వైసిపికి ఆయనే ఆక్సిజన్ …. వైఎస్ జయంతి సందర్భంగా …

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఆయనదో ప్రత్యేక స్థానం. స్వయం కృషితో జవసత్వాలు సడలిన పార్టీని రెండుసార్లు అధికారంలోకి తేవడమే కాదు యుపిఎ ని రెండుసార్లు నిలబెట్టేందుకు అవసరమైన [more]

Update: 2019-07-08 06:22 GMT

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఆయనదో ప్రత్యేక స్థానం. స్వయం కృషితో జవసత్వాలు సడలిన పార్టీని రెండుసార్లు అధికారంలోకి తేవడమే కాదు యుపిఎ ని రెండుసార్లు నిలబెట్టేందుకు అవసరమైన ఎంపిలను అందించారు ఆయన. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు సాగించిన పాదయాత్రే శిఖరసమాన కీర్తిని ఆయనకు తెచ్చిపెట్టడమే కాదు ఏపీలో అధికారంలోకి రావాలనుకునేవారికి ఒక మార్గమే అయ్యింది. ఆయనే డాక్టర్ ఎదుగురిసందింటి రాజశేఖర రెడ్డి. పేదల గుండె చప్పుడు గా వైఎస్ సాగించిన ప్రస్థానమే నేటి ఆయన తనయుడు వైఎస్ జగన్ సారధ్యంలో నడుస్తున్న వైఎస్సాఆర్ పార్టీకి ఆక్సిజన్.

నాయకుడిగా చెరగని ముద్ర ….

వైఎస్ తన పాలనలో తెచ్చిన సంక్షేమ పథకాలతో చెరగని ముద్రని సామాన్యుల్లో వేశారు. దాంతో ఆయన మరణం తరువాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ గా మారిపోయారు. తనపేరుతో ఏర్పడిన కుమారుడి పార్టీకి వైఎస్సాఆర్ అనే పేరే బలం అయింది అంటే రాజశేఖర రెడ్డి ఇమేజ్ ఏ స్థాయిలో ఉందొ చెప్పక చెబుతుంది. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన వైఎస్ ముఖ్యమంత్రి స్థానం చేరుకునే వరకు అలుపెరగని ప్రయాణమే చేశారు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. సొంతపార్టీలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు మరేనేత కు ఎదురుకాలేదనే చెప్పాలి. సినిమాల ద్వారా ప్రజల్లో స్టార్ గా ఆ తరువాత ఆ ఇమేజ్ తో పార్టీ స్థాపించి పేదల పెన్నిధిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మారిపోయారు. అయితే ఎలాంటి స్టార్ ఇమేజ్ లేకుండా జనం నుంచి నాయకుడిగా ఎదిగి పదవిలో ఉండగానే అర్ధంతరంగా మృత్యువు కబళించడంతో దేవుడిగా పేదవారి దేవుడు గా అవతరించేశారు వైఎస్.

తనదైన మార్క్ పాలిటిక్స్ …

తనవాడు అని వైఎస్ ఒకసారి నిర్ధారించుకుంటే వారు చిక్కుల్లో ఉంటే ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యేవారు వైఎస్. ఇక రాజకీయాల తొలినుంచి ఒక ప్రత్యేక టీం ను మిత్రులతో మొదలు పెట్టిన వైఎస్ కు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో సొంత బలగాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. ఒక జాతీయ పార్టీలో వుంటూ పార్టీ అధిష్టానం ఆదేశాలు అమలు చేస్తూనే వ్యక్తిగత ఇమేజ్ ను సమాంతరంగా ఏర్పాటుచేసుకున్నారు వైఎస్. పదేళ్ళు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్ చేయని పోరాటం లేదు. నిత్యం ప్రజల్లో వుంటూ టిడిపిపై అలుపెరగని సమరమే చేశారాయన. ప్రజలతో మమేకం మరింతగా అవ్వాలంటే పాదయాత్రే శరణ్యమని భావించి చేవెళ్లనుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ సాగించిన కాలినడకన జనంతో కలిసిపోయారు. ఇలా ఆయన చేసినపాదయాత్రే తరువాత కాలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి చేశారంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి దశ దిశా ఎలాంటివో చెప్పాలిసిన పనిలేదు.

విశ్వసనీయతకు మారుపేరు …

ప్రజల ముందు మాట ఇస్తే ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ మాటను నిలబెట్టుకోవడానికి వైఎస్ సిద్ధం అయ్యేవారు. అందుకే ఆయన విశ్వసనీయతకు మారు పేరుగా రాజకీయాల్లో నిలిచారు. రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలా ఒకటేమిటి పేదలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ఎన్నికల ప్రచారంలో ప్రకటించి ఖచ్చితంగా అమలు చేసిన ముఖ్యమంత్రి గా వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. నేడు వైఎస్ జయంతి సందర్భంగా తెలుగు పోస్ట్ మాట తప్పని ధీరుడికి నివాళి అర్పిస్తోంది.

Tags:    

Similar News