సెల్ ఉందా…? అయితే జాగ్రత్త..!!

కొంతకాలం వాడని నెంబర్లతోనూ అనర్థాలు కలుగుతున్నాయి. సెల్ కనెక్షన్ కంపెనీలు ఓ నెంబర్ వాడుకతో లేకపోతే కొంతకాలం వేచిచూసి ఆ నెంబర్ ను మరొకరికి కేటాయిస్తుంది. దీనివల్ల [more]

Update: 2019-09-15 18:29 GMT

కొంతకాలం వాడని నెంబర్లతోనూ అనర్థాలు కలుగుతున్నాయి. సెల్ కనెక్షన్ కంపెనీలు ఓ నెంబర్ వాడుకతో లేకపోతే కొంతకాలం వేచిచూసి ఆ నెంబర్ ను మరొకరికి కేటాయిస్తుంది. దీనివల్ల కొత్తగా ఆ నెంబర్ తీసుకున్న వారికి ముప్పు తప్పదు. పాతవారి తాలుకు వివరాలు అడుగుతూ రాత్రి, పగలు అన్న తేడా లేక ఇబ్బందుల పాలుజేస్తున్నారు. ఊదాహరణకు చెప్పాలంటే డాక్టర్ రాజశేఖర్ గుంటూరులో ఓ ఆసుపత్రిని నడుపుతున్నారు. ఆయన ఇటీవల మెడికల్ కౌన్సెలింగ్ సమావేశానికి హైదరాబాద్ వచ్చి సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దీంతో ఆయన ఆ నెంబర్ వదిలేసి మరో నెంబర్ తీసుకున్నారు. కొంతకాలం రాజశేఖర్ పాతనెంబర్ పనిచేయలేదు. ఆ తర్వాత ఆ నెంబర్ ను సెల్ కంపెనీ వేరే వారికి కేటాయించింది. కొత్త నెంబర్ తీసుకున్న వ్యక్తి ఇబ్బందులు అంతా ఇంతాకాదు. రాజశేఖర్ డాక్టర్ కావడం, అప్పటికే ఆయన నెంబరు అనేక మందిరోగులకు ఇవ్వడంతో రాత్రి, పగలనే తేడా లేకుండా రోగులు ఆ నెంబర్ కు ఫోన్ చేసేవారు. కొత్తగా నెంబర్ తీసుకున్న వ్యక్తి మాత్రం ఆ నెంబర్ రాంగ్ నెంబరని, రాజశేఖర్ అనే అతను ఎవరో తనకు తెలియదని చెప్పినా ఆ నెంబర్ల రాకమాత్రం ఆగలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది రాజశేఖర్ తప్పుకాదు… కొత్తగా నెంబర్ తీసుకున్న వారిది అసలే తప్పుకాదు. ఇక రోగులను ఇక్కడ తప్పుపట్టే పరిస్థితి లేదు. ఒక నెంబర్ మూడు చోట్లా ఎవరికీ తెలియకుండానే గిర్రున తిరిగింది.

వేధిస్తున్న పాతనెంబర్లు

ఎవరైనా 45 రోజులకంటే ఎక్కువగా నెంబర్ వాడకపోతే ఆ నెంబర్ వినియోగదారుడి అనుమతి లేకుండానే కంపెనీలు కొత్తవ్యక్తులకు కేటాయిస్తుంటాయి. ఈ పరిణామాలే కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. కొత్తగా నెంబర్ పొందిన వినియోగదారునికి తెలియకుండానే కొత్త కొత్త నెంబర్ల నుంచి తరచూ ఫోన్లు రావడం ఇబ్బందికర పరిణామాలకు మూలమవుతోంది. అవతలి నుంచి వినిపించే తియ్యని పలకరింపులు సంసారాల్లో చిచ్చుకు కారణమవుతున్నాయి. నానాటికీ కొత్త పుంతలు తొక్కే ఆధునికతకు మారుపేరుగా నిలుస్తున్న పట్టణాల్లో ఇవి అనేకం చోటుచేసుకోవడం విస్తుగొలుపుతోంది. సెల్‌ఫోన్‌ల ఆగమనంతో మనిషి జీవనంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటువంటి నెంబర్ల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి.

కాపురాల్లో చిచ్చుపెడుతున్న రాంగ్ కాల్

ఇళ్లు లేని వారు కోకొల్లలుగా ఉండొచ్చేమోగానీ సెల్ ఫోన్ లేని వారు లేరనేది నిర్వివాదాంశం. ఒక్కొక్కరు రెండు మూడు కనెక్షన్లను వినియోగిస్తున్నారనేది మరో తరహా ఆసక్తిని గొలిపే అంశం. ఇక సెల్‌ఫోన్లలోనే ఇంటర్‌నెట్ ఆగమనంతో మానవ జీవితాలు సెల్‌కు అడిక్ట్ అవుతున్నాయి. ప్రతి చేతిలో కనిపిస్తున్న ఈ సెల్‌ఫోన్లే ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. ఒక్క అంకె మారడంతోనో లేక అనవసర కాలో తగిలి చాలా జంటలు కలిసినట్లుగా, విడిపోయినట్లుగా చెప్పుకోవడం ఇటీవల ఫ్యాషనైపోయింది. అయితే అపరిచిత నెంబర్లకు అంతగా రెస్పాండ్ అవకుండా ఉంటేనే మంచిదని పోలీసులు చెబుతున్నారు. పొరపాటుగా సెల్‌కు వచ్చిన రాంగ్ నెంబర్ ఎవరిదో ఆరా తీసే ధోరణి సరైంది కాదని చెబుతున్నారు. రాంగ్ కాల్స్, మెసేజ్‌లకు తీవ్రంగా స్పందించకుండా ఉంటే ఈ ముప్పు రాకపోవచ్చనేది చెప్పుకోవాల్సిన అంశం. కానీ ఈ కాలంలో అక్షరాన్ని అందిపుచ్చుకున్న యువతతో పాటు నిరక్షరాస్యులు సైతం ఈ జాఢ్యానికి బలవుతున్నారు. సో.. సెల్ వినియోగదారులూ తస్మాత్
జాగ్రత్త..!!

ఊరుకోవద్దు….

అపరిచిత నెంబర్ల నుంచి తరచూ ఫోన్లు రావడం, అసభ్యకరంగా మాట్లాడటం వంటి సందర్భాలు తారసపడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రధానంగా మహిళలు తమ సెల్‌కు వచ్చే అపరిచిత నెంబర్ల పట్ల వెంటనే స్పందించి భర్తకు సమాచారం ఇవ్వడం ముఖ్యం. అప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుమానాలకూ తావుండదు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం చేరవేయడం ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే వీలు కలుగుతుంది. ఇలాంటి ఉదంతాలపై పోలీసు వ్యవస్థ కూడా కఠినంగానే వ్యవహరిస్తుందనే విషయాన్ని గుర్తించాలి. ఇలా చేయకుండా మగవారు భార్య సెల్‌కు వచ్చిన నెంబర్ ఎవరిదోనని అనుమానం పెంచుకోవడం ఎంతమాత్రం తగదు. అలాంటి అనుమానాలే అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి. ఇక అదుపుతప్పుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సి ఉంది. పిల్లలు ఎప్పుడూ సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయే పరిస్థితిని నివారించగలిగితే అసాంఘిక కార్యకలాపాలకు కాలుదువ్వకుండా ఉంటారు.

 

Tags:    

Similar News