టెంట్లను తొలగించనది అందుకేనా?

అమరావతి రాజధాని రైతులు ఆందోళనకు దిగి దాదాపు 450 రోజులకు పైగానే అవుతుంది. తొలినాళ్లలో వారికి వచ్చిన మద్దతు ఇప్పుడు లభించడం లేదు. చిన్న గీత వద్ద [more]

Update: 2021-04-30 11:00 GMT

అమరావతి రాజధాని రైతులు ఆందోళనకు దిగి దాదాపు 450 రోజులకు పైగానే అవుతుంది. తొలినాళ్లలో వారికి వచ్చిన మద్దతు ఇప్పుడు లభించడం లేదు. చిన్న గీత వద్ద పెద్దగీత పెడితే ఎలా అవుతుందో ఇప్పుడు రాజధాని అమరావతి రైతుల సమస్య కూడా అలా తయారైంది. వారి గోడు విన్పించుకునే వారు లేరు. ప్రభుత్వం తొలి నుంచి అదే పంథాలో వెళుతుంది. ఇక ఇప్పుడు విపక్షాలు కూడా రాజధాని సమస్యను వదిలేసినట్లే కన్పిస్తున్నాయి.

ఒంటరిగా మారినా….

ఇప్పుడు అమరావతి రైతులు ఒంటరి వారయ్యారు. రాజధాని సమస్య కంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ప్రధానమైంది. ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కావడంతో రాజకీయ పార్టీలు సయితం దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. అధికార పక్షానికి మైలేజీ రాకుండా విపక్షాలన్నీ విశాఖ బాట పట్టాయి. అమరావతిని వదిలేశాయి. తొలినుంచి అమరావతి రైతులకకు వెన్నుదన్నుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పడు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ప్రజా మద్దతు….

మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాజధాని రైతులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కనీసం విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని భావించారు. కానీ ఆ ప్రాంత ప్రజలు ఊహించని విధంగా వైసీపీకే పట్టం కట్టారు. రాజధాని సెంటిమెంట్ కు తమకు లేదని నిరూపించారు. ఇప్పటి వరకూ ఐదుకోట్ల ప్రజల అమరావతి అంటూ చెప్పుకొచ్చిన రైతులను స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా 29 గ్రామాలకే పరిమితం చేసింది.

న్యాయస్థానంలోనే…?

అమరావతి రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గేట్లు ఏమాత్రం కన్పించడం లేదు. తాను అనుకున్నది చేసేటట్లే కన్పిస్తున్నారు. మొన్నటి వరకూ మద్దతిచ్చిన మీడియా కూడా అమరావతి రైతులను వదిలేసిందనే చెప్పాలి. వరస ఎన్నికలు రావడంతో రాజధాని రైతులను మీడియా కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఒంటరి వారయ్యారు. ఇక వారు న్యాయస్థానంపైనే ఆశలు పెట్టుకున్నారు. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రాజధాని రైతులు భావిస్తున్నారు. అందుకే ఇంకా టెంట్లను తొలగించలేదు.

Tags:    

Similar News