నిలకడ లేని గంటా.. నిలదొక్కుకునేనా?

గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారనున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారు. వైసీపీ కూడా ఆయన రాకకు ఓకే చెప్పడంతో ఇక చేరిక మాత్రమే తరువాయి. [more]

Update: 2020-07-24 03:30 GMT

గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారనున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారు. వైసీపీ కూడా ఆయన రాకకు ఓకే చెప్పడంతో ఇక చేరిక మాత్రమే తరువాయి. మంచి ముహూర్తం చూసుకుని గంటా శ్రీనివాసరావు జెండా ఎత్తేస్తారంటున్నారు. గంటా శ్రీనివాసరావు నిలకడలేని రాజకీయాలు చేస్తారు. ఒకరకంగా ఆయనకు అదే కలసి వచ్చిందంటారు. ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖలో స్థిరపడి వ్యాపారాలతో ఆర్థికంగా నిలదొక్కుకుని రాజకీయాల్లోకి దిగారు.

టీడీపీ నుంచి…..

గంటా శ్రీనివాసరావు తొలుత తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో అందులో చేరిపోయారు. అక్కడి నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు వరసగా పార్టీలు మారుతున్నారు. ప్రజారాజ్యం ప్రతిపక్షానికే పరిమితం అవ్వడంతో చిరంజీవి చేత దుకాణం క్లోజ్ చేయించిన వారిలో గంటా శ్రీనివాసరావు ఒకరిగా చెబుతారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గంటా శ్రీనివాసరావు మంత్రి అయ్యారు.

ఎన్నికలకు ముందే చేరాలనుకున్నా…..

ఇక కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో గంటా శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే అవంతి శ్రీనివాసరావు పార్టీలో చేరడం, భీమిలి టిక్కెట్ ఆయనకు దక్కడంతో గంటా శ్రీనివాసరావు ఆ ఆలోచనను విరమించుకున్నారు.

వైసీపీలోనూ ప్రత్యర్థులు…..

ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి లేకపోవడంతో గంటా శ్రీనివాసరావు గాలి వైసీపీ వైపునకు మళ్లింది. వైసీపీలో చేరితే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను దాదాపు గంటా శ్రీనివాసరావు మారినట్లవుతుంది. గంటా శ్రీనివాసరావు అంగ, అర్ధబలం ఉండటం వల్లనే పార్టీలు కూడా ఆయన రాకను ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తున్నాయి. ట్రెండ్ ను బట్టి గంటా గాలి వాటం ఉంటుందంటారు. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు పార్టీని వీడితే విశాఖలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. టీడీపీలో ఉండగా సొంత పార్టీ నేత అయ్యన్న పాత్రుడితో గంటాకు పడేది కాదు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లినా అవంతితో నిత్యం ఘర్షణలు తప్పవంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావు వైసీపీలో నిలదొక్కుకుంటాడా? లేదా? అన్నది చూడాల్స ఉంది.

Tags:    

Similar News