ఓడించినా ఫలితం లేదే…?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి. కొంద‌రికి అదృష్టం కోర‌కుండా కాలికి త‌గిలితే.. మ‌రికొంద‌రి విష‌యంలో మాత్రం పూర్తిగా రివ‌ర్స్ అవుతుంది. అందివ‌చ్చిన అవ‌కాశం కూడా [more]

Update: 2019-08-01 06:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి. కొంద‌రికి అదృష్టం కోర‌కుండా కాలికి త‌గిలితే.. మ‌రికొంద‌రి విష‌యంలో మాత్రం పూర్తిగా రివ‌ర్స్ అవుతుంది. అందివ‌చ్చిన అవ‌కాశం కూడా ద‌క్కకుండా పోతుంది. ఇలాంటి నాయకుల్లో ఇప్పుడు ముందు వ‌రుస‌లో ఉన్నారు గ్రంధి శ్రీనివాస్‌. ఎలాంటి సాహ‌సానికైనా దూసుకుపోయే ల‌క్షణం ఉన్న గ్రంధి శ్రీనివాస్‌ ప్రజా బ‌లాన్ని కూడ‌గ‌ట్టడంలో త‌న‌కు తానే రుజువుగా నిల‌బ‌డ్డారు. 2004లో వైఎస్ ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గ్రంధి శ్రీనివాస్‌ అప్పటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. 2009లో అనివార్య కార‌ణాల వ‌ల్ల వైఎస్ సీటు ఇవ్వక‌పోవ‌డంతో త‌ర్వాత కాలంలో మెగాస్టార్ ప్రారంభించిన ప్రజారాజ్యంలోకి గ్రంధి శ్రీనివాస్‌ అడుగు పెట్టారు. ఆ పార్టీ ఊతంతో రాజ‌కీయంగా కీల‌క చ‌క్రం తిప్పాల‌ని భావించారు.

వైసీపీలో చేరిన తర్వాత….

అయితే, సాధ్యం కాలేదు. కొన్నాళ్లకే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో గ్రంధి శ్రీనివాస్‌ ఆ వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్రమంలోనే ఆయ‌న కొన్నాళ్లు వెయిట్ చేసి త‌ర్వాత జ‌గ‌న్ స్థాపించిన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత సన్నిహిత నాయ‌కుడిగా గ్రంధి శ్రీనివాస్‌ ఎదిగారు. జ‌గ‌న్ ఆశ‌ల‌ను ఆశ‌యాల‌ను ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గ్రంధి శ్రీనివాస్‌ కి టికెట్ ఇచ్చారు. అంతేకాదు, ప్రచారం కూడా చేశారు. అయిన‌ప్పటికీ.. చంద్రబాబు అనుభ‌వ రాజ‌కీయాలు భారీగా న‌డ‌వ‌డంతో ఆయ‌న ఓడిపోయారు. అయిన‌ప్పటికీ.. ఆయ‌న పార్టీని నాయ‌కుడిని వ‌దిలి పెట్టకుండా ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా.. పార్టీలోనే కొన‌సాగారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా ఆయ‌నకు తోడుగా కొంత దూరం న‌డిచి గ్రంధి శ్రీనివాస్‌ త‌న భ‌క్తిని చాటుకున్నారు.

పవన్ ను ఓడించి….

ఈ క్రమంలోనే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం టికెట్‌ను కేటాయించారు జ‌గ‌న్‌. వాస్తవానికి ఇక్కడ నుంచి జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ పోటీకి దిగ‌డంతో ఏక‌ప‌క్షంగా ఆయ‌న గెలుస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అంతేకాదు, ప‌వ‌న్‌పై ఎవ‌రు పోటీ చేసినా.. డిపాజిట్లుకూడా ద‌క్కించుకోవ‌డం గ్రంధి శ్రీనివాస్‌ కు క‌ష్టమ‌ని అనుకున్నారు. ఇక‌, మ‌రోప‌క్క, టీడీపీ నుంచి పుల‌ప‌ర్తి అంజిబాబు రంగంలోకి దిగ‌డంతో పోటీ మ‌రింత తీవ్రంగా మారింది. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ పాద‌యాత్ర, న‌వ‌ర‌త్నాలు త‌న‌ను ఖ‌చ్చితంగా గెలిపిస్తాయ‌ని న‌మ్మిన గ్రంధి శ్రీనివాస్‌ చివ‌రి వ‌ర‌కు అదే ధీమాను వ్యక్తం చేస్తూ.. ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు. ఆయ‌న ధైర్యమే ఆయ‌న‌కు విజ‌యాన్ని అందించింది. కాక‌లు తీరిన పుల‌వ‌ర్తి అంజిబాబుతోపాటు సినీ గ్లామ‌ర్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ను సైతం గ్రంధి శ్రీనివాస్‌ ఓడించారు.

రెండేళ్ల తర్వాతైనా…?

మ‌రి ఇంత భారీ విజ‌యం న‌మోదు చేసిన గ్రంధి శ్రీనివాస్‌కు జ‌గ‌న్ మంచి గుర్తింపు ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా కేబినెట్‌లో సీటు ద‌క్కడం ఖాయ‌మ‌ని లెక్కలు వేసుకున్నారు. రెండు సార్లు గెలుపుతోపాటు కీల‌క‌మైన ప‌వ‌న్‌ను ఓడించ‌డం ఆయ‌న‌కు భారీ ప్లస్‌గా మారుతుంద‌ని అనుకున్నారు. అయితే, గ్రంధి శ్రీనివాస్‌కు జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో సీటు ఇవ్వక‌పోగా.. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన మెట్ట ప్రాంతానికి చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. నానికి ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వడంతో డెల్టా ప్రాంతానికి చెందిన కాపులు నివ్వెర పోయారు. మంత్రి వ‌ర్గ కూర్పు స‌మ‌యంలో జ‌గ‌న్ చెప్పిన‌ట్టు.. మ‌రో రెండున్నరేళ్ల త‌ర్వాతైనా.. ఈ జ‌ెయింట్ కిల్లర్‌కు అవ‌కాశం వ‌స్తుందా? అనేది ప్రశ్నగా మారింది. ఆయ‌న వ‌ర్గం మాత్రం వ‌స్తుంద‌నే ఆశాభావంతోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News