నలభై రోజుల శ్రమ.. నాలుగు రోజుల్లో హుష్ కాకి

శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవడం అంటే ఇదే. గడచిన 40 రోజులుగా మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. కనిపించని మహమ్మారిపై యుద్ధం పేరిట ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. [more]

Update: 2020-05-05 15:30 GMT

శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవడం అంటే ఇదే. గడచిన 40 రోజులుగా మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. కనిపించని మహమ్మారిపై యుద్ధం పేరిట ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరాలను సైతం కుదించుకున్నారు. ఆరోగ్యసమస్యలను వాయిదా వేసుకున్నారు. దేశ స్థూల ఉత్పత్తిలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టపోయినట్లు అంచనాలున్నాయి. సాంకేతిక గణాంకాలు పక్కనపెట్టినా కోట్లమంది ఉపాధి కోల్పోయారు. ఉసూరుమంటున్నారు. ప్రభుత్వాలకు ఇవేమీ పట్టనట్లు రెండు విషయాల్లో తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డాయి. ప్రధాన దోషిగా కేంద్రం నిలుస్తుంటే సహభాగస్వాములుగా రాష్ట్రాలూ పాలు పంచుకుంటున్నాయి. పైసల కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడానికి సైతం తాము తెగిస్తామని సర్కారులు చాటిచెప్పుకుంటున్నట్లున్నాయి. లాక్ డౌన్ విషయంలో తీవ్రంగా ప్రభావితమైన వర్గం వలస కూలీలు వారి విషయంలో ఇన్నిరోజులు ప్రభుత్వాలు దారుణంగా ప్రవర్తించాయి. కనీసం వారికుండే ప్రాథమిక హక్కులను కాలరాచాయి. సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వ నిర్బంధం వర్సస్ ప్రాథమిక హక్కులు అన్న అంశంలో ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడింది. చివరికి వారిని తరలించేందుకు అంగీకరించి కూడా అమలులో కేంద్రం సంకుచిత బుద్ధిని చాటుకుంది. ఇంకోవైపు మద్యానికి లాకులెత్తేసింది. భౌతిక దూరం అంటూ పెట్టుకున్న నిబంధన గాలికి కొట్టుకుపోయింది. ఎక్కడికక్కడ క్యూలు ప్రత్యక్షమయ్యాయి. మందుబాబులు మోసుకెళ్లే కరోనా వైరస్ ఎంతటి ప్రమాదం సృష్టిస్తుందో ఎవరికీ తెలియదు. కోట్లాది ప్రజలు చేసిన త్యాగం బుగ్గిపాలవుతుందేమోననే భయాందోళనలు నెలకొంటున్నాయి. సినిమా, షాపింగ్, దేవాలయాలు, విద్యాసంస్థల వంటివాటిని మూసి ఉంచిన ప్రభుత్వం అర్జెంటుగా మద్యానికి మాత్రం పర్మిషన్ ఇవ్వాలని ఎందుకనుకుందో ఎవరికీ అర్థం కాదు.

ఇంతకష్టంలో ఛార్జీలా..?

వలస కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేసి నలభై రోజులపాటు దారుణ నిర్బంధంలో ఉంచారు. అయితే కరోనా వ్యాపించకుండా ఉండాలంటే తప్పదని ప్రభుత్వాలు వివరణ ఇచ్చాయి. ఇక సుప్రీం జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు దశలు ముగిసిన తర్వాత మాత్రమే తరలింపునకు అవకాశం ఇచ్చారు. లాక్ డౌన్ తొలినాళ్లలోనే తగు జాగ్రత్తలతో రైళ్ల ద్వారా వారిని తరలించి వారి గ్రామాల్లోనే క్వారంటైన్ సదుపాయం కల్పించి ఉంటే బాగుండేది. కానీ వారి హక్కులను హరించి మానసికంగా, భౌతికంగా హింసించి సాధించిందేమిటో తెలియదు. మరో తీవ్రమైన దారుణం వారిని సొంత గ్రామాలకు పంపే రైళ్లకు ఛార్జీలు వసూలు చేస్తామంటూ రైల్వేశాఖ ముందుగా ప్రకటించింది. ఛార్జీలను వలస కార్మికుల నుంచి రాష్ట్రప్రభుత్వాలే వసూలు చేసి రైల్వేకు చెల్లించాలని నిర్దేశించారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా స్థానిక ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు ఇచ్చిన ఆహారంతో గడుపుకుంటూ వచ్చిన వలసకార్మికులు ఛార్జీలు చెల్లించాలనడం దారుణం. దీనిపై తీవ్రమైన విమర్శలు చెలరేగిన తర్వాత కేంద్రం వివరణ ఇచ్చింది. 85శాతం కేంద్రం రాయితీ ఇస్తుంది. మరో 15 శాతం రాష్ట్రాలు భరించాలంటూ చెప్పింది. అసలు వలస కార్మికుల తరలింపు అనేది పెద్ద ఆర్థిక భారం కాదు. ఎంపిక చేసి తరలించే వలస జీవులకు తరలింపు సందర్భంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత ఆర్థిక సాయం అందించి పంపించాలి. ఎందుకంటే వారంతా ఊళ్లకు వెళ్లి సాధారణ జీవితం గడపాలంటే కొన్ని రోజులపాటు ఆసరా అవసరం. అదంతా వదిలేసి ప్రయాణానికి కనీస ఛార్జీలు వసూలు చేస్తామనడం దారుణం.

కాంగ్రెసు కస్సుబుస్సు…

లాక్ డౌన్ లో ప్రభుత్వ చర్యలపై కాంగ్రెసు పార్టీ నిశిత నిఘా వేస్తోంది. ఈ అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెసు చాలా సమర్థంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. ఆర్థిక ప్యాకేజీ , వలస కూలీల విషయంలో కాంగ్రెసు తీవ్రమైన ప్రశ్నలనే లేవనెత్తింది. ఆ పార్టీ కృషి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందనే చెప్పాలి. తాజాగా వలస కార్మికుల నుంచి రైల్వే ఛార్జీలు వసూలు చేయడంపై తీవ్రంగా ఆక్షేపణ తెలిపింది. అవసరమైతే కాంగ్రెసు పార్టీ ఆ చార్జీలను భరిస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హెచ్చరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సెగ పుట్టింది. తాము చేసిన తప్పు తెలిసి వచ్చింది. దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఆలోచన రహితంగా వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలనే ఆలోచనే తప్పు. అడుసు తొక్కి కాలు కడుక్కున్నట్లుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం భారత్ లో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్న దుస్థితి. ఈ సమయంలో ప్రతిపక్షం యాక్టివ్ గా ఉంటేనే దేశానికి మేలు. ఎందుకంటే ప్రభుత్వ దృక్పథం వేరు. ప్రజా కోణం నుంచి ప్రతిపక్షం ఆలోచన చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఒక పార్టీగా కాంగ్రెసుకు ఇదొక మంచి అవకాశం. సద్వినియోగం చేసుకుంటే ప్రజలకు, దేశానికి సైతం మంచి జరుగుతుంది.

మద్యం మరో తప్పు…

ఆంధ్రప్రదేశ్ లో మద్యాన్ని అనుమతించడం తీవ్రమైన తప్పిదంగా నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కట్టడికి ప్రధానమైన భౌతిక దూరాన్ని మద్య విక్రయాలు దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా రోగం వ్యాపించేందుకు ఇది దోహదం చేస్తుందంటున్నారు. తాగుడు కు అలవాటు పడిన వారు జనాభాలో 20శాతం వరకూ ఉంటారని అంచనా. వారి కోసం మిగిలిన 80శాతం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యసనపరులలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల ఈ సమయంలో మద్యాన్ని ప్రోత్సహించడం ప్రతికూల ఫలితాన్నిస్తుంది. అంతేకాకుండా లాక్ డౌన్ తో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోయాయి. మధ్యతరగతి, పేద వర్గాల వ్యసన పరులు మళ్లీ తాగుడుకు తమ ఆదాయాన్ని వెచ్చిస్తే పేదరికంలోకి దిగజారిపోతారు. కుటుంబాలకు నిత్యావసరాలకు ఖర్చు చేయాల్సిన సొమ్మును సైతం మద్యానికి వెచ్చించే అవకాశం ఉంది. ఇందువల్ల కుటుంబాల్లో సైతం గొడవలు జరుగుతాయి. ఈ సమయంలో సామాజిక అశాంతికి, కుటుంబ సంఘర్షణకు, పేదరికానికి మద్యం విక్రయాలు దారి తీసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వాలు అందచేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాలు సైతం మద్యం రూటు పట్టేందుకు ఆస్కారముంది. కరోనా కట్టడి, ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరికొంతకాలం మద్య నిషేధం అమలు చేయాల్సి ఉంది. లేకపోతే గంపలాభం చిల్లు తీసినట్లు నలభైరోజుల లాక్ డౌన్ నాలుగు రోజుల్లో హుష్ కాకి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News