జగన్ ప్రపోజల్ కు నో చెబుతారా…?

తెలుగుదేశం పార్టీలో ఆ సామాజికవర్గానికి ఎంతో ప్రాధ్యాన్యత ఉండేది. విశాఖ జిల్లాకే పరిమితమైన గవర సామాజికవర్గానికి కచ్చితంగా మంత్రి పదవి అప్పట్లో కేటాయించేవారు. రూరల్ జిల్లా అనకాపల్లి [more]

Update: 2019-08-05 08:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఆ సామాజికవర్గానికి ఎంతో ప్రాధ్యాన్యత ఉండేది. విశాఖ జిల్లాకే పరిమితమైన గవర సామాజికవర్గానికి కచ్చితంగా మంత్రి పదవి అప్పట్లో కేటాయించేవారు. రూరల్ జిల్లా అనకాపల్లి నుంచి వారే ముందు వరసలో ఉండేవారు. అలా దాడి వీరభద్రరావు మంత్రిగా రాణించారు. ఆయన అన్న నందమూరి క్యాబినేట్లోనూ, చంద్రబాబు దగ్గర కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా వైసీపీలో గవర సామాజికవర్గానికి సరైన గుర్తింపు లేదన్న ఆవేదన వారిలో ఉంది. జగన్ పార్టీలో మొదట చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కొసవరకూ ఉండకుండా వెళ్ళిపోయారు. ఇక ఆయన శిష్యుడు మళ్ళ విజయప్రసాద్ కి టికెట్ ఇచ్చినా తాజా ఎన్నికల్లో గెలవలేదు. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన భీశెట్టి సత్యవతి వైసీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా గెలవడం మాత్రం కొంత ఊరటను ఇచ్చింది. అయినా ఇపుడు మరికొన్ని పదవులు తమకు కావాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది

దాడికి చాన్స్ …

జగన్ దృష్టిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయనకు అధికార పదవులు ఇచ్చేందుకు జగన్ సిధ్ధంగా ఉన్నారట. వీలైతే ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని కూడా జగన్ ఆలోచనట. దాడి వీరభద్రరావు వంటి వారు పెద్దల సభలో ఉంటే అధికార టీడీపీని సులువుగా ఎదుర్కోవచ్చునని జగన్ భావిస్తున్నారు. అక్కడ టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. అదే సమయంలో వైసీపీకి అంత సంఖ్యా బలం లేదు. ఉన్న వారు కూడా వాగ్ధాటి కలిగిన వారు కాదు. దాంతో దాడి వీరభద్రరావు వంటి వారిని తెస్తే టీడీపీకి నోరెత్తకుండా చేయగలరని జగన్ అంచనా వేస్తున్నారు. దాడి టీడీపీలో ఉండి వచ్చిన నేత కాబట్టి ఆ గుట్లూ మట్లూ ఆయనకు ఎక్కువగా తెలుసు అని కూడా జగన్ భావిస్తున్నారుట. అయితే దాడి వీరభద్రరావు మాత్రం తనకు ఏ పదవులూ వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

వారసుడి కోసమేనట…

తన రాజకీయ వారసుడిగా దాడి రత్నాకర్ ని దాడి వీరభద్రరావు చూడాలనుకుంటున్నారు. తన తరువాత ఎమ్మెల్యేని చేయాలనుకున్నారు. అయితే 2014 ఎన్నికలో వైసీపీ టికెట్ ఇస్తే రత్నాకర్ ఓడిపోయారు. దాంతో పార్టీని వీడి దాడి వీరభద్రరావు వెళ్ళిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఈ ఇద్దరూ తిరిగి వైసీపీ గూటికి చేరారు. అప్పటికే అనకాపల్లి ఎమ్మెలే టికెట్ గుడివాడ అమరనాధ్ కి ఇవ్వడంతో అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తన కుమారుడుకి ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని దాడి వీరభద్రరావు గట్టిగా కోరుతున్నారు. ఆ విధంగా ఉంటూ 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వైసీపీ టికెట్ సాధించాలన్నది దాడి వీరభద్రరావు ఎత్తుగడ. అయితే జగన్ కి మాత్రం కుమారుడి కంటే తండ్రి దాడి వీరభద్రరావు అయితే తన రాజకీయ లక్ష్యాలు నెరవేరుతాయన్న ఆలోచన ఉంది. మరొ దాడి తగ్గుతారా, జగన్ నెగ్గుతారా అన్నది విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా ఉంది.

Tags:    

Similar News