గల్లాను ఈసారి బెజవాడకు షిఫ్ట్ చేస్తారా?

గల్లా జయదేవ్ పార్లమెంటు సభ్యుడిగా పెర్ ఫార్మెన్స్ లో వీక్ గా కనపడుతున్నారు. ఆయన రెండుసార్లు వరసగా గెలిచినప్పటకీ ఈసారి మాత్రం ఆయనకు గెలుపు విషయంలో ఇబ్బందులు [more]

Update: 2021-08-31 00:30 GMT

గల్లా జయదేవ్ పార్లమెంటు సభ్యుడిగా పెర్ ఫార్మెన్స్ లో వీక్ గా కనపడుతున్నారు. ఆయన రెండుసార్లు వరసగా గెలిచినప్పటకీ ఈసారి మాత్రం ఆయనకు గెలుపు విషయంలో ఇబ్బందులు తప్పవు. పార్ట్ టైం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న గల్లా జయదేవ్ ను ఈసారి గుంటూరు నుంచి షిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈసారి ఆచితూచి…

పార్లమెంటు సభ్యుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఈసారి ఆచితూచి అడుగులు వేయనున్నారు. ఎంపీలు సరైనోళ్లు ఉంటే అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనా ఉంది. అందుకే ఎంపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై ఉన్న అసంతృప్తి చంద్రబాబు చెవిలో పడింది. దీంతో ఆయనకు అక్కడి నుంచి వేరే ప్లేస్ కు తరలించాలన్న ఆలోచనలో ఉన్నారు.

చిత్తూరు నుంచి….

చిత్తూరుకు చెందిన గల్లా జయదేవ్ ను గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా చంద్రబాబు పోటీ చేయించారు. రాయపాటి కుటుంబాన్ని కాదని గల్లాకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్ విజయం సాధించారు. అయితే ఆయనపై పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఆయన పనితీరు సరిగా లేదని, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండరన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఎక్కువగా వ్యాపారాలపై ఆయన దృష్టి పెడతారంటున్నారు. దీంతో గల్లా జయదేవ్ ను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయిస్తే కష్టమేనన్న కామెంట్స్ పార్టీ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి.

నానిపై అసంతృప్తి….

మరోవైపు బెజవాడ ఎంపీ కేశినేని నానిపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. దీంతో గల్లా జయదేవ్ ను ఈసారి బెజవాడ పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. కేశినేని నానిని వీలయితే గుంటూరు నుంచి లేకుంటే పక్కన పెట్టేయాలన్నదే చంద్రబాబు నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద గల్లా జయదేవ్ విజయవాడ పార్లమెంటుకు ఈసారి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

Tags:    

Similar News