బాబు ‘కోత’లు మొదలు…. జగన్ ‘వాత’లు తరువాయి..?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికే సంక్షోభం పతాకస్థాయికి చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా చివరి సంవత్సరం [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికే సంక్షోభం పతాకస్థాయికి చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా చివరి సంవత్సరం [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికే సంక్షోభం పతాకస్థాయికి చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా చివరి సంవత్సరం తెలివిగా మేనేజ్ చేశారు. ఫలితంగా ఎప్ఆర్బీఎం వంటి చట్టబద్ధమైన రుణ పరిమితుల చట్రంలోకి రాకుండా తప్పించుకున్నారు. చంద్రబాబు పదవి నుంచి దిగిపోయే చివరి త్రైమాసికంలో 20 వేల కోట్ల రూపాయల వరకూ అప్పులు తెచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మరింతగా విజృంబించి రుణాలు దూసి తెస్తున్నారు. విస్తారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఏడాది గడిచేదెలా? అన్న సమస్య ఆర్థిక నిపుణులను వేధిస్తోంది. జీతాలకు కటకట ఎదురవుతుండటమే కాదు. కేంద్రం సైతం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పై నిఘా పెట్టింది. ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పిందని సాధికారికంగా అభిప్రాయానికి వచ్చింది. అందువల్ల ఆంక్షల అమలుకు సిద్దమవుతోంది. దీంతో రాష్ట్రం విలవిలలాడక తప్పని స్థితి ఎదురవుతోంది.
అటు ఇటు..అయోమయం..
కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యయం, ఖర్చులు, అప్పులు, రుణపరిమితులపై ఆరా అడిగింది. దీనిపై పూర్తి వివరాల తర్వాతనే ఎప్ ఆర్ బీఎం మినహాయింపులు ఇస్తామని పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా వ్యవహరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల లెక్కలు పూర్తిగా మదింపు కాలేదనే నెపంతో పాత లెక్కలనే సమర్పించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో 2017-18,2018-19 నాటి రెండేళ్ల వార్షిక లెక్కలు కేంద్రానికి పంపించింది. అప్పటికే రాష్ట్రం అప్పు చేసి పప్పు కూడు తరహాలో పరిధులు మించిపోయిందని కేంద్రానికి అర్థమైంది. ప్రభుత్వం పంపించిన పాత పద్దులను ప్రామాణికంగా తీసుకుంటూ 17 వేల కోట్ల రూపాయల మేరకు కొత్త రుణాలపై ఆంక్షలు పెట్టింది. అభివృద్ది పద్దులో నిధులు ఖర్చు చేయలేదనేది కేంద్రం చూపిన నిబంధన. రాజకీయంగా నష్టం జరగకుండా ఇవన్నీ చంద్రబాబు నాయుడి కాలం నాటివని చెప్పుకోవచ్చు. కానీ కొత్త పద్దులు మరింత భయంకరంగా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రం విధించిన కోత చంద్రబాబు సమయం నాటి ప్రభుత్వ వైఫల్యమే. అయితే జగన్ టైమ్ మొదలయినప్పట్నుంచీ మరింత ఆర్థిక అయోమయం నెలకొందంటున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెట్టదలచుకున్న ఆర్థిక వాతలకు ఇంకొంత సమయం పడుతుందన్నమాట.
అసలుకే ఎసరు…?
కేంద్ర ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకుకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై సర్క్యులర్ పంపినట్టు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పై రిజర్వు బ్యాంకు సైతం బిగింపులు మొదలు పెట్టింది. సెక్యూరిటీల విక్రయం ద్వారా అధిక వడ్డీతో ఏపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయల వరకూ నిధులను సమీకరించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వమూ రెవిన్యూ లోటును భర్తీ చేస్తూ 1400 కోట్లు విడుదల చేసింది. ఇందులో 2700 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంకు తొక్కిపెట్టి ఓవర్ డ్రాప్ట్ పద్దు కింద జమ చేసుకుంది. అంటే అధిక వడ్డీపై తెచ్చుకున్న అప్పు , ఇప్పటికే వాడుకున్న మొత్తానికి చెల్లిపోయింది. ఇక పై కఠినంగా వ్యవహరిస్తారనేందుకు ఇదొక సంకేతంగా ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. రోజువారీ నిర్వహణ కోసం ఓవర్ డ్రాప్ట్, వేస్ అండ్ మీన్స్, సెక్యూరిటీల విక్రయం వంటి అన్నిరకాల ఆర్థిక సదుపాయాలను ప్రభుత్వం వినియోగించుకొంటోంది. గడచిన మూడు నెలల్లో ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో తెచ్చుకుంది. మరో 4 వేల కోట్ల రూపాయలను ఆస్తులను తనఖా పెట్టి సమీకరించింది. ఇవేమీ కూడా ప్రభుత్వాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపెడేయడం లేదు. మరింతగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. ప్రతి నెలా రాష్ట్రానికి 3500 కోట్ల రూపాయలు జీతాల నిమిత్తం, 2500 కోట్ల పింఛన్లు నిమిత్తం మరో 3వేల కోట్లు గత బకాయిలకు వాయిదాలు, ప్రభుత్వ నిర్వహణకు అవసరమవుతున్నాయి. నెలసరి ఆదాయం ఆరువేల కోట్ల రూపాయలు మించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తూ సర్కారును నెట్టుకురావడం కత్తిమీద సాముగానే చెప్పాలి.
వచ్చే ఏడాది భయానకం…
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆదాయాలు పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ఒకింత కరుణ చూపిందనే చెప్పాలి. అప్పులు తెచ్చుకునే పరిమితిపై చూసీ చూడనట్లుగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ ఏటా స్థూల ఉత్పత్తిలో 3 శాతం రుణాలు సేకరించవచ్చు. ఈ మొత్తం 36 వేల కోట్ల వరకూ ఉంటుంది. దానిని ఇంకో శాతం వరకూ అనుమతించింది. అంటే 12 వేల కోట్ల అదనపు రుణానికి వెసులుబాటు చిక్కింది. అయితే ఏపీ మాత్రం వేరే రకాల పద్దుల ద్వారా ఈ పరిమితిని కూడా అధిగమించి 20 వేల కోట్ల వరకూ అదనపు అప్పులు తెచ్చుకుంది. అంటే ఏడాదిలో చేసిన అప్పుల మొత్తమే 68 వేల కోట్లకు మించిపోయింది.. కరోనా వెసులుబాటులు ఇకపై ఉండవు. కేంద్రం 36 వేల కోట్లకు మించి ఈ ఏడాది నుంచి అప్పులు తీసుకునేందుకు అనుమతించకపోవచ్చు. పైపెచ్చు ఎఫ్ ఆర్ బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్లు, ఆస్తుల తనఖా ఇతర రూపాల్లో అప్పులు తెస్తున్న విషయం పై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఆంక్షలు పెట్టేందుకు అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్తితి ఎదుర్కోబోతోందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం నిధుల విడుదలలో నియంత్రణలు , రుణ సదుపాయాలపై కోతలు పెట్టవచ్చంటున్నారు. పీకల్లోతు చిక్కుల్లో ఉన్న ఏపీ ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతోందనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం దొరకడం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్