గల్లావారి.. పొలిటికల్ మిస్టేక్స్.. కొంప ముంచాయా ?
గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ ఎంపీగా విజయం సాధించిన గల్లా జయదేవ్ ఇక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. [more]
గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ ఎంపీగా విజయం సాధించిన గల్లా జయదేవ్ ఇక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. [more]
గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ ఎంపీగా విజయం సాధించిన గల్లా జయదేవ్ ఇక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత 2019 ఎన్నికల్లో జగన్ పెను సునామీని సైతం తట్టుకుని నిలబడిన తర్వాత.. మరింతగా గుంటూరుపై పట్టు పెంచుకున్నారు. రాజధాని అమరావతి ఉద్యమం నుంచి పార్టీలో ఎవరికి కీలక పదవులు ఇవ్వాలి.. ఎవరిని పక్కన పెట్టాలి.. అనే అంశాల వరకు అన్నీ తానై గల్లా జయదేవ్ వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. గుంటూరు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కు పదవి రావడం వెనక కూడా గల్లా జయదేవ్ ఉన్నారు.
ఆయనకే పూర్తి బాధ్యతలు….
అయితే.. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతినింది. కనీసం గౌరవ ప్రదమైన స్థానాలు కూడా దక్కించుకోలేక పోయింది. మరి దీనికి బాధ్యులు ఎవరు ? వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా వైసీపీ దూకుడు పెరిగినా కార్పొరేషన్‌లో ఎంపీ గల్లా జయదేవ్ హవా ఉంటుందని.. ఆయన కొంత వరకు అయినా పార్టీని గెలిపిస్తారని చంద్రబాబు సహా అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక కూడా గల్లా జయదేవ్ కు వదిలేశారు. దీంతో ఆయన తనకు నచ్చిన వారిని, తనకు భజన చేసేవారినే కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్నారనే టాక్ ఉంది.
దారుణమైన ఓటమి….
మొత్తం 57 వార్డులు ఉండగా.. వైసీపీ 45 చోట్ల విజయం సాధించి.. కార్పొరేషన్ పీఠాన్ని ఎగరేసుకు పోయింది. అది కూడా భారీ ఎత్తున అమరావతి ఉద్యమం ఉన్న ప్రాంతంలో.. రాజధాని సెంటిమెంటు రగులుతున్న జిల్లాలో.. వైసీపీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు గళం వినిపిస్తున్న సమయంలో.. ఇలాంటి ఫలితం రావడం సంచలనంగా మారింది. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. ఇది నిజంగా అత్యంత అవమానకర విషయం అనేది పరిశీలకుల మాట. ఓడిపోయినా.. గౌరవ ప్రదమైన డివిజన్లను దక్కించుకోలేక పోయింది. ఇది వ్యక్తిగతంగా గల్లా జయదేవ్ కు కూడా అవమానమే.
కిందిస్థాయి కేడర్ ను…..
ఎంపీ గల్లా జయదేవ్ ఇక్కడ ప్రధానంగా పార్టీ బాధ్యతలు తీసుకున్నా.. ఆయన కింది స్థాయి కేడర్‌ను కలుపుకొని పోవడంలో విఫలమయ్యారు. అధికార పార్టీ నేతల వ్యూహాల ముందు గల్లా జయదేవ్ ఫెయిల్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు గల్లాపై సవాల్ చేసి మరీ ఎంపీగా పోటీ చేసి ఓడిన మోదుగుల ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గల్లాకు పూర్తిగా చెక్ పెట్టేశారు. ఇక టిక్కెట్లు ఇప్పించుకున్న గల్లా జయదేవ్ ఆర్థిక విషయాల్లో మాత్రం అభ్యర్థుల ఆశలు ఆవిరి చేసేశారు.
ఆయన వ్యవహారశైలి…..
ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత అందరి వేళ్లూ.. ఇప్పుడుగల్లా జయదేవ్ వైపే చూపిస్తున్నాయి. ఆయన తీరుతోనే మాజీ మంత్రి డొక్కా, ఎమ్మెల్యే గిరి పార్టీకి దూరమయ్యారు. వీరు పార్టీ వీడినప్పుడు కూడా గల్లా జయదేవ్ పైనే విమర్శలు చేశారు. ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో అన్నీతానై వ్యవహరించిన ఆయన.. ఈ ఓటమికి బాధ్యత వహించాలనే గుసగుస .. తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. గతంలో ఇక్కడ బలమైన నాయకత్వంతో ముందుకు సాగిన పార్టీ ఇప్పుడు అంతే రేంజ్‌లో బలహీన పడడం గమనార్హం. కనీసం ఇప్పటికైనా.. గల్లా జయదేవ్ అందరినీ కలుపుకొనిపోతేనే.. వచ్చే సార్వత్రికానికి పార్టీ పుంజుకుంటుందనేది విశ్లేషకుల మాట మరి ఏం చేస్తారో చూడాలి.