స‌త్తా చాటే దిశ‌గా ఈట‌ల.. నెక్ట్స్ స్టెప్ ఇదే ?

తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌డిచిన రెండు రోజులుగా చ‌ర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఏం చేస్తారు? ఏం చేయ‌నున్నారు? ఏ [more]

Update: 2021-05-05 09:30 GMT

తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌డిచిన రెండు రోజులుగా చ‌ర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఏం చేస్తారు? ఏం చేయ‌నున్నారు? ఏ దిశ‌గా ఆయ‌న అడుగులు ప‌డ‌తాయి ? వంటి అనేక విష‌యాల‌పై రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్తర‌ఫ్ చేయ‌డం.. త‌న హ్యాచ‌రీస్‌కు సంబంధించి అసైన్డ్ భూముల విష యంలో కేసులు న‌మోదు చేసేలా ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తుండ‌డం వంటి విష‌యాలు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌లనంగా మారిన విష‌యం తెలిసిందే.

తనను తాను నిరూపించుకునేందుకు?

ఈ ప‌రిస్థితిలో ఈట‌ల రాజేంద‌ర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ముందు త‌న‌ను తాను నిరూపించుకునేందుకు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తారు. అంటే.. ఇప్పుడు త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్తర‌ఫ్ చేసిన‌ట్టుగా ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి రాజీనామా చేయ‌మ‌ని కోర‌క‌ముందే.. పార్టీ నుంచి బ‌హిష్కరించ‌క‌ముందే ఆయన స్వయంగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతోపాటు.. పార్టీ నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్రమంలో వ‌చ్చే ఆరు మాసాల్లో ఉప ఎన్నిక ఖాయంగా వ‌స్తుంది.

అలాంటి ప్రయత్నాలు….

రెండు రోజుల పాటు ఈట‌ల రాజేంద‌ర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన హుజూరాబాద్‌లో త‌న అనుచ‌రులు, పార్టీ కేడ‌ర్‌తో స‌మావేశ‌మ‌మయ్యారు. వారితో చ‌ర్చించాకే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయడంపై ఓ క్లారిటీకి వచ్చే అవ‌కాశం ఉంది. ఉప ఎన్నిక‌ల‌కు వెళితే అప్పుడు త‌న స‌త్తా నిరూపించుకుని.. సొంత‌గా గెలిచి.. కేసీఆర్‌కు స‌వాల్ రువ్వుతార‌నే వాద‌న వినిపిస్తోంది. అప్పటి వ‌ర‌కు ఈట‌ల ఏ పార్టీ వైపు కానీ.. ఇత‌ర‌త్రా సంఘ‌టితం చేసే ప‌రిస్థితి కానీ చేయ‌ర‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

సొంతంగా గెలిచి…

ప్రస్తుతం బీసీ సామాజిక వ‌ర్గంలో ఈట‌ల రాజేంద‌ర్ కు మంచి ప‌ట్టుంది. అదేస‌మ‌యంలో తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలోనూ ఆయ‌న ధీటుగా త‌న స‌త్తా చాటారు. ఉద్యమంలో కేసీఆర్‌తో అడుగులు వేశారు. సో.. ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆయ‌న సొంత‌గా గెలిచి స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. ఇది ఫ‌లించిన త‌ర్వా ఆ తర్వాతే.. బీజేపీలోకి వెళ్లడ‌మా? లేక సొంత‌గా పార్టీ పెట్టడ‌మో చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇంట గెలిచాకే రాష్ట్ర వ్యాప్తంగా త‌న‌తో క‌లిసి వ‌చ్చేవారు.. త‌న‌ను మెచ్చేవారిని సంఘ‌టితం చేసేందుకు ఈట‌ల రాజేంద‌ర్ ప్రయ‌త్నిస్తోన్నట్టు భోగ‌ట్టా ?

Tags:    

Similar News