చేతులు కాలిన తర్వాత…?

ఎటువంటి నిర్ణయాన్ని అయినా ఏకపక్షంగా అమలు చేసుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి తొలిసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. వ్యవసాయ చట్టాలపై వెనకడుగు వేయకతప్పని అనివార్య పరిస్థితి తలెత్తుతోంది. ఒకవైపు [more]

Update: 2020-12-20 16:30 GMT

ఎటువంటి నిర్ణయాన్ని అయినా ఏకపక్షంగా అమలు చేసుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి తొలిసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. వ్యవసాయ చట్టాలపై వెనకడుగు వేయకతప్పని అనివార్య పరిస్థితి తలెత్తుతోంది. ఒకవైపు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ ఏర్పడబోతోంది. అన్నదాతల ఆందోళన కేంద్ర సర్కారు మెడలు వంచేంతటి తీవ్రతను సంతరించుకుంటోంది. చేతులెత్తి మొక్కుతున్నా చర్చలకు రండి అంటూ ప్రధాని పిలుపునివ్వడంలోనే బీజేపీ నిస్సహాయత తేటతెల్లమవుతోంది. గతంలో ఎంతటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మొండిగా ముందుకు వెళ్లింది నరేంద్రమోడీ సర్కారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. ప్రతిపక్షాల అనైక్యత, బలహీనత కేంద్రానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత సంఘటితం కాలేదు. కానీ తాజాగా వ్యవసాయ చట్టాల పట్ల ప్రతికూలత రోజురోజుకీ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. కొన్ని ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పలేకపోవడంతో చట్టాల్లోని డొల్లతనం అర్థమవుతోంది. నిజంగానే కేంద్ర సర్కారు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాకులాడుతుందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వ్యవసాయ చట్టాల్లో రైతు ప్రయోజనాలు సైతం ముడిపడి ఉన్నాయి. కానీ పరిస్థితులు వికటించినప్పుడు రైతు పూర్తిగా మునిగిపోయే ప్రమాదమూ ఉంది. రైతుకు రక్షణ కల్పిస్తూ అదే సమయంలో ఉత్పత్తుల విక్రయాలకు స్వేచ్ఛ కలిపించి ఉంటే ఇంతటి వ్యతిరేకత వ్యక్తమయ్యేది కాదు. మార్కెట్ శక్తుల ఇష్టా రాజ్యానికి వ్యవసాయరంగం బలైపోతుందనే అనుమానమే ప్రస్తుత ఉద్యమానికి కారణమవుతోంది.

జగమొండి సర్కారు….

నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్ణయాలను మొండిగా అమలు చేస్తున్నారు. సామదానభేద దండోపాయాలతో విపక్షాలను దారికి తెచ్చుకుంటున్నారు. మంచిచెడులు , పర్యవసానాల గురించి పట్టించుకోకుండా గుడ్డిగా ముందుకు వెళుతున్నారు. కొన్ని సందర్భాల్లో అది కేంద్రానికి లాభించిన మాట వాస్తవం. రాజకీయంగా లాభసాటిగా ఫలితాలను అందించింది. నోట్ల రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అమలు, విద్యుత్ సంస్కరణలు, పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు, దేశవ్యాప్త లాక్ డౌన్ వంటి నిర్ణయాలన్నీ విపక్షాలతో సంబంధం లేకుండా అమలైపోయాయి. ప్రజలు తమపై భారం పడినా కేంద్రం నిర్ణయంలోని సదుద్దేశాన్నే పరిగణనలోకి తీసుకున్నారు. పంటి బిగువన కష్టనష్టాలను భరించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేద్దామని చూసినా ప్రజల నుంచి మద్దతు లభించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి అదనపు బలంగా పరిణమించింది. తామేం చేసినా ప్రజలు సహకరిస్తారనే గుడ్డి నమ్మకానికి కేంద్రం వచ్చేసింది. వ్యవసాయ చట్టాలు ఆ విధంగా రూపుదిద్దుకున్నవే. దేశంలోని అధిక రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. లోక్ సభలో స్పష్టమైన మెజార్టీ ఉంది. రాజ్యసభలోనూ ఓటింగ్ లేకుండా చాణక్యం ప్రదర్శించారు. దాంతో ఇక చట్టాల అమలుకు పూనిక వహించారు. కానీ ప్రత్యక్షంగా బాధితులైన రైతులే రోడ్డెక్కి అవరోధాలను అధిగమించి ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాయి. రాష్ట్రాలన్నీ క్రమేపీ కదులుతున్నాయి. ఈ వాతావరణాన్ని కేంద్రం ఊహించలేదు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి దడ పుట్టిస్తున్న అంశమిదే.

అప్రజాస్వామికం…

20 సంవత్సరాలుగా ఈ చట్టాలపై ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయంటూ కేంద్రం చెబుతోంది. తాము ఆ నిర్ణయాన్ని అమలు చేశామంటోంది. అన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్నాయంటే ఎంతటి క్లిష్టత దాగి ఉందో అర్థమవుతుంది. పైపెచ్చు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఈ చట్టాల రూపకల్పనపై చర్చించాయంటున్నారు. అదే నిజమైతే వాటన్నిటిని కలుపుకుని పోవడానికి ముందస్తుగా చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అన్నిపార్టీలు ఈ చట్టాలు అవసరమని భావించి ఉంటే ప్రభుత్వం వాటిని ఒకే వేదికపైకి తెచ్చి ముందస్తు అనుమతి పొంది ఉండవచ్చు కదా. అదే విధంగా బీజేపీకి అనుబంధంగా ఉండే బారతీయ కిసాన్ సంఘ్ వంటివి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది. సైద్ధాంతికంగా తమ పార్టీలోని విభాగం అనుమతిని కూడా కేంద్రం తీసుకోలేదని తేటతెల్లమైపోతోంది. మిత్రపక్షాలతోనూ చర్చించడం కనీస రాజకీయ ధర్మం. అకాలీదళ్ వంటివి దూరమయ్యాయంటే మిత్రుల నుంచి సైతం బీజేపీ మద్తతు కూడగట్టలేకపోయినట్లు అర్థమవుతుంది. అలాగే ఈ చట్టాల ప్రత్యక్ష ఫలితాన్ని అనుభవించే రైతు సంఘాలు, నేతలతో విస్త్రుత చర్చలు ముందుగా జరిపి ఉంటే ఇంతటి వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. మార్పులు, చేర్పులు ముందుగానే చట్టంలో చేర్చేందుకు వీలుండేది. ఆ అవకాశాన్ని కేంద్రం చేజేతులా పోగొట్టుకుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగం ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రాలతో చర్చించి చట్టాలు చేసి ఉంటే బాగుండేది. కానీ తమ పరిధిలోకి కూడా వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కనీస గౌరవం ఇవ్వలేదు.ఇవన్నీ ప్రజాస్వామ్య సూర్తికి, రాజ్యాంగ బద్ధతకు కూడా విరుద్ధంగా ఉన్నాయి.

సుప్రీం శరణ్యం…

అనేక సందర్భాల్లో కేంద్రం చిక్కుల్లో పడినప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటోంది. కేంద్రం స్వయంగా తన పరువు పోగొట్టుకోకుండా సుప్రీం సూచనలు, తీర్పుల నెపంతో బయటపడుతోంది. రాజకీయంగా డ్యామేజీ లేకుండా గట్టెక్కుతోంది. తాజాగా వ్యవసాయ చట్టాల విషయంలోనూ సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. అటు కేంద్ర ప్రభుత్వ పరువు పోకుండా రైతుల ఆందోళన ఉద్ధృతం కాకుండా సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరం. చట్టాల రాజ్యాంగ బద్ధతను సమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉన్నమాట వాస్తవం. అయితే రైతులకు, కేంద్రానికి మధ్య మధ్యవర్తి పాత్ర పోషించాల్సిన అవసరం సుప్రీం కోర్టుకు లేదు. ఉమ్మడి జాబితాలో ఉండటము, రాజ్యాంగపరమైనరక్షణలు దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ఈ వివాదానికి ముగింపు పలుకుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది కేంద్రం. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక తంటాలు పడుతోంది. సుప్రీం కోర్టు మార్గనిర్దేశం చేస్తే తెలివిగా గట్టెక్కవచ్చని చూస్తోంది. దూకుడుగా చట్టాలు చేసిన ఎన్డీఏ అమలు విషయంలో ఎదురవుతున్న ప్రతిబంధకాలను ముందుగా ఊహించకపోవడం అవివేకం. ఇప్పుడు కేంద్రాన్ని గట్టెక్కించే బాధ్యతను సుప్రీం కోర్టు తీసుకుంటుందా, లేక తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతకే పరిమితమై రైతులు, కేంద్రమే తేల్చుకోవాలని చేతులెత్తేస్తుందా. అన్నది ఆసక్తిదాయకం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News