప్పించుకుంటోంది. ఇప్పటికైనా నైట్ కర్ఫ్యూ అయినా విధించి ప్రభుత్వం కరోనాను కొంతవరకూ కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా ప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు.

Tags:    

Similar News