రాజకీయ వ్యూహమా.. డోర్స్ క్లోజ్ కాలేదా?

విశాఖ అంటే జగన్ కి మోజు. ఇక విజయసాయిరెడ్డి కూడా అక్కడే మకాం వేశారు. రేపో మాపో రాజధానిగా విశాఖ అవడం ఖాయం. మొత్తం అక్కడికి షిఫ్ట్ [more]

Update: 2020-04-24 14:30 GMT

విశాఖ అంటే జగన్ కి మోజు. ఇక విజయసాయిరెడ్డి కూడా అక్కడే మకాం వేశారు. రేపో మాపో రాజధానిగా విశాఖ అవడం ఖాయం. మొత్తం అక్కడికి షిఫ్ట్ చేశాక వైసీపీకి రాజకీయంగా బలం కావాలి. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీలోకి తీసుకుంటున్న వైసీపీ, రాజకీయ దిగ్గజం గంటాకు నో చెప్పడం వెనక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. గంటా వస్తారన్న ప్రచారం ఇంతవరకూ వినిపించింది. దాన్ని ఖండించేందుకే విజయసాయిరెడ్డి ద్వారా ఆ మాట చెప్పించారని అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీలో గంటా శ్రీనివాసరావు చేరిక ఇప్పటికైతే వాయిదా పడిందనే అంటున్నారు.

విభేదాలేనా …?

గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీలో ఉండే అవకాశాలు అసలు లేవు. ఆయన గంటాని విభేదించి వైసీపీలో చేరారు. మంత్రి పదవి పొందారు. ఇపుడు గంటా శ్రీనివాసరావు కనుక పార్టీ తీర్ధం పుచ్చుకుంటే కచ్చితంగా అవంతి మీద పెను ప్రభావం చూపిస్తుంది. అవంతి భవిష్యత్తుకు కూడా బ్రేక్ పడుతుంది. ఈ నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తానని అంటున్నా ఆ పార్టీ హైకమాండ్ ఆగమంటూ వచ్చింది. ఇపుడు గంటా శ్రీనివాసరావుకు నో ఎంట్రీ అని పక్కా క్లారిటీగా ప్రకటించడం వెనక కూడా అవంతి అలకలు ఉన్నాయని అంటున్నారు.

రెండు చోట్లా అలా …..

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అవంతి భీమిలీ నుంచే పోటీ చేస్తారు. విశాఖ ఉత్తరం సీటుని గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిన రియల్టర్ కే కే రాజుకే మళ్ళీ ఇస్తారు. పైగా రాజు జగన్ కి సన్నిహితుడు కూడా. దాంతో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరినా ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్న ఉండనే ఉంది. ఇక విశాఖ సౌత్ తీసుకుంటే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ కి ఇప్పటి నుంచే కన్ ఫర్మ్ చేశారని అంటున్నారు. అయితే గియితే గంటా విశాఖ తూర్పు నుంచే పోటీ చేయాలి. ఆయన ఇపుడు అక్కడే నివాసం ఉంటున్నారు. మరి సాధారణ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ కాలం ఉంది. అందువల్ల గంటా శ్రీనివాసరావు వస్తారన్న ప్రచారంలో పార్టీలో విభేదాలు ముదరకుండా విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా ప్రకటన చేశారని అంటున్నారు.

సరైన టైంలో…….

ఇక రాజకీయాల్లో అవునంటే కాదనులే అన్న పాట బాగా సరిపోతుంది. గంటా శ్రీనివాసరావును అటు టీడీపీ అధినాయకత్వం అనుమానంగా చూస్తోంది. ఇటు వైసీపీలో రచ్చ అవుతోంది. ఈ క్రమంలో ఉభయతారకంగా ఆయన్ని చేర్చుకోమని వైసీపీ చెప్పిందని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు వంటి దిగ్గజ నేత వస్తానంటే వద్దనే సాహసం ఏ పార్టీ కూడా చేయదన్నది తెలిసిందే. ఇక సరైన సమయంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారని కూడా ఇపుడు వినిపిస్తున్న మాట. గంటా శ్రీనివాసరావు సాటి నేత విశాఖ రాజకీయాల్లో అన్ని పార్టెలోనూ లేరు. పైగా జగన్ కనుక రాజధానిగా విశాఖను ప్రకటిస్తే గంటా లాంటి వారి అవసరం చాలా ఉంటుంది. అందువల్ల గంటా శ్రీనివాస రావును చేర్చుకోమని వైసీపీ అంటున్న మాటలు ఈ రోజుకే వర్తిస్తాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రేపు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News