అరె… వైఎస్ ఇప్పుడు అంద‌రి దేవుడైపోయాడే

“వైస్ దుష్టుడు.. దుర్మార్గుడు.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను రాష్ట్ర స్తాయికి దిగ‌జార్చేశాడు.“ అన్న కాంగ్రెస్ నేత‌ల‌కు ఇప్పుడు వైఎస్ దేవుడు. “వైఎస్ పాల‌నంతా.. అవినీతిమ‌యం. ఆయ‌న [more]

Update: 2020-09-29 13:30 GMT

“వైస్ దుష్టుడు.. దుర్మార్గుడు.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను రాష్ట్ర స్తాయికి దిగ‌జార్చేశాడు.“ అన్న కాంగ్రెస్ నేత‌ల‌కు ఇప్పుడు వైఎస్ దేవుడు. “వైఎస్ పాల‌నంతా.. అవినీతిమ‌యం. ఆయ‌న మ‌హానేత కాదు.. మ‌హామేత‌.. ఆయ‌న అధికారంలో ఉన్నప్పుడు.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి వారిని కూడా త‌న‌వైపు తిప్పుకొని వారితో కూడా అవినీతి చేయించి.. జైళ్లకు వెళ్లేలా చేశారు“ అని తిట్టు శాప‌నార్థాలు కుమ్మరించిన ఓ వ‌ర్గం మీడియాకు కూడా ఇప్పుడు వైఎస్ అంటే దేవుడే! “వైఎస్ ఈజ్ బెస్ట్‌“ అంటూ.. ఇప్పుడు రాస్తున్న క‌థ‌నాల్లో ఆయ‌న పాల‌న‌ను ఉటంకిస్తున్నారు.

చంద్రబాబు సయితం….

ఇక‌, ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత చంద్రబాబు కూడా అనేక సంద‌ర్భాల్లో వైఎస్‌ను కొనియాడారు. “ప్రతిప‌క్ష నేత‌ల‌కు వైఎస్ ఎంతో విలువ ఇచ్చేవారు. రాజ‌కీయంగా ఆయ‌న కొన్నివిలువ‌లు పాటించారు“ అని చంద్రబాబే అనేక సంద‌ర్భాల్లో పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు ఏపీ సీఎం అయిన‌ప్పటి నుంచి వైఎస్‌ను, జ‌గ‌న్‌ను కంపేరిజ‌న్ చేస్తూ వైఎస్‌ను ఆయ‌న కీర్తిస్తున్నారు. టీడీపీ నేత‌ల‌దీ అదే దారి. కానీ, వైఎస్ జీవించి ఉండ‌గా.. ఆయ‌న‌ను తొక్కేసేందుకు బాబు ఎంత ప్రయ‌త్నించారో.. అంద‌రికీ తెలిసిందే. ఇక‌, బాబు అనుకూల మీడియా కూడా వైఎస్‌పై నిత్యం ఎన్నో విషాల‌ను క‌క్కేది.

వారసుడిగా మాత్రం…….

కానీ, ఇప్పుడు “దేవాల‌యాల విష‌యంలో వైఎస్ వ్యవ‌హ‌రించిన తీరు భేష్‌. ఆయ‌న కుమారుడిగా ఆయ‌న వార‌సుడిగా జ‌గ‌న్ వేస్ట్‌. హిందూ స‌మాజంపై విషం క‌క్కుతున్నారు“.. అనే కొత్తరాత‌లు నిత్యం ప‌త్రిక‌ల్లో క‌నిపిస్తున్నాయి. నాడు వైఎస్ ఏడు కొండ‌ల ప‌రిధి త‌గ్గించాడ‌ని ఇదే చంద్రబాబు, టీడీపీ వాళ్లు నాడు వైఎస్‌కు కూడా క్రిస్టియానిటీ ముద్ర వేశారు. నాడు బాబు అనుకూల మీడియా కూడా ఇదే అంశాన్ని బాగా హైలెట్ చేసి వైఎస్‌పై కొన్ని మ‌తాల్లో వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎంతో ప్రయ‌త్నించింది. ఇది ఎవ్వరూ మ‌ర్చిపోరు.

కాంగ్రెస్ కూడా……

మ‌రి అప్పట్లో వైఎస్ అంటే.. గిట్టని కాంగ్రెస్ స‌హా టీడీపీ నేత‌ల‌కు, వారి అనుకూల మీడియాకు ఇప్పుడు వైఎస్ దేవుడు ఎలా అయ్యారు ? ఎందుకు ఆయ‌న‌ను నిత్యం స్తుతిస్తున్నారు. అంటే.. అక్కడే ఉంది.. అస‌లు కిటుకు. ఎంత సొంత ఇమేజ్‌తో అధికారంలోకి వ‌చ్చాన‌ని చెబుతున్నా.. అంతో ఇంతో త‌న తండ్రి ఫొటోను అడ్డు పెట్టుకునే క‌దా.. జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారం చేశారు. దీంతో వైఎస్ అభిమానులు అంద‌రూ కూడా జ‌గ‌న్‌ను న‌మ్మారు. ఆయ‌న వెంట న‌డిచారు. జ‌గ‌న్‌లో వైఎస్‌ను చూసుకున్నారు. ఇప్పుడు వైఎస్‌ను పొగుడుతూ.. జ‌గ‌న్‌ను తిడితే.. ఈ వ‌ర్గాలు జ‌గ‌న్‌కు దూర‌మ‌వుతాయ‌నేది వీరి వ్యూహం. పోనీ.. ఇలా దూర‌మైన వైఎస్ అభిమాన గ‌ణం.. కాంగ్రెస్‌కానీ, టీడీపికి కానీ.. చేరువ అవుతాయా? అంటే.. కాక‌పోయినా ఫ‌ర్లేదు.. జ‌గ‌న్‌కు దూర‌మైతే.. మాకు ప‌దివేలు. అనే రాజ‌కీయ సూత్రాన్ని ఉటంకిస్తున్నాయి. ఇదీ .. క‌థ‌. అందుకే ఇప్పుడు వీరికి హ‌ఠాత్తుగా వైఎస్ దేవుడ‌య్యాడు.

Tags:    

Similar News