ఈ ముగ్గురి మదిలో ‘ఈటె’లా…?

తెలంగాణ రాష్ట్రసమితి ప్రస్తుతం ఒక కుటుంబ పార్టీ. అందులో భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. సర్దుకుపోతూ కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తే అంతా సాపీగానే సాగిపోతుంది. కాదని తల ఎగరేస్తే [more]

Update: 2021-05-02 15:30 GMT

తెలంగాణ రాష్ట్రసమితి ప్రస్తుతం ఒక కుటుంబ పార్టీ. అందులో భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. సర్దుకుపోతూ కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తే అంతా సాపీగానే సాగిపోతుంది. కాదని తల ఎగరేస్తే ఎంతటి వాడికైనా శంకరగిరి మాన్యాలు తప్పవు. ఈటల రాజేందర్ అంకం అందుకు ఒక ఉదాహరణ మాత్రమే. అయితే అధినేతనే ధిక్కరించే ధైర్యం ఈటలకు ఎలా వచ్చింది? మంత్రిత్వ శాఖను కూడా తప్పించేశారు. దాదాపు వేటు పడిన స్థితిలో పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటు నుంచి పార్టీలో కేసీఆర్ , హరీశ్ ల తర్వాత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఈటల రాజేందర్ . హరీశ్ రావు, రాజేందర్ లు నిజానికి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటే పార్టీలో సీనియర్లు. 2009-14 మధ్య అత్యంత సున్నితమైన సమయంలో టీఆర్ఎస్ తరఫున శాసనసభా పక్షం నాయకునిగానూ పనిచేశాడాయన. అంతటి పెద్ద నాయకునిపై వేటు వేయడమంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ వెనకబడిన తరగతులకు చెందిన మంత్రి. పొమ్మనకుండా పొగ బెట్టే క్రమంలో భాగంగానే ఈటల రాజేందర్ పై చర్యలు ప్రారంభమయ్యాయనేది అందరి అంచనా.

తెగేదాకా తెచ్చుకున్నాడు..

టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత ఎంతో కొంతమేరకు స్వతంత్రంగా వ్యవహరించే మంత్రులు ఇద్దరే ఒకరు హరీశ్, రెండు ఈటల రాజేందర్ . కేటీఆర్ ఎలాగూ వివిధ శాఖల సమన్వయం చూస్తుంటారు. పార్టీలో ఈ నలుగురిని అత్యంత కీలకమైన వారిగా శ్రేణులు సైతం గుర్తిస్తుంటాయి. ఈటల రాజేందర్ స్వతంత్ర శైలిని అనుసరించడానికి ఇష్టపడతారు. ఉద్యమ సమయం నుంచే అధినేతతో కొంత బిన్నాభిప్రాయాలున్నాయి. సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలకు కేసీఆర్ కు సంపూర్ణంగా ఇష్టంగా లేకపోయినా రాజేందర్ మద్దతు పలికారు. ఆర్థికంగానూ సహకరించారు. జేఏసీతో కలిసి నడుస్తూ ఉద్యమం సక్సెస్ చేయడమే అప్పటి లక్ష్యం. ఉద్యమ సమయం నాటికే ఈటల రాజేందర్ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. అందువల్ల పార్టీకి కూడా అండదండగా ఉంటూ వచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచీ కేసీఆర్ ప్రాధాన్యతలు మారుతూ రావడం పట్ల ఈటల రాజేందర్ లో అసంతృప్తి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజేందర్ చెప్పిందే మాటగా తొలుత చెలామణి అయ్యేది. తర్వాత కేసీఆర్ చెక్ పెట్టడం ప్రారంభించారు. పైపెచ్చు కేటీఆర్ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదమైన వ్యాఖ్యలతో తన అసంతృప్తిని వెలిగక్కుతూ ఈటల రాజేందర్ అగ్రనాయకత్వానికి దూరమయ్యారు.

ఫలించిన ఎదురుచూపులు…

పార్టీకి ఎవరూ ఓనర్ కాదు, తమకు పదవి ఎవరు పెట్టిన భిక్ష కాదంటూ ఈటల రాజేందర్ గతంలో చేసిన వ్యాఖ్య నేరుగా అధిష్టానాన్ని ఉద్దేశించిందే. అయితే రాజేందర్ పార్టీకీ చేసిన సేవలు. అతనిపై చర్యలు తీసుకుంటే పార్టీ నాయకత్వంపై పడే ప్రభావాన్ని అంచనా వేసుకుని కేసీఆర్ సంయమనం పాటించారు. అయినప్పటికీ దూకుడు మనస్తత్వం కలిగిన ఈటల రాజేందర్ తనకు ప్రభుత్వ పరంగానూ, పార్టీలోనూ తగినంత ప్రాధాన్యం లభించడం లేదనే ఉద్దేశంతో నిరసనను వివిధ రూపాల్లో వెలిగక్కుతూనే వస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పనితీరుపైనే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే సమాచారమూ కేసీఆర్ కు చేరింది. అదంతా ఒక ఎత్తు అయితే ఒక పార్టీనే పెడతారనే వాదనా బయలు దేరింది. ఈటల వస్తే తీసుకోవడానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెసు సిద్దంగా ఉన్నాయి. ఈటల రాజేందర్ కు ఉండే సొంత బలం కంటే టీఆర్ఎస్ బలహీనతలు బయటపెట్టడానికి అతను అస్త్రంగా ఉపయోగపడతాడనేది ప్రత్యర్థి పార్టీల యోచన. ఈ తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలా? అని చూస్తున్న కేసీఆర్ కు ఏదో కొందరు రైతులు పిర్యాదు చేశారనేది సాకుగా దొరికింది. ఆగమేఘాల మీద విచారణ, నివేదిక , మంత్రిత్వ శాఖ తొలగింపు హుటాహుటిన జరిగిపోయింది. ఇక వేటు వేయడమే తరువాయి. అయినా ఉద్యమ సహచరుడు, కేబినెట్ కొలీగ్ పై ఆరోపణలు వస్తే ప్రాధమికంగా పిలిచి మాట్టాడాలి. అందులో నిజానిజాలపై అంతర్గత విచారణ చేయించాలి. కానీ వెంటనే చర్యలకు ఉపక్రమించారంటే వదిలించుకోవడమే లక్ష్యమని స్పష్టంగానే తేలిపోయింది. ఇప్పుడు ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారా. సీఎం సస్పెండ్ చేస్తారా? అన్నదే తేలాలి.

ఈ ఇద్దరికీ సంకటం…

ఈటల రాజేందర్ పై చర్య కేటీఆర్ కు , హరీశ్ రావుకు కొంత ఇబ్బందికరమైన అంశమే. కేటీఆర్ రాజకీయ ప్రస్థానం తొలి దశలో జిల్లాలో ఈటల రాజేందర్ ఆయనకు మార్గదర్శిగా ఉండేవారు. హరీశ్ రావుతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి శాసనసభలో పదేళ్ల పాటు తెలంగాణ ఉద్యమ పల్లవిని వినిపించడంలో , సభా వేదికగా ఆందోళనలు రూపకల్పన చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తాజా వివాదం కూడా హరీశ్, కేటీఆర్ లతోనూ ముడి పడి ఉండటం విశేషం. ఈటల రాజేందర్ సమస్య పరిష్కరించే బాధ్యత కేటీఆర్ కే అప్పగించారు కేసీఆర్. కానీ డీల్ చేయడంలో కేటీఆర్ సక్సెస్ కాలేకపోయారు. అలాగే తాజాగా అసైన్డ్ భూముల అంశం మెదక్ జిల్లా పరిధిలోకి వస్తోంది. ఆ జిల్లా మంత్రిగా హరీశ్ రావుకూ బాధితులు చాలాకాలంగానే మొర పెట్టుకున్నారనేది సమాచారం. తాను జోక్యం చేసుకోకుండా మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈటల రాజేందర్ పై వేటు రాజకీయ సంచలనంగా మారబోతోంది. టీఆర్ఎస్ లో సొంత గొంతు వినిపించేవారు ఇకపై ఎవరూ ఉండరనే వాదన బలం సంతరించుకుంటుంది. ఉద్యమంలో కీలక వ్యక్తినీ బయటకు పంపేశారంటే మరింతగా కుటుంబ పార్టీ ముద్ర పడుతుంది. అసంతృప్తి వాదుల్లో చర్చ ముమ్మరమవుతుంది. తప్పని సరి పరిస్థితుల్లో హరీశ్, కేటీఆర్ ల ప్రాధాన్యం కూడా తగ్గించాల్సి రావచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News