జగన్ పై ప్రేమతోనేనా?

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో తలపండినవారు. ఎప్పటికి ఏది అవసరమో బాగా ఎరిగిన వారు. ఆయన రాజకీయ [more]

Update: 2019-09-07 06:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో తలపండినవారు. ఎప్పటికి ఏది అవసరమో బాగా ఎరిగిన వారు. ఆయన రాజకీయ వ్యూహాలు అలా పక్కాగా ఉంటాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే వ్హూహించి బెర్త్ కంఫర్మ్ చేసుకునే నేర్పు గంటాకే సొంతం. అటువంటి గంటా 2019 ఎన్నికల తరువాత వచ్చేది వైసీపీ అని తెలిసినా కూడా జగన్ నుంచి ఆహ్వానం లేకపోవడం వల్లనే ఎన్నికల ముందు ఆ పార్టీలో గంటా శ్రీనివాసరావు చేరలేకపోయారని అంటారు. ఇదిలా ఉండగా టీడీపీలో ఉంటూ జగన్ గాలిలో సైతం గెలిచిన సత్తా కలిగిన నేత గంటా శ్రీనివాసరావు గత మూడు నెలలుగా మౌనవ్రతం పట్టారు. ఇపుడిపుడే ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. తాను పార్టీ మారేదిలేదని కచ్చితంగా చెప్పని గంటా శ్రీనివాసరావు టీడీపీలో వుంటూనే అన్ని రకలా అవకాశాలకు తలుపులు బార్లా తెరచి వుంచుకున్నారని అంటున్నారు. ఆయన వైఖరి ముందే పసిగట్టిన విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు అందుకే గంటా శ్రీనివాసరావు మీద గయ్యిమంటున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

విశాఖ భూ కభ్జాలపైన మళ్ళీ విచారణ ….

ఏది ఎలా ఉన్న తన టార్గెట్ ని రీచ్ కావడానికి గంటా శ్రీనివాసరావు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారన్నది నిజం. తాజాగా ఆయన‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖ రాశారు. విశాఖ భూ కుంభకోణం విషయంలో తిరిగి సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని అందులో కోరారు. అంతే కాదు, గత సర్కార్ ఆద్వర్యంలోని సిట్ చేసిన దర్యాప్తు నివేదికను కూడా బయటపెట్టాలని కోరారు. అందులో ఎవరు దోషులుగా తేలితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గంటా శ్రీనివాసరావు కోరడం విశేషం. విశాఖ భూ కబ్జాల విషయంలో తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకోవడానికి గంటా ఈ లేఖను ముఖ్యమంత్రికి రాశారని అర్ధమవుతోంది. పైగా సిట్ విచారణ తానే స్వయంగా కోరడం ద్వారా తన నిజాయతీ ఏంటన్నది కూడా గంటా శ్రీనివాసరావు జగన్ కి ఆ లేఖ ద్వారా చెప్పారని అంటున్నారు.

తన రూట్ ఎటో చెప్పేశారా…..

తాను రాసిన లేఖలో జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు గంటా అభిననదనలు తెలియచేయడం కొసమెరుపు. అంటే గంటా జగన్ కి ఈ లేఖ ప్రేమతో రాసినట్లుగా ఉందని అపుడే సెటైర్లు పడుతున్నాయి. ఓ వైపు తాను మచ్చలేనివాడినని చెప్పుకోవడంతో పాటు, మరో వైపు జగన్ పాలనపైన అభినందనలు తెలియచేయడం ద్వారా గంటా జగన్ కి ఏ రకమైన సందేశం పంపారన్న చర్చ విశాఖ జిల్లాతో పాటు, ఏపీ రాజకీయాల్లో వాడిగా వేడిగా సాగుతోంది. తొందరలోనే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని కూడా అంతా అనుకుంటున్న వేళ సిట్ నివేదికలో ఆయన పేరు లేకపోతే జగనే స్వయంగా కండువా కప్పుతారని కూడా అంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు తనదైన ప్రేమలేఖను వండి వార్చారని, అది కూడా జగన్ శ్రీకాకుళం టూర్లో ఉన్నపుడు లేఖ విడుదల చేయడం కూడా మంచి టైమింగ్ పాటించారని అంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు తన దారి ఎటో అన్నది మెల్లగా బయటపెడుతున్నారనుకోవాలి.

Tags:    

Similar News